HYD: నిమజ్జనంపై తొలగిన సందిగ్ధత

ABN , First Publish Date - 2021-09-17T17:31:44+05:30 IST

గణేష్‌ విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, ఇతర ప్రభుత్వ విభాగాలు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. నాలుగైదు రోజులుగా వేచి...

HYD: నిమజ్జనంపై తొలగిన సందిగ్ధత

రంగంలోకి దిగిన ప్రభుత్వ విభాగాలు

సాగర తీరంలో 44 క్రేన్లు

ఇప్పటికే పది అందుబాటులో..

శోభాయాత్ర మార్గంలో మరమ్మతుకు ప్రత్యేక బృందాలు

పారిశుధ్య నిర్వహణకు 215 టీంలు


హైదరాబాద్‌ సిటీ: గణేష్‌ విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, ఇతర ప్రభుత్వ విభాగాలు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. నాలుగైదు రోజులుగా వేచి చూసే ధోరణి అవలంబించిన ప్రభుత్వ శాఖలు గురువారం రంగంలోకి దిగాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే మహా నిమజ్జన ప్రధాన కేంద్రం హుస్సేన్‌సాగర్‌ తీరంలో విస్తృత ఏర్పాట్లకు శ్రీకారం చుట్టాయి. పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లతోపాటు, బారికేడ్లు, క్రేన్ల అమరికకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్‌లో 35 వేల వరకు ఐదు అడుగులు అంతకంటే ఎక్కువ ఎత్తయిన విగ్రహాలు ప్రతిష్టించారని పోలీస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో మెజార్టీ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తారు. ఈ నేపథ్యంలో గతంలోలానే నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారొకరు తెలిపారు. ఈ నెల 19న మహా నిమజ్జనం జరుగుతుందని భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ఇప్పటికే  ప్రకటించింది. 


సాగర తీరంలో 44 క్రేన్లు

హుస్సేన్‌సాగర్‌ చుట్టూ 44 క్రేన్లు ఏర్పాటు చేయాలని మొదట జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. హైకోర్టు ఆంక్షలతో ఇప్పటి వరకు 12 క్రేన్లను మాత్రమే  అధికారులు అమర్చారు. ఎన్‌టీఆర్‌ మార్గ్‌లో నాలుగు, నెక్లె్‌సరోడ్‌ పీపుల్స్‌ ప్లాజాలో నాలుగు, ట్యాంక్‌బండ్‌పై రెండు, బేబీ పాండ్ల వద్ద రెండు క్రేన్లు ఏర్పాటు చేశారు. సాగర తీరంలో మూడో రోజు నుంచే విగ్రహాల నిమజ్జనం మొదలైంది. ఇళ్లలో పూజ చేసిన, పలు మండపాల్లో ప్రతిష్టించిన విగ్రహాలను కొందరు నిమజ్జనం చేస్తున్నారు. సాగర తీరంలో మరో 34 క్రేన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ట్యాంక్‌బండ్‌పై 14 క్రేన్లు అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. ఆధునీకీకరణ పనుల నేపథ్యంలో ఎన్ని క్రేన్ల ఏర్పాటు సాధ్యమవుతుందన్నది క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు ప్రారంభించిన అనంతరం స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. పీపుల్స్‌ ప్లాజాలో మొదటి సారి క్రేన్లు ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి సంజీవయ్యపార్కు వైపూ క్రేన్లు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. హుస్సేన్‌సాగర్‌తో కలిపి సరూర్‌నగర్‌, సఫిల్‌గూడ, కాప్రా, ప్రగతినగర్‌ తదితర చెరువులతోపాటు, బేబీ పాండ్ల వద్ద 106 క్రేన్లు ఏర్పాటు చేస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ రవాణా విభాగం అధికారొకరు చెప్పారు. 


మధ్యాహ్నం వరకు మహాగణపతి...

ఖైరతాబాద్‌ మహా గణపతిని ఎప్పటిలానే ఎన్‌టీఆర్‌ మార్గ్‌లో నిమజ్జనం చేయనున్నారు. మూడు, నాలుగేళ్లుగా చేస్తున్న తరహాలోనే మధ్యాహ్నానికే భారీ గణపతి నిమజ్జనం పూర్తయ్యేలా జీహెచ్‌ఎంసీ, పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నిర్వాహకులతో ఈ విషయంపై చర్చిస్తున్నామని, అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 


320 కి.మీల మేర.. 

వివిధ మార్గాల్లో సాగర తీరానికి గణనాథులు తరలివచ్చే 320 కిలోమీటర్ల శోభాయాత్ర మార్గాల్లో రహదారుల మరమ్మతు, పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గుంతలు, కంకర తేలిన రోడ్లను ఈ బృందాలు బాగు చేస్తాయి. ట్యాంక్‌బండ్‌, ఎన్‌టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్‌తోపాటు శోభాయా త్ర మార్గాల్లో 8160 మంది సిబ్బందితో కూడిన 215 గణేష్‌ యాక్షన్‌ టీం(జీఏటీ)లు చెత్త ఎప్పటికప్పుడు తొలగించనున్నాయి. శోభాయాత్ర మార్గంలో వాటర్‌ బోర్టు ఆధ్వర్యంలో వాటర్‌ ప్యాకెట్ల పంపీణీ చేయనున్నారు. జీహెచ్‌ఎంసీ మాస్క్‌లు ఉచితంగా అందించనుంది.


ఖైరతాబాద్‌, బాలాపూర్‌ గణపతులకు తాపేశ్వరం లడ్డూలే

మండపేట, సెప్టెంబరు 16: తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలోని సురుచి ఫుడ్స్‌ ఖైరతాబాద్‌ వినాయకుడికి సమర్పించేందుకు 100 కిలోల లడ్డూ తయారు చేసింది. దీనిని గురువారం రాత్రి హైదరాబాద్‌ తరలించినట్టు ఆ సంస్థ పీఆర్వో వర్మ తెలిపారు. శుక్రవారం దీనిని కమిటీ ద్వారా స్వామివారికి లడ్డూను సమర్పిస్తామని పేర్కొన్నారు. శనివారం లడ్డూ ప్రసాదాన్ని సురుచి సంస్థ అధినేత పోలిశెట్టి మల్లికార్జునరావు భక్తులకు పంపిణీ చేస్తారు. బాలాపూర్‌ గణపతికి తాపేశ్వరానికే చెందిన హనీ ఫుడ్స్‌ అధినేత దేవు ఉమామహేశ్వరరావు 15 ఏళ్లుగా లడ్డూ తయారుచేసి సమర్పిస్తున్నారు. ఈ ఏడాది 21 కిలోలతో తిరుమల లడ్డూ మాదిరిగా తయారు చేసి వెండి గిన్నెలో సమర్పించారు. 


పది వేల విగ్రహాలు : సీపీ మహేష్‌ భగవత్‌ 

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 16(ఆంద్రజ్యోతి): గతేడాది రాచకొండలో 10 వేలకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఈ ఏడాది 6500 విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. చిన్నవి పెద్దవి కలిపి ఈ ఏడాది కూడా 10వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం జరిగే అవకాశం ఉందని సీపీ మహేష్‌ భగవత్‌ వెల్లడించారు.

Updated Date - 2021-09-17T17:31:44+05:30 IST