కేంద్ర గెజిట్‌ను కొట్టేయండి

ABN , First Publish Date - 2022-08-19T07:59:35+05:30 IST

తెలంగాణ, ఏపీలోని కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను తన ఆధీనంలోకి తీసుకునేలా కేంద్రం గత ఏడాది జూలైలో ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను కొట్టేయాలని కోరుతూ తెలంగాణ డెవల్‌పమెంట్‌ ఫోరం (టీడీఎఫ్‌) హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసింది.

కేంద్ర గెజిట్‌ను కొట్టేయండి

నీటి ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవడం తగదు

హైకోర్టును ఆశ్రయించిన టీడీఎఫ్‌ 

పిటిషన్‌ విచారణార్హతను తేల్చనున్న హైకోర్టు 


హైదరాబాద్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ, ఏపీలోని కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను తన ఆధీనంలోకి తీసుకునేలా కేంద్రం గత ఏడాది జూలైలో ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను కొట్టేయాలని కోరుతూ తెలంగాణ డెవల్‌పమెంట్‌ ఫోరం (టీడీఎఫ్‌) హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసింది. అయితే అంతర్రాష్ట్ర నదీజల వివాదాలపై విచారణ జరిపే పరిధి హైకోర్టుకు లేదని పేర్కొంటూ హైకోర్టు రిజిస్ర్టీ ఈ పిటిషన్‌ విచారణార్హతపై అభ్యంతరం వ్యక్తం చేసింది. రిజిస్ర్టీ అభ్యంతరం నేపథ్యంలో  ఈ వ్యాజ్యానికి రెగ్యులర్‌ నెంబర్‌ ఇవ్వలేదు. దాంతో ఈ పిటిషన్‌ విచారణార్హతపై గురువారం చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ సీవీ భాస్కర్‌ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎన్‌ఎస్‌ అర్జున్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఈ వివాదాస్పద గెజిట్‌ నోటిపికేషన్‌ను ఏపీ పునర్విభజన చట్టం - 2014 ప్రకారం జారీచేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇది అంతర్రాష్ట్ర జలవివాదం కిందికి రాదని పేర్కొన్నారు. అందువల్ల విచారణ చేపట్టే అధికారం హైకోర్టుకు ఉందని తెలిపారు. రెండు రాష్ర్టాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించడానికి బదులు.. మొత్తం ప్రాజెక్టులను తన ఆధీనంలోకి తీసుకునేందుకు కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తుస్తోందని ఆరోపించారు. ఇద్దరు యజమానుల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించే పేరుతో మూడో పార్టీ ఆస్తులను లాక్కున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు.  కృష్ణా, గోదావరి రివర్‌ బోర్డులకు రెండు రాష్ర్టాలు రూ. 200 కోట్ల చొప్పున ఇవ్వడంతోపాటు సిబ్బంది, ఇతర సౌకర్యాలను కేటాయించాలని కేంద్రం ఆదేశించిందని పేర్కొన్నారు. రివర్‌ బోర్డులు, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆదేశాలు పాటించకపోతే జరిమానాలు విధిస్తామని సైతం హెచ్చరించిందని ఆరోపించారు. ఏ ప్రాతిపదికన కేంద్రం ఈ ఆదేశాలు జారీచేసిందో తెలియదని పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏఏజీ జె. రామచంద్రరావు వాదిస్తూ.. ప్రస్తుత పిటిషన్‌లో ఉన్న అంశం అంతర్రాష్ట్ర నదీజల వివాదం మాత్రం కాదని పేర్కొన్నారు. దీనిపై విచారించే అధికారం హైకోర్టుకు ఉన్నన్నదని తెలిపారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను సెప్టెంబర్‌ 20కి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌కు విచారణార్హత ఉందా? లేదా? అన్న అంశంపై తదుపరి వాదనలు కొనసాగనున్నాయి. 

Updated Date - 2022-08-19T07:59:35+05:30 IST