లాభదాయక వ్యవసాయం ఎలా?

ABN , First Publish Date - 2020-07-31T07:14:24+05:30 IST

కరోనా ఉపద్రవంలో మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థే మనకు వెన్నంటి నిలిచింది. ముఖ్యంగా వ్యవసాయం మన రాష్ట్రానికీ, దేశానికీ ప్రధానమైన ఆర్థిక, ఉపాధి, ఆహార భద్రతను కల్పించింది...

లాభదాయక వ్యవసాయం ఎలా?

కోటి ఎకరాల్లో వ్యవసాయం చేస్తే కనీసం ఏడాదికి ఎకరానికి రెండు లక్షల చొప్పున కోటి ఎకరాలకు రెండు లక్షల కోట్ల సంపద సృష్టించినప్పుడే సన్న, చిన్నకారు రైతు, కౌలు రైతు గౌరవప్రదమైన జీవనం గడుపగలడు.


కరోనా ఉపద్రవంలో మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థే మనకు వెన్నంటి నిలిచింది. ముఖ్యంగా వ్యవసాయం మన రాష్ట్రానికీ, దేశానికీ ప్రధానమైన ఆర్థిక, ఉపాధి, ఆహార భద్రతను కల్పించింది. దేశంలో దాదాపు 80 లక్షల టన్నుల ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా సేకరించగా, అందులో 63 శాతం ధాన్యం (అంటే 52.23 లక్షల టన్నులు) తెలంగాణ రాష్ట్రం నుంచే సేకరించడం మనకు గర్వకారణం. తెలంగాణలో యాసంగి వరి 40 నుంచి 46 లక్షల ఎకరాల్లో ఒక కోటి టన్నుల (10 కోట్ల క్వింటాళ్లు) ధాన్యం పండింది. దీనికి కనీసం మద్దతు ధర క్వింటాలుకు 1835 చొప్పున మొత్తం 18,350 కోట్ల రూపాయలు పలికింది. ఎకరానికి సగటున 25 నుంచి 30 క్వింటాళ్ల పంట వస్తే, రైతుకు ఎకరానికి 35 నుంచి 45 వేల ఆదాయం ఉంటది. 


భారతదేశంలో దాదాపు 39 కోట్ల ఎకరాల వ్యవసాయ అనుకూల భూమి ఉంటే అందులో 8 కోట్ల ఎకరాలకు సాగునీటి సదుపాయం ఉంది. సగటున ఒక పంటకు ఒక ఎకరానికి వెయ్యి నుంచి 2 వేల రూపాయలు ఎరువుల సబ్సిడీ ఉంటుంది. ధాన్యం మద్దతు ధర ద్వారా పంటను బట్టి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి. అంటే ప్రాజెక్టుల వ్యయం, దానిమీద వడ్డీ కాకుండా ప్రభుత్వం అత్యధికంగా ఎకరాకు ప్రతి పంటకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఇరవై వేల వరకు ఖర్చు పెడుతుంది.


ఇక ఒక ఎకరా వరి సాగుకు అయ్యే ఖర్చు ఎలా ఉన్నదంటే.. దున్నడానికి 2 నుంచి 3 వేలు, విత్తనం 8 వందల నుంచి వెయ్యి, నాట్లకు, వారాలకు చెక్కటానికి 4 వేలు, కలుపు తీయడానికి వెయ్యి నుంచి 15 వందలు, ఎరువులు, క్రిమి సంహారక మందులకు 3 వేలు, కోతకు 2500 నుంచి 3500, రవాణా ఖర్చు ఒక వెయ్యి. దీనికి కనీసం 5 నుంచి 7 వేల ఉచిత కరెంటు ఖర్చు, మద్దతు ధర ఎకరాకు కనీసం 3 నుంచి 4 వేలు అవుతుంది. దీనికి రైతు శ్రమ రోజుకు 50 రూపాయల చొప్పున నాలుగు నెలలకు కలిపి 6 వేలు. ఇలా ఒక ఎకరానికి పెడుతున్న ఖర్చు 20 నుంచి 25 వేల రూపాయలు అవుతుంది. వచ్చేది సగటున 40 వేల రూపాయలు. ఈ నేపథ్యంలో, ఒక రైతు కుటుంబానికి సగటున ఎంత భూమి ఉంది, ఎంత ఆదాయం వస్తది, ఒక గౌరవప్రదమైన జీవితానికి ఇది సరిపోతుందా? వ్యవసాయంలో రాబడి ఇంకా ఎక్కువ వచ్చే పద్ధతులు ఉన్నాయా అన్నవి ప్రశ్నలు.


వ్యవసాయం దాదాపు 50 శాతం మందికి ఉపాధి కల్పిస్తుంది. జిడిపిలో 15 నుంచి 17 శాతం వాటా కల్పిస్తుంది. గ్రామీణ ప్రాంతంలో దాదాపు 80 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తారు. భారతదేశంలో దాదాపు 15 కోట్ల రైతు కుటుంబాలు, అంటే 39 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి అంటే సగటున 2 ఎకరాలు. ఇక నీటి లభ్యత ఉన్న 8 కోట్ల ఎకరాలు తీసుకుంటే ప్రతి రైతు కుటుంబానికి సగటున అర ఎకరం. తెలంగాణ రాష్ట్రంలో గణాంకాల ప్రకారం 55 లక్షల రైతులు (భూమి కలిగినవారు) ఉన్నారు. ఒక కోటి 50 లక్షల ఎకరాలు ఉంటే 35 లక్షల రైతులకు 0.1 నుంచి 2 ఎకరాలుగా మొత్తం 39 లక్షల ఎకరాలు ఉంది. అంటే సగటున ఒక ఎకరం ఉన్నదన్నమాట. 13 లక్షల రైతులకు 2 నుంచి 5 ఎకరాల భూమి, మొత్తం 41 లక్షల ఎకరాలు(సగటున 3 ఎకరాలు). 7 లక్షల రైతుల దగ్గర 70 లక్షల ఎకరాలు. ఇందులో 5 నుంచి 500 ఎకరాలు ఉన్నవాళ్లు ఉన్నారు. అంటే సగటున 10 ఎకరాలు. 86 శాతం మంది చిన్న, సన్నకారు రైతులు మాత్రమే.


భారతదేశంలో భూమి తక్కువ, రైతులు ఎక్కువ. యాంత్రీకరణ, కూలీల రేట్లు పెరగటం, మద్దతు ధర, ప్రకృతి వైఫల్యాలు ప్రధాన అడ్డంకులు. ప్రభుత్వం అత్యధికంగా చేయూతనిస్తున్నా, ప్రస్తుతం ఉన్న పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే కూడా చిన్న, సన్నకారు రైతులకు ఆదాయం తక్కువ. భూమి పెంచలేం కనుక వ్యవసాయ పద్ధతులు మారాలి. అప్పుడే కృషికి కరెన్సీ కలిసివస్తుంది. మధ్యప్రదేశ్‌కి చెందిన ఆకాశ్ చౌరాసియా అనే ఒక రైతు 2.5 ఎకరాల భూమిలో నాలుగు పొరల (లేయర్స్) వ్యవసాయం చేస్తున్నాడు. సంవత్సరానికి 16 లక్షల ఆదాయం. అన్ని ఖర్చులు పోను దాదాపు 11 లక్షల నికర లాభం పొందుతున్నాడు. అక్కడ నీటివసతి కూడా తక్కువ. బోర్‌వెల్‌ మాత్రమే ఆధారం. అంటే మనసుంటే మార్గాలున్నవి. వ్యవసాయాన్ని లాభదాయకం చేయాలంటే వినూత్నమైన పద్ధతులను అవలంబించాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక పంటనే కాకుండా ప్రాంతానికి అనుగుణంగా పంట వేయాలి. అంతర పంట, మిశ్రమ పంటలు, వాటికి తోడు వర్మీ కంపోస్ట్, గొర్రెలు, మేకల ఫార్మ్, నాటుకోళ్ల పెంపకం, పాడిపశువులను కూడా పెంచాలి. నీటి లభ్యత ఉన్న దగ్గర వరితో పాటు చేపలు, సేంద్రీయ ఎరువులు, భూసార పెంపు పద్ధతులు పాటించాలి. భూమిని కాపిటల్‌గా, శ్రమను దానికి తోడుగా నూతన పద్ధతులను జోడించాలి. ఇలా వ్యవసాయ ఆధారిత గ్రామీణ కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేయడం అవసరం. 


ఒకేసారి 3 నుంచి 5 పంటలు, బహుళ పొరల్లో మొలిచే పంటలను వేయాలి. ఒక విధంగా బహుళ అంతస్థుల బిల్డింగ్ కట్టినట్టన్నమాట. భూమి లోపల పండే కందమూలాలు, ఉపరితలంలో (పై పొర) వచ్చే కూరగాయలు, ఆకుకూరలు, దోస తదితరాలు. తర్వాత పందిరి ద్వారా వచ్చే కాకర, దొండ, సొర, చిక్కుడు. ఇంకా భూమి లోపలికి పోయే ఇతర పంటలూ పండించాలి. వీటికి తోడు చేపలు, గొర్రెలు, కోళ్ల పెంపకం. ఇలా ఏడాదికి కనీసం 7 నుంచి 8 నెలలు క్రమబద్ధంగా వ్యవసాయం చేస్తే అన్ని ఖర్చులు పోను ఎకరాకు 2 నుంచి 3 లక్షల ఆదాయం వస్తుంది. 


యాంత్రీకరణతో ఒక గ్రామం లేదా రైతు సమూహం తమ తమ భూములకు అనుగుణంగా సమిష్టి వ్యవసాయం చేయడం వల్ల అందరికీ లాభం ఉంటుంది. దున్నడం, ఇతర యాంత్రిక పనులు కలిసి చేయడం వల్ల ఖర్చు తగ్గుతుంది, సమయమూ కలిసొస్తుంది. అలానే పాడి, ఇతర మేక, గొర్రె, వర్మీ కంపోస్ట్, ఆహార తయారీ పరిశ్రమ కామన్ గా ఉండే సౌకర్యం. వాటికి ఆధారిత పంటలు వేయడం లాభదాయకం. సేంద్రీయ, ఇతర పంటలు, ఆహార పరిశ్రమలతో కలిపి ఒప్పందం చేసుకుంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఇలా సమిష్టి వ్యవసాయం చేయడం వల్ల ఇరు వర్గాలకూ లాభం. ఉదాహరణకు వంద ఎకరాల్లో సేంద్రీయ పద్ధతుల్లో కంపెనీ సూచనలకు అనుగుణంగా పంట వేస్తే, అటు మార్కెట్ గ్యారెంటీతో పాటు మంచి ధర కూడా వస్తది. 


ప్రభుత్వం కూడా కొన్ని టార్గెట్ల ప్రకారం పాలసీల రూపకల్పన చేస్తే కలసివస్తుంది. భూమి ఉన్నవారు అందరూ రైతులు కారు. వ్యవసాయం మీద ఆధారపడి, వ్యవసాయం చేసేవారినే రైతులుగా గుర్తించి, సమీకృత వ్యవసాయ పథకాల రూపకల్పన చేయాలి. కౌలు రైతు చట్టాలను మార్చి అటు భూ యజమానికి భరోసా, ఇటు కౌలు రైతుకు వ్యవసాయ ఆధారిత పథకాల ఉపయోగం కల్పించాలి. నూతన వ్యవసాయ ఒరవడి ప్రవేశపెడుతున్నప్పుడు రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తే అంతిమంగా రైతులకే నష్టం. అత్యధిక మంది ఆధారపడ్డ వ్యవసాయాన్ని వినూత్న పద్ధతుల్లో లాభదాయకం చేయకపోతే, ప్రపంచంలో ఒక మహా ఆర్థిక శక్తిగా ఎదగాలన్న భారత్ ఆశయం అడియాసగా మిగులుతుంది. వ్యవసాయానికి టెక్నాలజీ వినియోగం కూడా కీలకం. వ్యవసాయ ముడిసరుకైన నీళ్లు, కరెంట్, ఇతరత్రా ప్రభుత్వం చేయూత ఇచ్చినప్పుడు, మార్పుతో వ్యవసాయాన్ని లాభదాయకం చేసుకోవాలి. కోటి ఎకరాల్లో వ్యవసాయం చేస్తే కనీసం ఏడాదికి ఎకరానికి రెండు లక్షల చొప్పున కోటి ఎకరాలకు రెండు లక్షల కోట్ల సంపద సృష్టించినప్పుడే సన్న, చిన్నకారు రైతు, కౌలు రైతు గౌరవప్రదమైన జీవనం గడుపగలడు. మార్పు ఒక్కటే శాశ్వతం. అది గమనించడం, పాటించడం, ప్రగతి చెందడం అందరి బాధ్యత. 

డాక్టర్ బూర నర్సయ్య గౌడ్మా

జీ ఎంపీ, భువనగిరి

Updated Date - 2020-07-31T07:14:24+05:30 IST