ఈ పతనం ఎందాకా..?

ABN , First Publish Date - 2021-04-20T05:54:20+05:30 IST

కొవిడ్‌ దెబ్బకు ప్రామాణిక ఈక్విటీ సూచీలు మరో భారీ పతనాన్ని నమోదు చేసుకున్నాయి. సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బీఎ్‌సఈ సెన్సెక్స్‌ ఏకంగా 1,469 పాయింట్ల వరకు క్షీణించింది...

ఈ పతనం ఎందాకా..?

  • కరోనా ధాటికి మార్కెట్‌ కుదేలు 
  • సెన్సెక్స్‌ 883 పాయింట్లు డౌన్‌ 
  • రూ.3.53 లక్షల కోట్లు ఆవిరి 


ముంబై: కొవిడ్‌ దెబ్బకు ప్రామాణిక ఈక్విటీ సూచీలు మరో భారీ పతనాన్ని నమోదు చేసుకున్నాయి. సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బీఎ్‌సఈ సెన్సెక్స్‌ ఏకంగా 1,469 పాయింట్ల వరకు క్షీణించింది. చివరికి 882.61 పాయింట్ల నష్టంతో 47,949.42 వద్ద ముగిసింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 258.40 పాయింట్లు కోల్పోయి 14,359.45 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో 28 నష్టాల్లో ముగిశాయి. 4.17 శాతం తగ్గిన పవర్‌గ్రిడ్‌.. సూచీ టాప్‌ లూజర్‌గా నిలిచింది. డాక్టర్‌ రెడ్డీస్‌ మాత్రం 1.58 శాతం లాభపడగా.. ఇన్ఫోసిస్‌ 0.74 శాతం పెరిగింది. ప్రధాన కంపెనీలతో పాటు చిన్న, మధ్య స్థాయి షేర్లలోనూ ట్రేడర్లు అమ్మకాలు పోటెత్తించారు. దాంతో బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌ సూచీ 1.93 శాతం, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1.64 శాతం క్షీణించాయి. బీఎ్‌సఈలో హెల్త్‌కేర్‌ మినహా మిగతా అన్ని రంగాల సూచీలూ నేలచూపులు చూశాయి. బీఎ్‌సఈ రియల్టీ సూచీ 3.96 శాతం తగ్గింది. పవర్‌, ఆటో, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, టెలికాం, యుటిలిటీస్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు 2 శాతానికి పైగా పతనమయ్యాయి. అమ్మకాల సునామీలో ఒక్కరోజే రూ.3.53 లక్షల కోట్ల మార్కెట్‌ సంపద గల్లంతైంది. దీంతో బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.201.77 లక్షల కోట్లకు పడిపోయింది.


‘మాక్రోటెక్‌’ లిస్టింగ్‌.. ప్చ్‌!

ఈ మధ్యనే పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన రియల్టీ కంపెనీ మాక్రోటెక్‌ డెవలపర్స్‌ (గతంలో లోధా).. సోమవారం స్టాక్‌ మార్కెట్లో లిస్టయింది. అయితే లిస్టింగ్‌ రోజునే కంపెనీకి తీవ్ర నిరాశ ఎదురైంది. పబ్లిక్‌ ఇష్యూ ధర రూ.486తో పోలిస్తే బీఎ్‌సఈలో షేరు దాదాపు 4.70 శాతం నష్టపోయి రూ.463.15 వద్ద ముగిసింది. 


రూపాయి షేక్‌

డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ విలువ మరో 52 పైసలు క్షీణించింది. దాంతో డాలర్‌-రూపాయి మారకం రేటు రూ.74.87కు చేరుకుంది. వైరస్‌ విలయతాండం, ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ల విధింపు, ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ అన్నీ వెరసి రూపాయికి భారీగా గండికొట్టాయి. 



మార్కెట్‌ క్షీణతకు కారణాలు 

  • దేశంలో కరోనా కేసుల ఉధృతి 
  • పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధింపు
  • ఆర్థిక పునరుద్ధరణపై అనిశ్చితి
  • రూపాయి విలువ పతనం

పసిడి మళ్లీ పైపైకి 

బంగారం ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర సోమవారం రూ.411 పెరిగి రూ.47,291కి చేరుకుంది. కిలో వెండి ధర కూడా రూ.338 పెరిగి రూ.68,335గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాలకు డిమాండ్‌ పెరగడంతోపాటు రూపాయి క్షీణత దేశీయంగా వీటి ధరల పెరుగుదలకు కారణమైనట్లు బులియన్‌ వర్గా లు తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ఒక దశలో 1,771.90 డాలర్లు, వెండి 25.84 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. 


బిట్‌కాయిన్‌ ఢమాల్‌ 

ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌ విలువ భారీగా పతనమైంది. ఆదివారం ఒక దశలో బిట్‌కాయిన్‌ 51,500 డాలర్ల స్థాయికి పడిపోయింది. బిట్‌కాయిన్‌ సహా పలు క్రిప్టోకరెన్సీలకు మైనింగ్‌ హబ్‌ అయిన చైనా, జిన్జియాంగ్‌ ప్రాంతంలో విద్యుత్‌ వైఫల్యం, క్రిప్టో కరెన్సీల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడుతున్న ఆర్థిక సంస్థలపై అమెరికా కొరడా ఝుళిపించనుందన్న ఊహాగానాలు ఇందుకు ప్రధాన కారణమయ్యాయి. గత బుధవారం బిట్‌కాయిన్‌ 64,870 డాలర్ల వద్ద ఆల్‌టైం రికార్డును నమోదు చేసుకుంది. సోమవారం సాయంత్రం 56,690 డాలర్ల వద్ద ట్రేడైంది. 


Updated Date - 2021-04-20T05:54:20+05:30 IST