నెలాఖరుకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా అదుపులోకి

ABN , First Publish Date - 2020-08-09T07:15:09+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆగస్టు నెలాఖరుకు, మిగతాచోట్ల సెప్టెంబరు చివరికల్లా కరోనా అదుపులోకి వస్తుందని ప్రజారోగ్య సంచాలకులు (డీపీహెచ్‌) డాక్టర్‌ గడల శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు...

నెలాఖరుకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా అదుపులోకి

  • వచ్చే నెలాఖరుకు రాష్ట్రమంతా కంట్రోల్‌
  • ఇక ప్రభుత్వ ఆస్పత్రుల పడకలన్నింటికీ ఆక్సిజన్‌ సౌకర్యం
  • అందుబాటులోకి 18 వేలకు పైగా ఆక్సిజన్‌ బెడ్స్‌
  • ఆస్పత్రులకు చేరిన 25వేల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు 
  • 88,600 హోమ్‌ ఐసొలేషన్‌ కిట్లు సిద్దం
  • కరోనాకు సర్కారు కనిపెట్టిన మందు.. ‘ధైర్యం’ 
  • డీఎంఈ రమేశ్‌రెడ్డి, డీపీహెచ్‌ గడల శ్రీనివాసరావు

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆగస్టు నెలాఖరుకు, మిగతాచోట్ల సెప్టెంబరు చివరికల్లా కరోనా అదుపులోకి వస్తుందని ప్రజారోగ్య సంచాలకులు (డీపీహెచ్‌)  డాక్టర్‌ గడల శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్యవిద్య డైరెక్టరేటు (డీఎంఈ), తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ) ఆధ్వర్యంలోని అన్ని ఆస్పత్రుల్లోని పడకలను ఆక్సిజన్‌ బెడ్స్‌గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు(డీఎంఈ) డాక్టర్‌ రమేశ్‌రెడ్డి వెల్లడించారు. శనివారం కోఠీలోని ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో వారు ఈ వివరాలను తెలిపారు. ప్రస్తుతం 8-9 వేల బెడ్స్‌కు ఆక్సిజన్‌ సరఫరా ఉందని, మిగిలిన 10 వేల పడకలకూ ఆ సౌకర్యం ఏర్పాటు చేస్తామని రమేశ్‌రెడ్డి చెప్పారు. తద్వారా ఆక్సిజన్‌ వసతి కలిగిన మొత్తం 18వేల బెడ్స్‌ అందుబాటులోకి వస్తాయన్నారు. 


తీవ్ర కరోనా ఇన్ఫెక్షన్‌ బారినపడే రోగులకు ఆక్సిజన్‌ అవసరాలను తీర్చేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆక్సిజన్‌ సరఫరా కోసం ఇప్పటికే టెండర్లు పిలిచామన్నారు. అతి కొద్దిరోజుల్లోనే అన్నిచోట్ల క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు ఏర్పాటవుతాయని, వాటి వల్ల నిరాటంకంగా ఆక్సిజన్‌ సరఫరా చేసే వీలు కలుగుతుందని తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రులన్నింటిలోనూ యాంటీబయాటిక్స్‌ను అందుబాటులో ఉంచామన్నారు. వైద్యుల సూచన మేరకే రెమ్‌డెసివిర్‌ను వాడాలని, తీవ్ర ఇన్ఫెక్షన్‌ సోకితేనే దాన్ని వినియోగించాలని కోరారు. కొన్నిసార్లు తీవ్ర ఇన్ఫెక్షన్‌ ఉన్న రోగులు దాన్ని వాడినా ప్రయోజనం ఉండదని డీఎంఈ వివరించారు. ఆ మందు ప్రతికూల ప్రభావాలను కూడా చూపుతున్నట్లు నిపుణులు గుర్తించారని రమేశ్‌రెడ్డి వెల్లడించారు. ప్లాస్మా థెరపీ అందరికీ అవసరం ఉండదని, దానిపేరిట దోపిడీకి గురికావొద్దని ప్రజలకు సూచించారు. అది కొన్ని కేసులకే అవసరం అవుతుందని, వెంటిలేటర్‌పై ఉన్నవారికి ప్లాస్మాథెరపీ వల్ల ఉపయోగం ఉండదన్నారు. ప్లాస్మా దానం చేయాలన్నా తగిన విధంగా యాంటీబాడీస్‌ డెవలెప్‌ కావాల్సి ఉంటుందన్నారు. అన్ని ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది కొరత లేకుండా తక్షణ నియామకాలు చేపట్టామన్నారు. ప్రతి ఆస్పత్రిలో ఐసొలేషన్‌, ఐసీయూ వార్డులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 


డెక్సామెథసోన్‌ అద్భుత ఔషధం 

ప్రభుత్వం చేపట్టిన కట్టుదిట్టమైన చర్యల వల్ల గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆగస్టు చివరి నాటికి, సెప్టెంబరు చివరినాటికి రాష్ట్రంలో మిగతా చోట్ల కరోనా పూర్తిగా అదుపులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. కరోనా వైర్‌సకు తెలంగాణ ప్రభుత్వం ఒక మందును కనిపెట్టిందని, దాని పేరే ధైర్యమని డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌(డీపీహెచ్‌) డాక్టర్‌ గడల శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇచ్చిన ఽఽధైర్యం వల్లే రాష్ట్రంలో రికవరీ రేటు 70 శాతానికి పెరిగిందన్నారు. కరోనా సోకిన రెండు వారాలు చాలా కీలకమని, తొలివారంలో లక్షణాల ఆధారంగా చికిత్స తీసుకోవాలని, సొంత వైద్యం ఎట్టిపరిస్థితుల్లోనూ చేసుకోవద్దని సూచించారు. రెండోవారంలో డెక్సామెథసోన్‌ ఇవ్వడం వల్ల చాలా మంది కోలుకున్నారని, అద్భుతంగా పనిచేస్తోందని తెలిపారు. ప్రతి జిల్లాలో పీహెచ్‌సీ స్థాయిలో, జీహెచ్‌ఎంసీలో పరీక్షా కేంద్రాల వద్ద హోమ్‌ ఐసొలేషన్‌ కిట్లు అందుబాటులో ఉంచామన్నారు. 88,600 హోమ్‌ ఐసొలేషన్‌ కిట్లు సిద్ధంగా ఉండగా,  ఒక్క జీహెచ్‌ఎంసీ ప్రాంతానికే 33 వేల కిట్లను కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటికే 5 లక్షల యాంటీజెన్‌ కిట్లకు తెప్పించామని, మరో 10 లక్షల కిట్లకు ఇండెంట్‌ పెట్టామన్నారు. అన్ని ప్రభుత్వ కరోనా ఆస్పత్రుల్లో 25 వేల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. 

Updated Date - 2020-08-09T07:15:09+05:30 IST