తెలంగాణ సర్కార్‌కు తలనొప్పిగా మారిన ‘హుజూరాబాద్’

ABN , First Publish Date - 2021-08-11T22:12:12+05:30 IST

హుజూరాబాద్ ఉప ఎన్నిక సర్కార్‌కు తలనొప్పిగా మారింది. మూడు కోట్లకు పైగా రాష్ట్ర జనాభాలో మెజారిటీ ప్రజలు బీసీలే ఉంటారు.

తెలంగాణ సర్కార్‌కు తలనొప్పిగా మారిన ‘హుజూరాబాద్’

హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక సర్కార్‌కు తలనొప్పిగా మారింది. మూడు కోట్లకు పైగా రాష్ట్ర జనాభాలో మెజారిటీ ప్రజలు బీసీలే ఉంటారు. ఇందులో రెండు కోట్లకు పైగా ఉన్న వివిధ బీసీ కులాలకు గతంలో ప్రభుత్వం కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన పెద్దగా అభివృద్ధి జరగలేదన్నది బీసీ సంఘాల నేతలు చెప్తున్న మాట. నాలుగు సంవత్సరాల క్రితం బీసీ మంత్రులు, బీసీ సంఘాల ప్రతినిధులతో 210 తీర్మానాలను చేసి ఆమోదించారు. సబ్ ప్లాన్ ద్వారా నిధులు ఏర్పాటు చేసి ఆయా వర్గాలకు ఖర్చు చేయాలనుకున్న నిధులు లేకపోవడంతో ఏళ్ల తరబడి బీసీ సంక్షేమ శాఖ ఖాళీగా ఉంటుంది. ఇక ఆత్మ గౌరవ భవనాలు, నేతన్నలకు ఇచ్చిన హామీలు, బీసీల అభ్యున్నతికి ప్రత్యేక పాలసీ అంటూ ఉదర గొట్టిన సర్కార్ దాన్ని గాలికి వదిలేసి చేతులు దులుపుకొంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 5.2 లక్షల లోన్ అప్లికేషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో కేవలం 2015 , 2018 లో కేవలం రెండు సార్లు మాత్రమే లోన్లు ఇచ్చారు. ఐదు లక్షల మందిలో కేవలం యాబై వేల మందికి మాత్రమే లోన్లు ఇచ్చారు.


ఇక రజక, నాయి బ్రాహ్మణ, వడ్డెర, కృష్ణ బలిజ, పూసల, వాల్మీకి బోయ, భట్రాజు, మేధర, విశ్వ బ్రాహ్మణ, కుమ్మరి, గీత పనివారలకు ఫిడరేషనులు ఉన్నాయి. అయితే ఆయా ఫెడరేషన్‌లకు ప్రభుత్వం మూడు ఏళ్లనుండి ఒక్క రూపాయి కేటాయించలేదు. కుల వృత్తులకు శిక్షణ ఇచ్చిన పరిస్థితి లేదు. 2014 ఎన్నికల్లో అన్ని కుల వృత్తులకు ఫెడరేషన్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పిన అది పూర్తిస్థాయిలో చేపట్టలేదు. 2016లో 35 సంచార జాతులను కలుపుతూ ఎంబీసీ ఏర్పాటు చేశారు. దీనికోసం జిల్లాల వారీగా సంచార జాతుల జనాభా గుర్తించి వారి అభివృద్ధి కొసం 2,433 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. ఇందులో 350కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఒక్క దళిత వర్గానికి మాత్రమే నేరుగా పది లక్షలు ఇవ్వడం ఏంటని బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. మెజారిటీ వర్గంగా ఉన్న బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2021-08-11T22:12:12+05:30 IST