బాలయ్య రంగంలోకి దిగడంతో సీన్ మారింది..

ABN , First Publish Date - 2021-03-05T09:36:46+05:30 IST

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యూహంతో వైసీపీ ఎత్తుగడలు బెడిసికొట్టాయి. హిందూపురం మున్సిపాల్టీలో ఏకగ్రీవాల కోసం ఆ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ పోలీసు

బాలయ్య రంగంలోకి దిగడంతో సీన్ మారింది..

  • హిందూపురంలో.. పారని ఏకగ్రీవ పాచిక!
  • టీడీపీ అభ్యర్థులకు బాలయ్య అండ


అనంతపురం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యూహంతో వైసీపీ ఎత్తుగడలు బెడిసికొట్టాయి. హిందూపురం మున్సిపాల్టీలో ఏకగ్రీవాల కోసం ఆ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ పోలీసు అధికారి మహ్మద్‌ ఇక్బాల్‌ చేసిన ప్రయత్నాలకు బాలయ్య చెక్‌ పెట్టారు. సామాజిక వర్గాన్ని ప్రేరేపించినా.. ప్రలోభాలకు గురిచేసినా.. కేసులతో భయపెట్టాలని చూసినా... టీడీపీ అభ్యర్థులు ఎక్కడా అదరలేదు.. బెదరలేదు. బాలయ్య అండతో నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ససేమిరా అనడంతో.. ఎమ్మెల్సీతోపాటు ఆ మున్సిపాలిటీకి వైసీపీ పరిశీలకుడు, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిల వ్యూహరచనకు ఆదిలోనే గండి పడింది. ఈ పురపాలక సంఘంలోని 38 వార్డుల్లోనూ వైసీపీ అభ్యర్థులకు దీటుగా టీడీపీ అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురంలోనే తిష్ఠవేయడంతో అధికార పార్టీ ఏమీ చేయలేకపోయింది. నియోజకవర్గ పరిధిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు గెలవకపోవడంతో.. ఆయన మున్సిపల్‌ ఎన్నికలపై దృష్టి సారించారు.


ఇది గ్రహించిన బాలయ్య.. హిందూపురం మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగురవేసి తీరాలన్న లక్ష్యంతో వ్యూహరచన చేశారు. అందులో భాగంగా.. నామినేషన్ల ఉపసంహరణకు ఆరు రోజుల ముందే తన ప్రతినిధులైన శ్రీనివాసరావు, సురేంద్రనాథ్‌లను హిందూపురంలో మకాం వేయించారు. స్థానిక టీడీపీ ముఖ్య నాయకులతో, ఎన్నికల పరిశీలకులతో ఎప్పటికప్పుడు ఫోన్లో  మాట్లాడుతూ.. సూచనలు చేస్తూ వచ్చారు. షూటింగ్‌లో బిజీగా ఉన్నా.. అభ్యర్థులెవరూ విత్‌డ్రా చేసుకోకుండా స్థానిక నేతలను అప్రమత్తం చేస్తూ వచ్చారు. నామినేషన్ల ఉపసంహరణ రోజు ఒక్కో అభ్యర్థి వెంట ముగ్గురు టీడీపీ నాయకులను పంపి బీ-ఫారాలు అందజేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అధికార పార్టీ నాయకుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. అన్ని వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు పోటీలో నిలిచేలా బాలయ్య వ్యూహం పన్నడంలో సఫలమయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Updated Date - 2021-03-05T09:36:46+05:30 IST