ఫాంహౌజ్‌ నుంచి లాక్కొచ్చి.. జైల్లో పడేస్తాం

ABN , First Publish Date - 2022-01-10T08:09:14+05:30 IST

సీఎం కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని అసోం సీఎం హిమంత విశ్వ శర్మ ధ్వజమెత్తారు.

ఫాంహౌజ్‌ నుంచి లాక్కొచ్చి.. జైల్లో పడేస్తాం

కేసీఆర్‌ ఆ రోజులను లెక్కపెట్టుకోవాలి.. ఇందిరాగాంధీకి పట్టిన గతే ఆయనకూ..

కమ్యూనిస్టులతో కేసీఆర్‌ దోస్తీ విడ్డూరం.. ఉద్యోగ, నిరుద్యోగులు టీఆర్‌ఎస్‌ను పాతరేస్తారు

317 జీవోపై నిరసన సభలో ధ్వజమెత్తిన అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ

కేసీఆర్‌ ఏ సొరంగంలో దాక్కున్నా లాక్కొస్తా: బండి.. 


హనుమకొండ, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని అసోం సీఎం హిమంత విశ్వ శర్మ ధ్వజమెత్తారు. ఎంపీ కార్యాలయంలోకి చొరబడి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని అత్యంత అమానుషంగా అరెస్టు చేసిన పోలీసులే ఫామ్‌ హౌజ్‌లోకి చొరబడి కేసీఆర్‌ను కూడా లాక్కుపోయే రోజు ఎంతో దూరం లేదని అన్నారు. ఆ రోజులను సీఎం కేసీఆర్‌ ఇప్పటి నుంచే లెక్కపెట్టుకోవాలని హెచ్చరించారు. ఆదివారం హనుమకొండలోని దీన్‌దయాల్‌నగర్‌లో 317 జీవోకు, బండి సంజయ్‌ అరెస్టుకు వ్యతిరేకంగా నిర్వహించిన సభలో హిమంత విశ్వ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, దమన నీతితో పరిపాలన సాగించిన వారంతా కాలగర్భంలో కలిసి పోయారన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన తర్వాత ఇందిరాగాంధీకి పట్టిన గతే.. పోలీసుల రాజ్యం సాగిస్తున్న కేసీఆర్‌కూ  పడుతుందన్నారు.


2013 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రజాశక్తి ముందు ధన బలం పని చేయదని హుజూరాబాద్‌ ఎన్నికలు రుజువు చేశాయని స్పష్టం చేశారు. కమ్యూనిస్టులు కాలగర్భంలో కలిసిపోతున్నారని, అలాంటి వారికి కేసీఆర్‌ విందు భోజనాలు ఏర్పాటు చేయ డం చూస్తుంటే, కనుమరుగైపోయే పార్టీలన్నీ ఒక్కదగ్గర చేరుతున్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన కమ్యూనిస్టులతో కేసీఆర్‌ దోస్తీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక సంవత్సరంలో లక్ష మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చే సమగ్రమైన కార్యాచరణను అసోంలో తమ ప్రభుత్వం అమలు చేయబోతోందని.. ఇక్కడ సీఎం కేసీఆర్‌ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా, ఉన్న ఉద్యోగులను చెట్టుకొకరిని, పుట్టకొకరిని పంపి ఇబ్బందుల పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2023లో టీఆర్‌ఎ్‌సను నిరుద్యోగులు, ఉద్యోగులే పాతర పెడతారని విశ్వ శర్మ హెచ్చరించారు.  


కేసీఆర్‌ను వదిలేదు లేదు..

తాను అధికారంలో ఉన్నానని విర్రవీగుతున్న కేసీఆర్‌.. కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ అన్నది మరచిపోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. కేసీఆర్‌ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు సహారా, ఈఎస్‌ఐ కేసుల్లో పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆయన అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు తనను అరెస్టు చేశారని..కేసీఆర్‌ ఏ సొరంగంలో దాక్కున్నా లాక్కొచ్చి  తెలంగాణ మొత్తం తిప్పుతానని అన్నా రు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న కేసీఆర్‌ను జైలుకు పంపి తీరుతామని చెప్పారు. స్థానికత కోసం కొట్లాడి రాష్ట్రం తెచ్చుకుంటే, దానిని కాదని సీనియారిటీ పేరుతో సీనియర్‌, జూనియర్‌ ఉద్యోగుల మధ్య కొట్లాట పెడుతున్నారని మండిపడ్డారు. 2023లో రాష్ట్రంలో బీజేపీ అఽధికారంలోకి రాగానే 317 జీవోను చెత్తబుట్టలో పడేస్తుందని సంజయ్‌ హామీ ఇచ్చారు. కాగా, దీన్‌ దయాల్‌ నగర్‌లోని విష్ణుప్రియ గార్డెన్స్‌లో సభ నిర్వహణకు పోలీసులు అనుమతివ్వకపోవడంతో దగ్గరలోని ఖాళీ ప్రదేశంలో సభ ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-01-10T08:09:14+05:30 IST