ఈటలకు పొగ!

ABN , First Publish Date - 2021-05-01T08:24:42+05:30 IST

టీఆర్‌ఎస్లో మంత్రి ఈటల రాజేందర్‌కు పొగపెడుతున్నారా? ఇది ఆయనను పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి పొమ్మనలేక పెట్టిందా? ఈ ప్రశ్నలకు శుక్రవారం అనూహ్యంగా చోటుచేసుకున్న పరిణామాలు అవుననే సమాధానాలకు ఆస్కారం కల్పిస్తున్నాయి.

ఈటలకు పొగ!

  • టీఆర్‌ఎస్‌ సొంత చానల్‌లో భూ కబ్జా కథనాలు
  • వెంటనే విచారణకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు
  • కేబినెట్‌ నుంచి తొలగింపు కోసమేనని విస్తృత ప్రచారం
  • మినీ మునిసిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిశాక..
  • అనుకూల చానల్స్‌లోనూ ప్రసారాలు
  • నిగ్గు తేల్చాలని సీఎస్‌కు, విజిలెన్స్‌ డీజీకి సీఎం నిర్దేశం
  • మంత్రి ఈటల ప్రస్తావన లేకుండా విచారణకు ఆదేశాలు


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్లో మంత్రి ఈటల రాజేందర్‌కు పొగపెడుతున్నారా? ఇది ఆయనను పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి పొమ్మనలేక పెట్టిందా? ఈ ప్రశ్నలకు శుక్రవారం అనూహ్యంగా చోటుచేసుకున్న పరిణామాలు అవుననే సమాధానాలకు ఆస్కారం కల్పిస్తున్నాయి. తొలుత అధికార పార్టీ సొంత టీవీ చానల్‌ టీ న్యూస్‌ సహా ప్రభుత్వానికి అనుకూలం అనే పేరున్న మూడు టీవీ చానల్స్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ భూ కబ్జాకు పాల్పడినట్లు కథనాలు వచ్చాయి. ఈటలపై ఆరోపణలతో సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు అందినట్లు సామాజిక మాధ్యమాల ద్వారా ఒక లేఖ బయటికి వచ్చింది. ఈ వ్యవహారంపై సీఎం విచారణకు ఆదేశించినట్లు ఆయన కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. ఇవన్నీ ఒకే రోజు గంటల వ్యవధిలో వెంటవెంటనే చోటుచేసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే ఈటల రాజేందర్‌పై భూ కబ్జా ఆరోపణలు యాధృచ్చికంగా కాకుండా, పక్కా వ్యూహం ప్రకారం బయటికి వచ్చాయనే అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. మినీ మునిసిపల్‌ ఎన్నికల పోలింగ్‌ గడువు ముగిసిన కొద్ది సేపటికే టీఆర్‌ఎస్‌, ప్రభుత్వ అనుకూల టీవీ చానళ్లలో ఈటలపై భూ కబ్జా ఆరోపణల కథనాలు ప్రసారం కావటాన్ని పలువురు ప్ర స్తావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇక ఎటువంటి ఎన్నిక లు లేకపోవటం, ప్రభుత్వంలో నాయకత్వ మార్పు ఉండవచ్చనే అంచనాలు వెలువడుతున్న క్రమంలో ‘ఆరోగ్య మంత్రికి కబ్జా రోగం’ పేరుతో ఈటలపై ఆరోపణల కథనాలకు ప్రాధాన్యం ఇవ్వడం కేబినెట్‌లో చేర్పులు, మార్పులకు సంకేతమనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


వ్యతిరేకత రాకుండా ఆరోపణలు.!

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేయటమేకాక, రాష్ట్రంలో బలమైన బీసీ నాయకుడిగా గుర్తింపు పొందిన ఈటల రాజేందర్‌ వంటి నేతను కేబినెట్‌ నుంచి తప్పించటం వల్ల వచ్చే వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకొని ఆయనపై భు కబ్జా ఆరోపణలు బయటికి వచ్చి ఉండవచ్చని అంటున్నారు. దీంతో తనంతట తానుగా ఈటల కేబినెట్‌ నుంచి తప్పుకొంటారని ప్రభుత్వ పెద్దలు భావించవచ్చని, లేకపోతే భూకబ్జా ఆరోపణలను రుజువు చేసి, ఆయనపై వేటు వేయాలనేది వారి ఉద్దేశం కావచ్చని చెబుతున్నారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమ సమయంలో మంచి సాన్నిహిత్యం ఉన్న సీఎం కేసీఆర్‌, మంత్రి ఈటల మధ్య గడిచిన మూడు, నాలుగేళ్లుగా దూరం పెరుగుతూ వచ్చినట్లుగా టీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చ ఉంది. 2014లో టీఆర్‌ఎస్‌ తొలి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌  ఈటల రాజేందర్‌కు కీలకమైన ఆర్థిక శాఖను అప్పగించారు. కొంతకాలం అంత సజావుగానే సాగినప్పటికీ.. ఆ తరువాత సీనియర్లకు ఇదివరకటి గుర్తింపు దక్కటంలేదనే భావన రాజేందర్‌లో ఏర్పడిందని అంటారు. ఈక్రమంలోనే సీఎంతో దూరం క్రమంగా పెరుగుతూ పోయిందని, 2018 అసెంబ్లీ ముందస్తు ఎన్నికల నాటికి అది పతాక స్థాయికి వెళ్లిందనే చర్చ పార్టీలో ఉంది. ఆ ఎన్నికల్లోనే తనను ఎమ్మెల్యేగా ఓడించటానికి సొంత పార్టీకి చెందిన కొందరు నేతలు ప్రయత్నం చేశారంటూ బాహాటంగానే ఈటల రాజేందర్‌ ధ్వజమెత్తారు. 


రెండో మంత్రి పదవి ఆలస్యం..

టీఆర్‌ఎస్‌ రెండవసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈటలను సీఎం కేసీఆర్‌ కేబినెట్‌లోకి తీసుకోలేదు. చివరికి కేబినెట్‌ విస్తరణలో ఈటలకు చోటు లభించనప్పటికీ, అధిష్ఠానం ఉద్దేశపూర్వకంగా ఉక్కపోతకు గురిచేసినట్లుగా ఆయన సన్నిహితులు ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు.  ఈటల కు కొత్తగా వైద్య, ఆరోగ్య శాఖను అప్పగించారు. ఆ తర్వాత వివిధ సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. రెవెన్యూ శాఖలో సంస్కరణలు చేపట్టే సమయంలో కేబినెట్‌లో చర్చించిన వివరాలను రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలకు మంత్రి ఈటల లీక్‌ చేశారని టీఆర్‌ఎస్‌ సొంత పత్రికలోనే కథనాలు వచ్చాయి. మరోవైపు ఆయన టీఆర్‌ఎ్‌సను వీడబోతున్నారని, కొత్తగా పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జరిగింది. ఈక్రమంలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్‌ కొత్త పార్టీలను పాన్‌డబ్బాతో పో లుస్తూ వ్యాఖ్యలు చేశారనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి ఈటల  టీఆర్‌ఎ్‌సకి వ్యతిరేకంగా పనిచేసినట్లు కొందరు నేతలు సీఎం కేసీఆర్‌కు నివేదించారని చెబుతున్నారు. 


తెరపైకి భూ కబ్జా ఆరోపణలు

తాజాగా మంత్రి ఈటలపై భూ కబ్జా ఆరోపణలు తెరపైకి వచ్చాయి. శుక్రవారం సాయంత్రం 5గంటలకు మినీ మునిసిపల్‌ ఎన్నికల పోలింగ్‌ గడువు ముగియటం ఆల స్యం ఈటలపై భూకబ్జా ఆరోపణల కథనాల ప్రసారాలు మొదలయ్యాయి. టీఆర్‌ఎస్‌ సొంత చానల్‌ టీ న్యూస్‌లో ‘వందల కోట్ల విలువైన భూములను కాజేసిన ఈటల’, ‘బడుగు, బలహీన వర్గాలకు చెందిన విలువైన భూములను గుంజుకోవాలని చూసిన మంత్రి ఈటల’, ‘మంత్రి ఈటల రాజేందర్‌ భూ కబ్జాకు పాల్పడ్డారంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు’ అంటూ ప్రత్యేక బులెటిన్స్‌ నడిపింది. ఒకవైపు కొన్ని టీవీ చానళ్లలో (ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి కాదు) ఈ కథనాలు వస్తుండగానే, ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్‌ విచారణకు ఆదేశించినట్లు రాత్రి 7.16 గంటలకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. అయితే అందులో ఎక్కడా మంత్రి ఈటల ప్రస్తావన తీసుకురాలేదు. ‘‘మెదక్‌ జిల్లా ముసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని భూములు కబ్జాకు గురయ్యాయనే విషయంలో తనకు అందిన ఫిర్యాదును పురస్కరించుకొని వెంటనే దర్యాప్తు జరిపి సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్‌ ద్వారా తెప్పించి రిపోర్టు అందజేయాల్సిందిగా సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ భూముల విషయంలో వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గు తేల్చాల్సిందిగా విజిలెన్స్‌ డీజీ పూర్ణచందర్‌రావును సీఎం ఆదేశించారు. సత్వరమే ఇందుకు సంబంధించి ప్రాథమిక నివేదికను అందజేసి, అనంతరం సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికలను అందజేయాల్సిందిగా సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


మరికొందరు మంత్రులపైనా వేటు?

ఈటలతోపాటు, మరికొందరు మంత్రులపై వేటు పడుతుందనే ప్రచారం టీఆర్‌ఎస్‌ వర్గాల్లో జరుగుతోంది. తాజా భూ కబ్జా ఆరోపణలు, సీఎం కేసీఆర్‌ వెంటనే జోక్యం చేసుకొని విచారణకు ఆదేశించటం వెరసి ఈటలను కేబినెట్‌ నుంచి తప్పించటం కోసమే అనే వాదనలు ఆ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒక్క ఈటలపైనే కాకుండా, జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఒకరిద్దరు మంత్రులపైనా వేటు పడవచ్చని అనుమానిస్తున్నారు. ఈమేరకు కీలక శాఖను నిర్వహిస్తున్న ఓ మంత్రికి ఇప్పటికే ప్రభుత్వ పెద్దల నుంచి సంకేతాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన దగ్గర చాలా కాలంగా పనిచేస్తున్న వ్యక్తిగత కార్యదర్శి ఈ కారణంగానే రాజీనామా చేశారని సమాచారం. నాయకత్వ మార్పు జరిగితే సహజంగానే కొత్త కేబినెట్‌ కొలువుదీరాల్సి ఉంటుందని, నాయకత్వ మార్పు ఆలస్యమైతే కేబినెట్‌లో మార్పులు, చేర్పులకు పరిమితం కావచ్చనే ప్రచారం జరుగుతోంది.


ఇదే సమయంలో ఎందుకు?

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై భూ కబ్జా ఆరోపణలు అధికార టీఆర్‌ఎస్‌, ప్రభుత్వ అనుకూల చానళ్లలో ప్రసారం కావటం కూడా చర్చనీయాంశమైంది. కరోనా పరిస్థితులు తలెత్తిన నుంచి దాని కట్టడి కోసం మంత్రి ఈటల రాజేందర్‌ క్షేత్ర స్థాయిలో గట్టిగా పనిచేస్తున్నారనే పేరు వచ్చింది. అయితే కరోనా రెండవ దశ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం తీరును హైకోర్టు ఎండగడుతూ వస్తోంది. ఈ పరిస్థితి నుంచి ప్రజలు, రాజకీయ పార్టీల దృష్టిని మళ్లించటం కోసమే మంత్రి ఈటలపై భూ కబ్జా ఆరోపణలను తెరపైకి తెచ్చారా? అనే అనుమానాలు ఒక వర్గం నుంచి వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2021-05-01T08:24:42+05:30 IST