విషాలతో ప్రకృతి వ్యవసాయమెలా సాధ్యం?

ABN , First Publish Date - 2021-10-14T08:28:08+05:30 IST

ప్రకృతి వ్యవసాయం–రక్షిత ఫలసాయం అంటూ ఈ ఏడు మేము బహుజన బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ప్రజల్లో, రైతాంగంలో, వ్యవసాయంపై ఆసక్తి గల మేధావుల్లో మంచి ప్రతిస్పందన లభిస్తున్నది...

విషాలతో ప్రకృతి వ్యవసాయమెలా సాధ్యం?

ప్రకృతి వ్యవసాయం–రక్షిత ఫలసాయం అంటూ ఈ ఏడు మేము బహుజన బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ప్రజల్లో, రైతాంగంలో, వ్యవసాయంపై ఆసక్తి గల మేధావుల్లో మంచి ప్రతిస్పందన లభిస్తున్నది. ఈ కార్యక్రమం గురించి తెలుసుకుని, వినీ అనేకమంది వ్యాసాలు, పాటలు పంపించారు. పుస్తకం ప్రింటయిన తర్వాత కూడా ఇంకా పలు రచనలు వస్తూనే ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయం లేదా సంప్రదాయిక సహజ వ్యవసాయ పద్ధతులను కొనసాగిస్తే ఐదు రకాల ప్రోత్సాహకాలను అందిస్తామని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ‘పరంపరాగత్ కృషి వికాస్ యోజన’ (పికెవైవై) పథకం కింద సహజ ఎరువులు, పెట్టుబడులు, గిడ్డంగులు, ఆగ్రోవేస్ట్ ప్రొడక్షన్ యూనిట్లు తదితర అనేక సహాయాలు, సబ్సిడీలు అంటూ ప్రకటన చేసింది. అయితే రసాయన ఎరువులు, పురుగుల మందులను పూర్తిగా నిషేధించే దిశగా ఏ చర్యలు చేపట్టలేదు.


పరంపరాగత వ్యవసాయానికి, పరంపరగా వస్తున్న దేశీయ విత్తనాలు (నాటు విత్తనాలు) బహుళ పంటలు ముఖ్యమైన వనరు. అలాంటి దేశీయ విత్తనాలను కాపాడి పంటలు పండించే చిన్న సన్నకారు రైతాంగానికి అందించాలి. కౌలు రైతులకు స్వయంగా సాగు చేసుకునే భూములు అందించడం ముఖ్యం. అందువల్ల సాగు భూముల పంపిణీ, సహజ అడవుల రక్షణ, పర్యావరణ రక్షణ అత్యవసరం. వేలాది ఎకరాలను హస్తగతం చేసుకున్న జమీందారీ జాగిర్దారీ వ్యవస్థల్లాగ బహుళజాతి కంపెనీలకు రకరకాల పేర్లపైన వేలాది ఎకరాలు అప్పగించకూడదు. పారిశ్రామిక ఉద్యోగాల కల్పన పేరిట అప్పనంగా భూముల పందేరం కొనసాగుతున్నది. ప్రభుత్వ భూముల్ని అమ్మడానికి జారీచేసిన జీఓలు రద్దు చేసి రైతులకు భూమి పంపిణీ జరగాలి. అందువల్ల చారిత్రక కడివెండి గ్రామంలో ‘దున్నేవారికి దుక్కులు – దుక్కుల్లో ప్రకృతి మొక్కలు’ అంటూ బహుజన బతుకమ్మ పిలుపునిచ్చింది. అంతకుముందే ఆలగడపలో సెజ్‌ల కోసం ప్రజల సాగుభూములను సేకరించవద్దని వేలాది ప్రజల సమక్షంలో బహుజన బతుకమ్మ ఆడి పాడి చాటి చెప్పింది. బహుజన బతుకమ్మ అంటే ప్రజల బతుకుదెరువు పోరాటమని మరొకసారి చాటి చెప్పింది.


డాక్టర్ బాబా సాహెబ్ ప్రవచించినట్లు ‘ఆర్థిక ప్రజాస్వామ్యం రాజకీయ ప్రజాస్వామ్యం’ అమలు జరగాలంటే సామ్రాజ్యవాదుల జోక్యం లేకుండా వనరుల వికేంద్రీకరణ జరగాలి. గ్రామీణ అభివృద్ధి, స్వయం పోషకం ఆధారంగా మానవ వనరుల అభివృద్ధికి వ్యవసాయం– చేతివృత్తులు జంటగా అభివృద్ధి చెందాలి. స్థానికమైన ప్రతీదీ దేశీయమైనదే. నూటికి అరవై శాతం ప్రజలు ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ రంగంలో గ్రామసీమల్లో దేశ విదేశీ బహుళ జాతి కంపెనీలను నివారించగలిగే ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయాధారిత పరిశ్రమల లక్ష్యంగా మన ప్రయాణం సాగినప్పుడే దేశానికి నిజమైన సార్వభౌమాధికారం సిద్ధించినట్లు. అందుకే భూసారాన్ని కాపాడుకోవడానికి కేపిటల్ ఇన్వెస్టుమెంట్ సబ్సిడీ స్కీమ్ (సిఐఎస్ఎస్) స్థానంలో మొత్తంగా రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులను అరికట్టే నిర్ణయం తీసుకోలేరా? అని ప్రభుత్వాలను బహుజన బతుకమ్మ ప్రశ్నిస్తోంది. దేశీయ సహజ వనరులపై పిడికెడు మంది గుత్తాధిపత్యాన్ని నివారించగలిగినప్పుడే ఈ దిశగా నిజమైన ప్రయాణం మొదలవుతుంది. ఒక వైపు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని చెప్పడమే నిజమైతే పురుగుమందుల కంపెనీలు చేసే ప్రచారాన్నయినా ఎందుకు అరికట్టలేకపోతున్నారని ప్రశ్నిస్తూ బహుజన బతుకమ్మ అనే ఉద్యమం నిరంతర ప్రక్రియ అని మరొకసారి స్పష్టం చేస్తున్నాం. భావ సారూప్యత కలిగిన శక్తులు ఐక్యమై సాగాల్సిన తరుణమిదేనని ప్రకటిస్తున్నాం. 

విమలక్క

బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ

Updated Date - 2021-10-14T08:28:08+05:30 IST