రోగానికి తొలి ఔషధం అదే!

ABN , First Publish Date - 2020-06-19T05:30:00+05:30 IST

మానవ సమాజాన్ని బతికించేది సహకారం మాత్రమే! ధనం, అధికారం, పదవి, హోదా, పాండిత్యం... ఇవేవీ ఆపత్కాలంలో అక్కరకు రావని కరోనా కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది. అలాగే ‘మనిషికి మనిషి దూరం పాటించాలి’ అంటే ‘ఆపద సమయంలో అక్కరకు రాకుండా పోవాలి’ అని కాదు అర్థం...

రోగానికి తొలి ఔషధం అదే!

మానవ సమాజాన్ని బతికించేది సహకారం మాత్రమే! ధనం, అధికారం, పదవి, హోదా, పాండిత్యం... ఇవేవీ ఆపత్కాలంలో అక్కరకు రావని కరోనా కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది. అలాగే ‘మనిషికి మనిషి దూరం పాటించాలి’ అంటే ‘ఆపద సమయంలో అక్కరకు రాకుండా పోవాలి’ అని కాదు అర్థం. ప్రభుత్వం ‘జనహితార్థం జారీ’ అంటూ మనం కాల్‌ చేసినప్పుడల్లా ‘మనం దూరం పెట్టాల్సింది రోగాన్ని! రోగిని కాదు’ అని చెప్పేది అందుకే! 


రోగి వేరు, రోగం వేరు. రోగాన్ని పారద్రోలాలి. రోగిని చేరదీయాలి. రోగి మీద మనకు ఎలాంటి ద్వేషం, కోపం ఉండకూడదు. ఉంటే మనం మనుషులమే కాదు! రోగి పట్ల ఎంతటి కరుణ కనబరచాలో బుద్ధుడు ప్రత్యక్షంగా చూపించిన సంఘటన ఇది.

అయోధ్య, సాకేత్‌, అజనవనం అనే మూడు నగరాలు కలిసి ఉండేవి. వీటిని ‘త్రిపురాలు’ అనేవారు. అజనవనం ఆ రోజుల్లో సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం. అక్కడ పెద్ద ఆరామం ఉండేది. అది విద్యాకేంద్రంగా అలరారింది. అజనవన ఆరామంలో రోమకేశుడు అనే భిక్షువు ఉండేవాడు. ఆయన తన పని తాను చేసుకొనేవాడు. ఎవరు ఏ పని చెప్పినా కోపగించుకొనేవాడు.


‘‘ఏమిటీ! మీకు పనిచేసి పెట్టాలా? నేను ఇక్కడకు వచ్చింది నా అధ్యయనం సాగించడానికి! మీకు పని చేసిపెట్టడానికి కాదు’’ అని కసిరికొట్టేవాడు.

అలా కొన్నాళ్ళు సాగింది. ఒకసారి అతనికి అనారోగ్యం వచ్చి పడింది. కొంతకాలం ఎవరినీ సహకారం అడగకుండా నెట్టుకొచ్చాడు. కానీ, రోగం తగ్గలేదు. మరింత ముదిరింది. అతను మంచం పడ్డాడు. అప్పుడు -

‘‘భిక్షువులారా! నాకు కాస్త సహాయం చేయండి. ఔషధం తెచ్చి పెట్టండి’’ అని అడిగేవాడు. 

‘‘ఆహాఁ! రోమకేశా! మేము ఇక్కడకు వచ్చింది నీ సేవ కోసం కాదు. మమ్మల్ని మేము సంస్కరించుకోవడానికి!’’ అంటూ వారు అతణ్ణి పట్టించుకొనేవారు కాదు. అతను కొన్నాళ్ళు తన గదిలో, మంచంలోనే ఉండిపోయాడు.

ఒక రోజున భగవాన్‌ బుద్ధుడు అజనవనానికి వచ్చి, ఆరామాన్ని చూడడానికి వెళ్ళాడు. అక్కడ రోమకేశుని గది నుంచి దుర్వాసన రావడంతో ఆగాడు. నెమ్మదిగా గదిలోకి వెళ్ళాడు. అక్కడ అరుగు మీది పక్క మీద దీనస్థితిలో ఉన్న భిక్షువు రోమకేశుడు కనిపించాడు. అతని పక్కంతా మలమూత్రాలతో నిండిపోయింది. శరీరం మీడ పుండ్లు పడి, పురుగులు పట్టి ఉన్నాయి.

రోమకేశుని గురించి బుద్ధుడికి తెలుసు. వెంటనే అక్కడ ఉన్న భిక్షువులను పిలిచాడు. తన వెంట ఉన్న ఆనందునితో -

‘‘ఆనందా! వేడి నీళ్ళు పట్టుకురా! ఔషధాలు సిద్ధం చెయ్యి’’ అని చెప్పాడు. 

వేడి నీరు రాగానే రోమకేశుడికి స్నానం చేయించాడు. కొత్త చీవరాన్ని చుట్టి, పక్క మార్చాడు. ఔషధాలు పూసి, కట్టు కట్టాడు. బుద్ధుడే స్వయంగా సేవ చేయడంతో సిగ్గుపడిన మిగిలిన భిక్షువులు ముందుకు వచ్చి సహాయం చేశారు.

తరువాత బుద్ధుడు వారితో - ‘‘భిక్షువులారా! రోగి పట్ల మనకు అసూయ, ద్వేషం ఉండకూడదు. మనకు నచ్చనివి అతని ఆలోచనలు అయితే వాటిని మార్చడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని, మనం కూడా అలాగే ప్రవర్తించకూడదు. రోగికి కావలసింది తోటివారి సహకారం. అదే రోగానికి తొలి ఔషధం.... రోగికి బలం, ధైర్యం’’ అని చెప్పాడు.

ఆనాటి నుంచి భిక్షువులు అతని బాగోగులను పట్టించుకున్నారు. రోమకేశుడు త్వరగా కోలుకున్నాడు. తన బుద్ధిని మార్చుకున్నాడు. కాబట్టి, విపత్కర పరిస్థితులలోనే సహకారం మరింత అవసరం. ‘సహకారమే సంఘ లక్షణం’ అని చాటిన ధర్మం -  బౌద్ధం!

-బొర్రా గోవర్ధన్‌


Updated Date - 2020-06-19T05:30:00+05:30 IST