ఉగాది నుంచి వలంటీర్లకు సన్మానం: జగన్‌

ABN , First Publish Date - 2022-03-15T23:19:31+05:30 IST

ఉగాది నుంచి వలంటీర్లకు సన్మానం చేస్తున్నామని సీఎం

ఉగాది నుంచి వలంటీర్లకు సన్మానం: జగన్‌

అమరావతి: ఉగాది నుంచి వలంటీర్లకు సన్మానం చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. అసెంబ్లీ కమిటీ హాలులో జగన్‌ అధ్యక్షతన వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రజల్లోకి వెళ్లాల్సిన బాధ్యత ఉందన్నారు. అందుకే ఎల్పీ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. మన ఇళ్లదగ్గర మనం కూర్చోవడం, ప్రజలు మనల్ని కలవడం అన్నదానికి ఇకపై పుల్‌స్టాప్‌ పెట్టాలని ఆయన సూచించారు.  గ్రామాల్లోకి వెళ్లాల్సిన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఆయన నిర్దేశించారు. ఉగాది నుంచి వలంటీర్లకు సన్మానం చేస్తున్నామన్నారు. వారి సేవలకు అవార్డులు ఇస్తున్నామని ఆయన తెలిపారు. 


వారు బాగా చేసిన మంచి పనులకు చాలామంది వలంటీర్లకు మనం పారితోషికం, మెడల్‌ ఇవ్వడం చేస్తున్నామన్నారు. సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్రాల కింద అవార్డులు ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు.  ఏప్రిల్‌ 2నుంచి ఉగాది రోజున జరిగే ఈ కార్యక్రమం నెలరోజుల పాటు సాగుతుందన్నారు. ప్రతి ఊరికీ వెళ్లి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలని ఆయన ఆదేశించారు. గత ఏడాది కూడా వలంటీర్లను సన్మానించామన్నారు. ఈసారి ప్రతి రోజూ 3, 4 గ్రామాలు వెళ్లి వాలంటీర్లను గౌరవించే కార్యక్రమంలో పాల్గొనాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జగన్ సూచించారు. 

Updated Date - 2022-03-15T23:19:31+05:30 IST