దుబాయిలో చిక్కుకున్న హైదరాబాదీలు.. కాపాడమంటూ అభ్యర్థన

ABN , First Publish Date - 2021-03-02T10:21:50+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన పర్యాటకులు దుబాయి పర్యటనకు వెళ్లి అక్కడ చిక్కుకున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్‌కు చెందిన అర్చన ట్రావెల్స్ ద్వారా దాదాపు 50 మంది పర్యాటకులు దుబాయి పర్యటనకు వెళ్లారు.

దుబాయిలో చిక్కుకున్న హైదరాబాదీలు.. కాపాడమంటూ అభ్యర్థన

దుబాయి: హైదరాబాద్‌కు చెందిన పర్యాటకులు దుబాయి పర్యటనకు వెళ్లి అక్కడ చిక్కుకున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్‌కు చెందిన అర్చన ట్రావెల్స్ ద్వారా దాదాపు 50 మంది పర్యాటకులు దుబాయి పర్యటనకు వెళ్లారు. పర్యాటకుల్లో 8 మంది పెద్దఅంబర్ పేట, మిగిలిన 34 మంది ఇతర ప్రాంతాలకు చెందిన వారు. హైదరాబాద్ నుంచి దుబాయికి చేరుకున్నాక ట్రావెల్ ఏజెంట్లు వీరిని హోటల్‌లో విడిచిపెట్టి వెళ్లిపోయారు. అనంతరం ఫోన్ చేసిన ఎటువంటి స్పందన లేదు. ట్రావెల్స్ యజమాని బద్దం భోజిరెడ్డికి ఫోన్ చేసినా స్పందించడం లేదంటూ సుదర్శన్ అనే పర్యాటకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అర్చన ట్రావెల్స్ యజమానిని వెంటనే అదుపులోకి తీసుకోవాలంటూ సైబరాబాద్ కమిషనర్‌ను సుదర్శన్ వేడుకున్నాడు. 


అయితే దీనిపై ట్రావెల్స్ యజమాని భోజిరెడ్డి స్పందిస్తూ.. ఇక్కడి నుంచి వెళ్లిన పర్యాటకులను తమ సిబ్బంది స్టార్ హోటల్‌కి తరలించారని చెప్పారు. పర్యాటక ప్రాంతాలను చూసేందుకు పర్యాటకులు బుకింగ్ చేసుకోగా కొంతమంది మాత్రం డబ్బుల చెల్లించలేదని ఆయన తెలిపారు. అంతేకాకుండా పర్యాటకుల్లో 8 మంది మద్యం సేవించి ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగా వారిని టూరిస్ట్ వెహికిల్‌లో తీసుకెళ్లలేదని, దాన్ని మనసులో పెట్టుకుని ఇలా చేస్తున్నారంటూ ట్రావెల్స్ యజమాని భోజిరెడ్డి చెప్పుకొచ్చారు. 


తమ ఆఫీస్‌కి చెందిన నవీన్ అనే వ్యక్తి కూడా పర్యాటకులతో పాటే ఉన్నాడని, ఒకవేళ తాము తప్పు చేస్తే సరిదిద్దుకొంటామని అన్నారు. హైదరాబాద్ నుంచి దుబాయికి వెళ్లిన పర్యాటకులు అక్కడ 3 రోజులు ఉంటారని, వారి పర్యటనకు సంబంధించిన ప్రతి వీడియోను మంగళవారం నుంచి మీడియాకి అందిస్తానని చెప్పారు. దీని ద్వారా అసలు తప్పు ఎవరిదో కూడా చూడాలని కోరారు.

Updated Date - 2021-03-02T10:21:50+05:30 IST