దుఃఖాన్ని, భయాన్ని జయించడం ఎలా?

ABN , First Publish Date - 2020-07-17T08:17:13+05:30 IST

జూదంలో ఓడి అరణ్యవాసానికి బయులుదేరిన పాండవుల వెంట ప్రజలంతా వస్తున్నారు. వారిని పోషించే స్థోమత లేని ధర్మరాజు ఆ సమస్యను అధిగమించేందుకు ధౌమ్యుని సలహా అడుగుతాడు.

దుఃఖాన్ని, భయాన్ని జయించడం ఎలా?

శోకస్థాన సహస్రాణి, భయస్థాన శతానిచ

దివసే దివసే మూఢ మావిశంతి న పండితమ్

జూదంలో ఓడి అరణ్యవాసానికి బయులుదేరిన పాండవుల వెంట ప్రజలంతా వస్తున్నారు. వారిని పోషించే స్థోమత లేని ధర్మరాజు ఆ సమస్యను అధిగమించేందుకు ధౌమ్యుని సలహా అడుగుతాడు. దానికి ధౌమ్యుడు.. ‘‘బలమైన సమస్య వచ్చింది. దానిని ఎదిరించి నిలుస్తామా, దానినుండి పారిపోతామా అన్నదే మన వ్యక్తిత్వాన్ని పట్టిస్తుంది. ఈ ప్రపంచంలో వేల కొద్ది దుఃఖకారకాలు, వందల కొద్ది భయకారకాలు మనిషిని అనుక్షణం వెన్నాడుతూనే ఉంటాయి. సంయమనం అవసరమైన సమయంలో అధైర్యపడడం అవివేకుల లక్షణం. విజ్ఞులెపుడూ అధైర్యపడరు. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. ప్రశాంతమైన బుద్ధితో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే ఫలితం శాశ్వతమైన ఆనందాన్నిస్తుంది. ఫలితంపై దృష్టి కష్టాలనిస్తుంది. ప్రక్రియపై దృష్టి అభ్యుదయాన్నిస్తుంది.’’ అని ఈ శ్లోకం ద్వారా చెప్పాడు.


మనోదేహ సముత్థాభ్యాం, దుఃఖాభ్యాం ఆర్జితం జగత్‌

తయోఃవ్యాస సమాసాభ్యాం శమోపాయ మిమం శృణు

దుఃఖాలు మానసికమైనవైనా, శారీరకమైనవైనా వాటి మూలాలను అవగాహన చేసుకుంటే వాటి ప్రభావాన్ని తగ్గించుకోగలం. మందులు వేసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం ద్వారా శారీరక రోగాలను తగ్గించుకోవచ్చు. అనుకోకుండా ఎదురయ్యే ప్రమాదాలను ధైర్యంతో అధిగమించాలి. బాగా ఇష్టమైన వ్యక్తులను/వస్తువులను కోల్పోయినప్పుడు.. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదనే జ్ఞానాన్ని పొందడం వల్ల ఉపశమనం పొందవచ్చు. అన్ని దుఃఖాలకూ మూలమైనది మనసే. నీటితో అగ్ని ఎలా చల్లబడుతుందో.. అలాగే జ్ఞానంతో మానసిక దుఃఖం తొలగిపోతుంది. మనసు ప్రశాంతమైతే శారీరక రుగ్మతలు తగ్గిపోతాయి. మానసిక దుఃఖం ‘నాది’, ‘నేను’ అనే అనుబంధాలు పెంచుకోవడం ద్వారా కలుగుతుంది. 


మానసిక వేదన చల్లారాలంటే అంతరంగాన్ని అర్థం చేసుకోవాలి. అవగాహనను పెంచుకోవాలి. ప్రవర్తనను మార్చుకోవాలి. అంతే తప్ప.. లోపలి వేదనకు బయట కారణాలను వెతకడం వల్ల ప్రయోజనం ఉండదు. ఆ క్రమంలో.. మార్చగలిగిన వాటిని మార్చుకోవాలి.  మార్చలేని వాటిని అనుమోదించాలి. మనం ఊహించిన విధంగా సంఘటనలు జరగకపోతే మనకు కోపం రావడం సహజం. కానీ ఆ సంఘటలను ఆమోదించడం వల్ల సహనం పెరుగుతుంది. ప్రశాంతత కలుగుతుంది. తెలియని మార్గంలో వెళ్లాల్సిన వేళ ఎదురైన సంఘటనలను ఆమోదించకపోతే అది భయాన్నిస్తుంది. జీవితం మన భావోద్వేగాలకు అనుగుణంగా నడవదు. అలాగే మన భావోద్వేగాలు సంఘటనలను మార్చలేవు. ఈ సత్యాన్ని గ్రహించడమే జ్ఞానం. అలాంటి జ్ఞానం పొందడం అందరికీ సాధ్యమా అంటే.. అందుకు సాధన చేయాల్సిందే.


పాలకుర్తి రామమూర్తి 

Updated Date - 2020-07-17T08:17:13+05:30 IST