ఆయన జీవితం వైవిధ్య భరితం

ABN , First Publish Date - 2020-03-11T08:20:30+05:30 IST

దాదాపు రెండు వారాల క్రితం నేను, ప్రొ. డి.నర్సింహారెడ్డి పొత్తూరిగారిని చూడడానికి వెళ్లినప్పుడు దాదాపు గంటకు పైగా మాతో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడినంత సేపు సమాజం ఏ దిశలో వెళ్తుంది అనే ఆవేదనతోబాటు చాలాసేపు శాంతి చర్చల ...

ఆయన జీవితం వైవిధ్య భరితం

విప్లవ పార్టీలు, ప్రభుత్వానికి మధ్య ముఖాముఖి చర్చలను పొత్తూరి ప్రతిపాదించినప్పుడు ఆయనకు కొంత అమాయకత్వం ఉందని అనుకున్నాను. ఆదర్శాలకి కొంత అమాయకత్వం అవసరమని బాలగోపాల్‌ మాటలు గుర్తుచేసుకున్నాను. ‘మేధస్సు నిరాశకు గురవుతుంటే ఆత్మ బలం మనిషిని ఆశావాదిగా ఉంచుతుందనే’ గ్రాంసీ సూత్రీకరణను గుర్తుకుతెచ్చుకున్నాను. నేను భావించిన అసాధ్యమనే చర్చలు 2014 అక్టోబర్‌లో సాకారమయ్యాయి. ‘శాంతి చర్చల’ను ప్రతిపాదించిన పొత్తూరికి చరిత్ర ఒక శాశ్వతత్వాన్ని ఇస్తుందనే నా నమ్మకం.


దాదాపు రెండు వారాల క్రితం నేను, ప్రొ. డి.నర్సింహారెడ్డి పొత్తూరిగారిని చూడడానికి వెళ్లినప్పుడు దాదాపు గంటకు పైగా మాతో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడినంత సేపు సమాజం ఏ దిశలో వెళ్తుంది అనే ఆవేదనతోబాటు చాలాసేపు శాంతి చర్చల గురించే మాట్లాడారు. నల్లమలలో విప్లవ నాయకులతో గడిపిన ఘడియలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ జీవితాల గురించి మాట్లాడడమే కాక శాంతి చర్చలు విఫలం కావడానికి ప్రభుత్వమే కారణమని, అనవసరంగా ఒక మంచి అవకాశం కోల్పోయారని బాధపడ్డారు. ఈ బాధ గతంలో నాతో చాలాసార్లు పంచుకున్నారు. శాంతి చర్చల ప్రక్రియలో శంకరన్‌ గారిది, పొత్తూరి గారిది కీలకమైన పాత్ర. మిగతా అందరమూ అప్పుడప్పుడు సలహాలివ్వడం శాంతి ప్రయత్నాన్ని ముందుకు తీసుకువెళ్ళే క్రమంలో మా శక్తికి తగిన పాత్రను నిర్వహించాం. శాంతి ప్రయత్నాలు దాదాపు దశాబ్దకాలం (1996–2005) జరిగాయి. ఈ ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో విప్లవ పార్టీలు, ప్రభుత్వం ఒకరితో ఒకరు ముఖాముఖి చర్చలు జరపాలని పొత్తూరి ప్రతిపాదించినప్పుడు నాకు నేనుగా అది అసాధ్యమని భావించిన వాళ్ళలో ఒకడిని.


విప్లవ పార్టీలు మొత్తంగా వ్యవస్థ మారాలని, సాయుధ పోరాటంతోనే అది సాధ్యమని నమ్మిన పార్టీలు. ప్రభుత్వం ఈ వ్యవస్థను, యథాతథస్థితిని కొన సాగించే యం త్రాంగం. విప్లవ పార్టీ నిషేధిత సంస్థ. అయితే శాంతి ప్రయత్నాలు ప్రారంభమైనప్పుడు, ప్రభు త్వం రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలకు, చట్టబద్ధ పాలనకు కట్టుబడి ఉండవలసినదని, విప్లవపార్టీలు ప్రజాజీవితం బాగుపడాలని పేద వర్గాలు నిండైన మనుషులుగా బ్రతకాలని త్యాగాలు చేస్తున్నా యని భావించి, లక్ష్యాలలో కొంత సారూప్యత ఉన్నదని, రెండు వైపులా ప్రాణనష్టం లేకుండా ప్రజా ఎజెండా ఇద్దరికీ కీలకం కావాలనే ప్రాతిపదిక మీద ఆ ప్రయత్నం ప్రారంభమైంది. కాని పొత్తూరి గారు ఒక అడుగు ముందుకు వేసి ముఖాముఖి చర్చలను ప్రతిపాదించారు. ఇది ప్రతిపాదించినప్పుడు ఆయనకు కొంత అమాయకత్వం ఉందని అనుకొని, ఐనా ఆదర్శాలకి కొంత అమాయకత్వం అవసరమని బాలగోపాల్‌ మాటలు గుర్తుచేసుకునేవాడిని. ‘మేధస్సు నిరాశకు గురవుతుంటే ఆత్మ బలం మనిషిని ఆశావాదిగా ఉంచుతుంది (pessimism of the intellect optimism of the will)’ అనే గ్రాంసీ (Gramsi) సూత్రాన్ని ప్రతిసారి గుర్తుకుతెచ్చుకునేవాడిని. పొత్తూరి ఆశావాదం, ఆత్మబలం సాకారమైంది. నేను అసాధ్యమని భావించిన చర్చలు 2014 అక్టోబర్‌లో సాకారం అయ్యాయి. విప్లవాల ఉద్యమ చరిత్రలో ఇలాంటి అవకాశాలుంటాయి అనేది ప్రయోగాత్మకంగా జరిగితే తప్ప సైద్ధాంతిక అవగాహన దీనికి చాలా వరకు పనికిరాదు అనేది అనుభపూర్వకంగా అర్థమైంది. చర్చలు జరిగినప్పుడు, చర్చలు ఆగినా సాగినా ఇదొక చారిత్రక మలుపు అని రాశాను. చరిత్రలో ఈ మలుపునకు దోహద పడింది ఆయనే.


పొత్తూరి గారి ఆరోగ్యం దెబ్బతిన్నదని తెలిసి ఫోన్‌ చేసి నా ఆందోళన తెలియచేసినప్పుడు, ‘‘ఏముంది బ్లడ్‌క్యాన్సర్‌ అంతే, ఐనా ఆందోళన ఎం దుకు అక్కడ శంకరన్‌ గారు, కన్నాభిరాన్‌గారు, బాలగోపాల్‌ లాంటి వాళ్లంతా ఉన్నారు, మంచి కంపెనీ ఉంది కదా’’ అన్నప్పుడు అమిత ఆశ్చర్యం వేసింది. పొత్తూరి గారికి ఒక స్పిరిట్యువల్‌ జీవితం ఉంది. ఆయన విశ్వాసాలు చాలా బలమైనవి. ఎవరు ఏం అనుకుంటారు అనే పట్టింపు ఆయనకు లేదు. తన విశ్వాసాలే తనవి. మేం నల్లమల వెళ్లినప్పుడు ఉదయం 7గంటలకి జపం చేసుకున్నారు. తర్వాత నాతో ‘‘నేను జపం చేసుకుంటే విప్లవ పార్టీ నాయకులు ఏం అభ్యంతరం చెప్పలేదే’’ అని అంటే చాలా ముచ్చట వేసింది. మా మాటల సందర్భంలో జిల్లెళ్లమూడి అమ్మ గురించి చెప్పేవారు. అందుకే ఆయన ఆత్మకథ ‘విధి నా సారథి’ ఆవిష్కరణ సందర్భంలో మాట్లాడమని అడిగినప్పుడు ‘‘జిల్లెళ్లమూడి అమ్మ మాతృత్వాన్ని గురించి మావోయిస్టులకి, మావోయిస్టుల త్యాగాల గురించి అమ్మకు చెప్పగల విశిష్టత, సంక్లిష్టత ఒక పొత్తూరి గారికే సాధ్యం’’ అన్నాను. జిల్లెళ్లమూడి అమ్మ గురించి కాని, తన జపం గురించి కాని పట్టింపులేని విప్లవ పార్టీలు ఆయనను అభిమానించి గౌరవించాయి అని నేను అంటే, అప్పటి గవర్నర్‌ నరసింహన్ మాట్లాడుతూ విప్లవ పార్టీల అభిమానం పొందిన పొత్తూరి క్రెడిబిలిటి ఎంతో గొప్పదని వ్యాఖ్యానించారు.


పొత్తూరి గారికి చాలా మంది పోలీసు అధికారులతో వ్యక్తిగత సంబంధాలున్నాయి. వాళ్లు కలిసినప్పుడు ఎన్‌కౌంటర్ల గురించి సూటిగా అడిగేవారు. ఆ విషయం చెపుతూ ‘‘మా ధర్మంలో భాగంగా చేస్తున్నాం అంటారు కానీ ఇది ఏం పాడు ధర్మం’’ అని నాతో అనేవారు. ఆయనకు చాలా మంది రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలుండేవి ఎన్‌. జనార్ధన్‌ రెడ్డి ట్రస్ట్‌కు ట్రస్టీగా ఉన్నారు. ఆ ట్రస్ట్‌లో మీరెందుకు సార్‌ అంటే ప్రతి మనిషిలో ఏదో కొంత మంచి ఉంటుంది అని అనేవారు. చెన్నారెడ్డితో సాన్నిహిత్యం ఉండేది. ఆయనను వ్యక్తిగత విషయాల మీద ప్రశ్నిస్తే నా వ్యక్తిగత జీవిత వివరాలు మీదాక ఎలా వస్తున్నాయని నవ్వేవారట. చాలా మంది రాజకీయ నాయకులు వాళ్లవాళ్ల పరిమితులు ఏమున్నా పొత్తూరి గారిని వ్యక్తిగతంగా అభిమానించి గౌరవించేవారు. ఇంత మంది ఇన్నిరంగాల వారి గౌరవం పొందడంలో పొత్తూరి గారి జీవిత రహస్యం మీద పరిశోధన చేయవలసిందే. 


పొత్తూరి గారు గుంటూరుకు చెందిన వారైనా తెలంగాణ ఉద్యమానికి మొదటి నుండి మద్దతుదారు. వాళ్లు వేరే రాష్ట్రం కావాలంటున్నారు ఎందుకు అభ్యంతరం అని కొంత అమాయకంగానే అనే వారు. మొదటి దఫా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు, ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు ఇందిరా గాంధీ అర్ధరాత్రి హైదరాబాద్‌కు వచ్చి కలిసిన అరడజను ప్రముఖులలో పొత్తూరి గారు ఒకరు. తర్వాత ఉద్యమానికి మొదటి నుండి నైతికంగా తన మద్దతు ఇవ్వడమే కాక చుక్కరామయ్య గారు, డాక్టర్‌ గోపాలకృష్ణ, పొత్తూరి గారు, నేను కలవని రాజకీయ నాయకులు లేరు. అన్ని పార్టీల వాళ్లని కలిసేవాళ్లం. ముఖ్యమంత్రి రోశయ్యను, అలాగే తర్వాత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని కలిశాం. కేసీఆర్‌ నిరహారదీక్ష చేసినప్పుడు రోశయ్య గారు వెళ్లి కలవటం బాగుటుందని పొత్తూరి గారు సలహా ఇచ్చారు. తీరా అక్కడికి వెళితే ఆయన కలవను అంటే, ముఖ్యమంత్రి పదవికి అవమానం కదా అంటే, కలవకపోతే అది ఆయన తప్పే అవుతుంది, మీ గౌరవానికి అది భంగం కాదని ఒప్పించారు. మేం రోశయ్య గారిని కలిసేదాక పొత్తూరి ఈ ప్రతిపాదన పెడతారని ఊహించలేదు. రెండవ దఫా ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న కాలంలో కేసీఆర్‌ గారు ఒక టీవి ఛానల్‌లో మాట్లాడుతూ రెండు ప్రాంతాలకు సంబంధించిన కొందరు ప్రముఖులు మాట్లాడితే బాగుంటుందంటూ తాను సూచించిన మూడు పేర్లలో జయశంకర్‌, పొత్తూరి, నా పేర్లు ఉన్నాయి. ఒక ఉద్యమ నాయకుడు తెలంగాణ తరఫున మాట్లాడడానికి పొత్తూరిగారి పేరు సూచించడం పొత్తూరి గారి విశ్వసనీయతకు ఒక నిండు నిదర్శనం.


పొత్తూరి గారు ఇలాంటి సార్వజనీన గౌరవాన్ని పొందడానికి ఆయనలో ఉండే నిజాయితీ ఒక పెద్ద కారణం. వ్యక్తిగతంగా తెలుగులో దాదాపు నాలుగు దినపత్రికలకు ఎడిటర్‌గా పనిచేసి పదవీ విరమణ తర్వాత డబ్బులకు ఇబ్బంది పడ్డారు. ఆయన కుమారులు, ముఖ్యంగా గోపాల్‌, తండ్రిని చివరిదాకా అత్యంత ప్రేమపాత్రంగా చూసుకున్నారు. పొత్తూరి శ్రీమతి గురించి ఎంత రాసినా తక్కువే. ఆయన చేసే పనులకు దీపస్తంభంగా నిలబడ్డది. ఆమె చాలా సంపన్న కుటుంబం నుంచి వచ్చిందని, తాను ఆమెను సుఖపెట్టలేదని అప్పుడప్పుడు అనేవారు. డబ్బులకిబ్బంది పడుతున్నారని మిత్రుడు దేశపతితో అంటే అది ఆయన ముఖ్యమంత్రితో ప్రస్తావిస్తే ఆయన ఆరోగ్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పమని అన్నప్పుడు దేశపతి, జ్వాలా నరసింహారావు, రాంచంద్రమూర్తి గారు, నేను కలిసి పొత్తూరికి విషయం చెబితే, పిల్లలు తనను చూసుకుంటున్నారని ఈ సహాయం వాళ్ల మనసుకు బాధ పెడుతుందని సున్నితంగా తిరస్కరిస్తూ, బ్రాహ్మలలో కడు పేదవాళ్లున్నారని వాళ్లకొరకు ఏదైనా చేయమని ముఖ్యమంత్రికి చెప్పమన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ పెట్టడానికి అది కారణం కావచ్చు. 


పొత్తూరి గారి జీవితాన్ని నడిపింది ఆయన అంతరాత్మ (conscience), తన అంతరాత్మకు తాను బాధ్యుడినని బలంగా భావించే వారు. తన విజయాలకి విధి కారణమని, తన వైఫల్యాలకు తానే కారణమనే వాదనే ఆయన ఆత్మకథ నిండా కనిపిస్తుంది. నిజాయితీ, ఈ స్వచ్ఛమైన అంతరాత్మ ఆయనలో చాలా బలమైన శక్తులుగా నిలిచాయి. ఆయన ఒక ప్రముఖమైన ప్రఖ్యాతిగల జర్నలిస్టుగా, ఎడిటర్‌గా నిలబడటానికి, ఇవ్వాళ సమాజంలో ఇంత గౌరవాన్ని పొందడానికి అవే కారణమని నేను భావిస్తున్నాను. తెలుగు పౌరసమాజం పొత్తూరుగారి మరణంతో పేదదైంది. చాలా మంది ప్రస్తావించినట్లు పౌర సమాజంలో ఆయనది ప్రత్యేకమైన ప్రజాస్వామిక గొంతు. ఆయన వ్యా‌ఖ్యలను, అభిప్రాయాలను ఖండిస్తే, ఖండించే వాళ్ల గౌరవం తగ్గుతుంది తప్ప పొత్తూరి గారికి నష్టమేమిలేదు. ప్రపంచంలో జరుగుతున్న అన్ని కష్టాలకు స్పందించేవారు, బాధపడేవారు. మంచి మనుషులు, నిబద్ధత కలిగిన వాళ్లు ఎవరు కలిసినా కనిపించినా చాలా ఆనందపడేవారు. కన్నాభిరాన్‌ అన్నా, శంకరన్‌ గారు అన్నా ఆయనకొక ఆరాధనా భావముండేది. మంచితనం ఎక్కడున్నా పులకించిపోయేవారు. వరవరరావు అన్నా, బాలగోపాల్‌ అన్నా అత్యంత గౌరవ భావముండేది. వరవరరావు గారు ఎప్పుడైనా ఆవేశంతో మాట్లాడినా అది ఆయన కమిట్‌మెంట్‌ వల్ల అనే అర్థం చేసుకునేవారు. విప్లవకారులు, పౌరహక్కుల కార్యకర్తలు ఎక్కడ అరెస్టయినా ఖండించేవారు. పిటిషన్స్‌ మీద సంతకం చేసేవారు. ఎవరినైనా కలవాలంటే వచ్చేవారు, తనదైన పరిణిత పద్ధతిలో వాదించేవారు. ఇవ్వాళ మన మధ్య నిజాయితీ గలిగి నైతిక ధైర్యం ఉన్న మనుషులు చాలా అరుదైపోయారు. మానవత్వం పరిమళించిన మనుషులలో అగ్రస్థానంలో ఉండగల మనిషి. ఆత్మీయుడు. మనకు ఎన్నో సుసంపన్న జ్ఞాపకాలను వదిలి వెళ్లారు. అన్నిటికంటే మించి ఆయన చేసిన ‘ముఖాముఖి శాంతి చర్చల’ ప్రతిపాదన ఒక శాశ్వతమైన జ్ఞాపకంగా, ప్రయోగంగా చరిత్రలో నిలిచి పొత్తూరికి ఒక శాశ్వతత్వాన్ని ఇస్తుందనే నా నమ్మకం. 

ప్రొ. జి.హరగోపాల్‌

Updated Date - 2020-03-11T08:20:30+05:30 IST