అమ్మమ్మ కథలకు అందరూ ఫిదా!

ABN , First Publish Date - 2020-06-01T05:30:00+05:30 IST

కమ్మని కథ చెబితే వినడానికి ఇష్టపడని పిల్లలు ఉంటారా? కథతో పాటు పిల్లలకు ప్రాపంచిక విషయాల పట్ల అవగాహన కల్పిస్తే, కాలక్షేపంతో పాటు విజ్ఞానాన్నీ అందించవచ్చు. ఈ దిశగా ఆలోచించి ‘సునో ఇండియా’ పాడ్‌కాస్ట్‌లో ‘కథ చెప్పవా అమ్మమ్మా?’ అనే విభాగం ద్వారా కథలు వినిపించడానికి సంకల్పించారు...

అమ్మమ్మ కథలకు అందరూ ఫిదా!

కమ్మని కథ చెబితే వినడానికి ఇష్టపడని పిల్లలు ఉంటారా? కథతో పాటు పిల్లలకు ప్రాపంచిక విషయాల పట్ల అవగాహన కల్పిస్తే, కాలక్షేపంతో పాటు విజ్ఞానాన్నీ అందించవచ్చు. ఈ దిశగా ఆలోచించి ‘సునో ఇండియా’ పాడ్‌కాస్ట్‌లో ‘కథ చెప్పవా అమ్మమ్మా?’ అనే విభాగం ద్వారా కథలు వినిపించడానికి సంకల్పించారు ఈ తల్లీకూతుళ్లు. ఇప్పటివరకూ లక్ష మంది శ్రోతలను సంపాదించుకున్న ఆ కథలకు చిరునామా అయిన ధర్మవరపు చాముండేశ్వరి, పద్మప్రియలను ‘నవ్య’ పలకరించింది. ఆ విశేషాలు వారి మాటల్లోనే...


‘‘నాకు టీచర్‌గా పాతికేళ్ల అనుభవం ఉంది. పిల్లలకు కథల రూపంలో పాఠాలు చెబుతూ ఉంటే ఎంతో ఆసక్తిగా వినడం గ్రహించాను. కథకు అంతటి శక్తి ఉంటుంది. రిటైర్‌ అయిన తర్వాత తీరిక వేళల్లో మనవరాళ్లకు కథలు చెప్పడం వ్యాపకంగా పెట్టుకున్నాను. అయితే ఆ కథల్లో మరుగునపడుతున్న ఆటలు, సంప్రదాయాలు, అంతరించిపోతున్న జంతువులు, పక్షుల విశేషాలను రంగరించేదాన్ని. ఇలా చేస్తే పిల్లలకు కాలక్షేపంతో పాటు విజ్ఞానాన్నీ అందించవచ్చనేది నా ఆలోచన. కథలు చెప్పడంతో పాటు, ‘అమ్మ మనసు’ అనే సొంత బ్లాగులో ఇలాంటి కథలను పెట్టాను. తొమ్మిది కథల పుస్తకాలు కూడా రాశాను. అయితే ఎక్కువమంది పిల్లలకు నా కథలు చేరాలంటే పాడ్‌కాస్ట్‌ మాధ్యమాన్ని ఎంచుకోవాలని అర్థమైంది. అలా మా అమ్మాయితో నా ఆలోచన పంచుకోవడం, ‘కథ చెప్పవా అమ్మమ్మా?’ సెగ్మెంట్‌ రూపొందడం వెంట వెంటనే జరిగిపోయాయి. అలా పర్యావరణం కథలు, ప్రకృతి కథలు రాసుకుని, రికార్డు చేసి, పాడ్‌కాస్ట్‌లో అప్‌లోడ్‌ చేశాం. 




ఇది ఆడియో జర్నలిజం!

‘‘కాలక్రమేణా కథలు కంచికే చేరుకుంటున్నాయి. కథ వినిపించే ఓపిక పెద్దలకు కరువవుతుంటే, వాటిని వినే తీరిక పిల్లలకు కొరవడుతోంది. కానీ ఆసక్తి కలిగించేలా కథ చెప్పగలిగితే, పిల్లలు తప్పకుండా వింటారు. ఆ కథల్లోనే విజ్ఞానం రంగరించగలిగితే పిల్లలకు జ్ఞానమూ దక్కుతుంది. ఈ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ‘కథ చెప్పవా అమ్మమ్మా?’ అనే కాన్సెప్ట్‌. పాడ్‌కాస్ట్‌ ద్వారా కథలను వినిపించే ఈ విభాగాన్ని ‘సునో ఇండియా’లో 2019 జనవరిలో చేర్చాం. ఈ కథలను వినిపించే అమ్మమ్మ ఎవరో కాదు. మా అమ్మ ధర్మవరపు చాముండేశ్వరి. ఆవిడ ఉపాధ్యాయురాలు, రచయిత్రి కూడా! సామాజిక శాస్త్రం, తెలుగు భాషల మీద పట్టు ఉన్న అమ్మ ఆలోచనకు నేను రూపం ఇచ్చాను. అమ్మ చెప్పే కథలు బాగా ప్రాచుర్యం పొందాయి. కథల కోసం ఆమె ఎంచుకునే అంశాలు, వాటిని కథలో భాగంగా, సంభాషల ద్వారా చెప్పే తీరుకు శ్రోతలు ఆకర్షితులయ్యారు. 

ఆడియో జర్నలిజం ద్వారా సమాచారాన్ని క్లిష్టతరం చేయకుండా, సాధ్యమైనంత సింపుల్‌గా అందించాలనే ఆలోచనతో నేను, మా వారు రాకేష్‌ కమల్‌, స్నేహితుడు తరుణ్‌ ‘సునో ఇండియా పాడ్‌కా్‌స్ట’ను 2018 సెప్టెంబర్‌లో రూపొందించాం. దీనిలో సామాజిక అంశాలు, పర్యావరణం, ఆరోగ్యం, విజ్ఞానం...ఇలా ప్రతీ అంశానికి సంబంధించిన వేర్వేరు విభాగాలు ఉంటాయి.’’ 

- పద్మ ప్రియ, కో ఫౌండర్‌, ‘సునో ఇండియా’






వాడుక భాషలో చెప్పాలి!

పిల్లల కోసం కథల పుస్తకాలు అందుబాటులో ఉన్నా, వాటిలో వాడుతున్న భాష నేటితరం పిల్లలకు మింగుడుపడడం లేదు. గ్రాంఽధిక భాషలో కాకుండా, సరళంగా ఉండడంతో పాటు, అక్కడక్కడా ఇంగ్లీషు, హిందీ మాటలు, చెణుకులు వాడితే నేటి పిల్లలకు తేలికగా అర్ధం అవుతుందనేది నా భావన. అలాగే బాలసాహిత్యానికి ప్రాముఖ్యం తగ్గకుండా ఉండాలంటే, కాలంతో పాటు కథ రూపకల్పన, చెప్పే విధానం, భాష మారుతూ ఉండాలి. ఈ తరహాలో నాలుగు నుంచి పద్నాలుగేళ్ల పిల్లలు లక్ష్యంగా, ‘కథ చెప్పవా అమ్మమ్మా?’లోని కథలన్నీ సాగుతాయి. కథలకు మన చుట్టూ జరుగుతున్న విశేషాలు, వస్తువులనే తీసుకుంటాను. పర్యావరణ సమతుల్యం మొదలు అంతరిక్ష వ్యర్థాల వరకూ విభిన్న అంశాలను కథల కోసం ఎంచుకుంటాను. నా మనవరాలు టెడ్డీబేర్‌ గురించి కథ చెప్పమని అడిగింది. పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో టెడ్డీబేర్‌ ఉంటుంది. దాని ఆధారంగా కథ అల్లితే పిల్లలు ఆసక్తిగా వింటారు. అలా టెడ్డీబేర్‌ గురించీ కథ అల్లాను. పిల్లలు తేలికగా కనెక్ట్‌ అయ్యే అంశాలనే కథలుగా ఎంచుకుంటూ ఉంటాను. కథను మొదట నా బ్లాగులో టైప్‌ చేసి పెట్టుకుని, తర్వాత రికార్డు చేసి, పాడ్‌కాస్ట్‌లో పెడుతూ ఉంటాను. నెలకు కనీసం రెండు కథలు అప్‌లోడ్‌ చేస్తూ ఉంటా. ఇలా ఇప్పటివరకూ సునో ఇండియాలో 26 కథలు పెట్టాం. మున్ముందు సిరీస్‌ రూపంలో అప్‌లోడ్‌ చేయాలనే ఆలోచనా ఉంది. సునో ఇండియాలోనే కాకుండా ఇతర 20 పాడ్‌కాస్ట్‌ల్లో నా కథలు ‘ఈశ్వరి స్టోరీస్‌’ పేరుతో అందుబాటులో ఉన్నాయి. 

నా కథలకు స్పందన బాగుంది. పిల్లల తల్లితండ్రులు ఫోన్‌ చేసి వారు చేయలేని పని నేను చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెబుతూ ఉంటారు. అమెరికా లాంటి దేశాల్లో తెలుగు భాష పట్ల పట్టు లేని పిల్లలు నా కథలు విని, తెలుగు మీద, తెలుగు కథల మీద ఆసక్తి కనబరుస్తూ ఉండడం నాకు తృప్తి కలిగిస్తోంది. తాజాగా లక్ష మంది శ్రోతలకు నా కథలు చేరాయని తెలిసినప్పుడు, నా బాధ్యత రెట్టింపు అయినట్టు భావించాను. చెప్పడానికి నా దగ్గర ఎన్నో అంశాలు ఉన్నాయి. వినడానికి శ్రోతలు సిద్ధంగా ఉన్నప్పుడు వెనుకంజ వేయడం ఎందుకు? అని కూడా అనిపిస్తోంది. నేటి ఉరుకులు పరుగుల జీవితంలో పిల్లలకు కథలు చెప్పే తీరుబాటు పెద్దలకు ఉండడం లేదు. ఈ లోటును నేను భర్తీ చేయగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది.’’

-ధర్మవరపు చాముండేశ్వరి, రిటైర్డ్‌ టీచర్‌


-గోగుమళ్ల కవిత



Updated Date - 2020-06-01T05:30:00+05:30 IST