హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన

ABN , First Publish Date - 2020-05-31T18:50:09+05:30 IST

నగరంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.

హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన

హైదరాబాద్: నగరంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ సమాచారంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. క్షేత్రస్థాయిలో సిబ్బందిని హెచ్చరించింది. రాగల 24 గంటలలో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతం, నైఋతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని  ప్రాంతాలకు నైఋతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. 


రాగల 48 గంటలలో ఆగ్నేయ అరేబియా సముద్రం దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తదుపరి 48 గంటలలో ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి తూర్పు మధ్య అరేబియా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాలలో వాయుగుండముగా మారే అవకాశం ఉందన్నారు. దీని వలన సుమారుగా జూన్ 1న కేరళలోకి నైఋతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందన్నారు. చత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాలలో 2.1 కిమీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. 


ఇదిలా ఉంటే.. చత్తీస్‌గఢ్ నుంచి లక్షదీవులు వరకు  తెలంగాణ, రాయలసీమ, దక్షిణ  కర్ణాటక, కేరళ మీదుగా 0.9 కిమీ. ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈరోజు ఆదిలాబాద్, నిర్మల్, కోమరంభీం, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 కిమీ. నుంచి 40కిమీ. వేగంతో) పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఆది, సోమవారాల్లో కొన్నిచోట్ల, ఎల్లుండి చాలాచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది.

Updated Date - 2020-05-31T18:50:09+05:30 IST