గవర్నర్‌గానూ గౌరవప్రదం

ABN , First Publish Date - 2021-12-05T08:32:06+05:30 IST

పెడసరంగా వ్యవహరించే గవర్నర్‌లకు చుక్కలు చూపించడం మాజీ ముఖ్యమంత్రి జయలలిత తత్వం. అలాంటి అధినేత్రి నుంచీ మన్ననలు పొందిన ఘనత కొణిజేటి రోశయ్యకే దక్కింది.

గవర్నర్‌గానూ గౌరవప్రదం

కొరకరాని కొయ్య జయతోనూ కలిసిపోయిన స్నేహ వ్యక్తిత్వం. పెద్దన్నలా గౌరవించిన తలైవి

(చెన్నై, ఆంధ్రజ్యోతి) : పెడసరంగా వ్యవహరించే గవర్నర్‌లకు చుక్కలు చూపించడం మాజీ ముఖ్యమంత్రి జయలలిత తత్వం. అలాంటి అధినేత్రి నుంచీ మన్ననలు పొందిన ఘనత కొణిజేటి రోశయ్యకే దక్కింది. ఆమె హయాంలోనే రోశయ్య తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు. రాజకీయ నేపథ్యం నుంచి  వచ్చినవారు గవర్నర్లుగా త్వరగా వివాదాల్లో చిక్కుకోవడం చూస్తాం. ఇందుకు భిన్నంగా ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా,  అటు అధికార పక్షానికీ, ఇటు ప్రతిపక్షానికీ సమ ప్రాధాన్యమిస్తూ, ‘నొప్పింపక - తానొవ్వక’ తరహాలో ఐదేళ్లపాటు గవర్నర్‌గా అందరి మన్ననలందుకున్నారు. తమిళనాడుకు ఆయన 13వ గవర్నర్‌ అయినప్పటికీ.. రాజ్‌భవన్‌ను ప్రజలకు చేరువ చేసిన తొలి ‘ప్రజానేత’గా తమిళుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు.


2011 ఆగస్టు 31వ తేదీన గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన ఆయన.. 2016 ఆగస్టు 30వ తేదీ వరకు కొనసాగారు. మధ్యలో 2014 జూన్‌ 28 నుంచి అదే ఏడాది ఆగస్టు ఆగస్టు 31వ తేదీ వరకు కర్ణాటక తాత్కాలిక గవర్నర్‌గానూ వ్యవహరించారు.  రాష్ట్రానికి కొత్తగా వచ్చే గవర్నర్‌లకు విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలకడం జయకు అలవాటు లేదు. కానీ తొలిసారిగా ఆమె గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు చెన్నై వచ్చిన రోశయ్యకు ముఖ్యమంత్రి హోదాలో విమానాశ్రయానికి వెళ్లి మరీ స్వాగతం పలికారు. అదే విధంగా గవర్నర్‌గా పదవీకాలం ముగిసి హైదరాబాద్‌ పయనమైనప్పుడు కూడా అనారోగ్యంతో బాధపడుతూనే ఆమె స్వయంగా విమానాశ్రయానికి వచ్చి వీడ్కోలు పలికారు. నిజానికి డీఎంకే భాగస్వామిగా ఉన్న యూపీఏ ప్రభుత్వం.. జయకు చెక్‌ పెట్టేందుకే రోశయ్యను గవర్నర్‌గా తమిళనాడు పంపిందంటూ అప్పట్లో పెద్దపెట్టున ప్రచారం జరిగింది. కానీ.. ‘గవర్నర్‌గా మీ పరిమితి మేరకు రాజ్యాంగం ప్రకారం నడుచుకోండి’ అని సోనియా తనకు సూచించారని అప్పట్లోనే రోశయ్య ప్రకటించారు. అదే విషయం జయకు కూడా స్వయంగా చెప్పారు. ఆమెతో స్నేహం నెరపడంతో పాటు ప్రభుత్వానికి అవసరమైన ఆర్థిక సలహాలు ఇచ్చేవారు. 


చలం సమాధి సంరక్షణ 

‘ఆంధ్రజ్యోతి’ కథనంపై తక్షణ చొరవ

తిరువణ్ణామలైలోని ప్రముఖ రచయిత చలం సమాధి తమిళనాడు గవర్నర్‌ హోదాలో రోశయ్య తీసుకున్న శ్రద్ధతో తిరిగి ఉనికిని పొందింది. ఈ సమాధి రోడ్డు విస్తరణలో కనుమరుగైపోతోందంటూ ‘అరుణాచలంలో అనాథచలం’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ అప్పట్లో కథనం ప్రచురించింది. ఆ వెంటనే రోశయ్య ఆగమేఘాలపై స్పందించారు. ఉన్నతాధికారులతో ఆయనే నేరుగా మాట్లాడి చలం సమాధి కనుమరుగుకాకుండా పరిరక్షించారు. 

Updated Date - 2021-12-05T08:32:06+05:30 IST