‘తరుగు’ దోపిడీ: 64 కోట్లు

ABN , First Publish Date - 2020-02-20T10:07:42+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం విక్రయించిన రైతులకు తీరని నష్టం కలిగింది. వ్యాపారులు, దళారుల నుంచి

‘తరుగు’ దోపిడీ: 64 కోట్లు

  • ఖరీ్‌ఫలో 47.11 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
  • ఒక క్వింటాల్‌కు ఏడున్నర కిలోల కోత
  • కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన రైతులకు తీరని నష్టం

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం విక్రయించిన రైతులకు తీరని నష్టం కలిగింది. వ్యాపారులు, దళారుల నుంచి రైతులకు విముక్తి కలిగించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే... వాటిని ఆసరాగా చేసుకొని రైస్‌ మిల్లర్లు తీవ్ర దోపిడీకి పాల్పడ్డారు. సగటున ఒక క్వింటాల్‌ ధాన్యానికి ఏడున్నర కిలోల చొప్పున తరుగు తీసి రైతులకు నష్టం కలిగించారు. ఇలా ఒక బస్తాకు 5 కిలోల చొప్పున తరుగు తీశారు. దీంతో క్వింటాలుకు 7.50 కిలోలు రైతు నష్టపోవాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం కనీస మద్దతు ధర సాధారణ రకానికి ఒక క్వింటాకు రూ.1,815 ఉంది. ఈ లెక్క ప్రకారం చూస్తే 9.20 లక్షల మంది రైతులు ఈ ఒక్క ఖరీఫ్‌ సీజన్‌లోనే సుమారు రూ.64.13 కోట్లు నష్టపోయారు. ఈ లాభాన్నంతా మిల్లర్లే అర్జించారు. పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3,670 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దోపిడీ జరుగుతోందని రైతులు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదు. 

దోపిడీకి మార్గాలివే

పౌరసరఫరాల శాఖ ధాన్యం సేకరణకు సంబంధించి కొన్ని నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించింది. తేమ శాతం గరిష్ఠంగా 17 శాతానికి మించకూడదని, చెత్త తాలూకు 1 శాతం, మట్టిపెళ్లలు, రాళ్లు ఉంటే 1 శాతం, చెడిపోయిన, రంగుమారిన, మొలకెత్తిన, పురుగు తిన్న ధాన్యం ఉంటే 5 శాతం, పూర్తిగా తయారుకాని ముడుచుకుపోయిన ధాన్యానికి 3 శాతం వరకు మినహాయింపులు ఇచ్చింది. వీటికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తరుగు తీసేశారు. వీటికి అదనంగా మళ్లీ రైస్‌ మిల్లర్లు రకరకాల కారణాలతో బస్తాకు 5 కిలోలు తీసేశారు. దీనికితోడు ధాన్యాన్ని కాంటావేసే సమయంలో వే-బ్రిడ్జిలను అడ్డంపెట్టుకొని దోపిడీకి పాల్పడ్డారు.  ఉదాహరణకు జయశంకర్‌ భూపాపల్లి జిల్లాలో ఉమాపతిరెడ్డి అనే రైతు... రైస్‌ మిల్లర్లు సూచించిన వే- బ్రిడ్జి దగ్గర ధాన్యం కాంటా వేయిస్తే 234 క్వింటాళ్లు తూకం వచ్చింది. అదే ధాన్యాన్ని మరో వే-బ్రిడ్జ్‌ వద్ద కాంటా వేయిస్తే 255 క్వింటాళ్ల బరువు ఉంది. ఒక్క భూపాలపల్లి సెంటర్‌ నుంచే 45 లారీల ధాన్యాన్ని తరలిస్తే, రైస్‌ మిల్లర్లు రూ.35 లక్షలు ఆర్జించారని నిర్వాహకులు, రైతులు కలిసి ప్రభుతానికి ఫిర్యాదు చేశారు. రైస్‌ మిల్లర్లు అన్‌లోడింగ్‌ సమయంలో తీసేసిన 5 కిలోల తరుగుకు సంబంఽధించిన డబ్బులు కూడా తమ ఖాతాల్లో జమచేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2020-02-20T10:07:42+05:30 IST