హైకోర్టును అపఖ్యాతి పాల్జేయడానికే ‘పిల్‌’

ABN , First Publish Date - 2020-08-08T08:39:09+05:30 IST

హైకోర్టు ప్రాంగణాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలంటూ దాఖలైన పిల్‌పై రిజిస్ట్రార్‌ జనరల్‌(ఆర్‌జీ) తాజాగా అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు.

హైకోర్టును అపఖ్యాతి పాల్జేయడానికే ‘పిల్‌’

  • ఆ సంఘాల సభ్యులకు జస్టిస్‌ ఈశ్వరయ్యకు సంబంధాన్ని తోసిపుచ్చలేమన్న పిటిషనర్‌
  • రిజిస్ట్రార్‌ జనరల్‌ తాజా అనుబంధ పిటిషన్‌ 
  • హైకోర్టును రెడ్‌ జోన్‌గా ప్రకటించాలన్న వ్యాజ్యంపై విచారణ సోమవారానికి వాయిదా

అమరావతి, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): హైకోర్టు ప్రాంగణాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలంటూ దాఖలైన పిల్‌పై రిజిస్ట్రార్‌ జనరల్‌(ఆర్‌జీ) తాజాగా అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిల్‌ దురుద్దేశంతో దాఖలైందని, దానిని కొట్టివేయాలని అభ్యర్థించారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఆరోపణలు చేస్తూ రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు సీజేకి, జడ్జీలకు, న్యాయశాఖ మంత్రికి అఖిలభారత బీసీ ఫెడరేషన్‌ ఫిర్యాదు చేసిందన్నారు. ఆ ఫెడరేషన్‌ లెటర్‌హెడ్‌ ప్రకారం ఆ సంస్థకు ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ కమిషన్‌ చైర్మన్‌గా ఉన్న జస్టిస్‌ వి.ఈశ్వరయ్య అధ్యక్షుడిగా ఉన్నారని తెలిపారు. ఆ ఫిర్యాదులోని కొన్ని అంశాలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అపఖ్యాతి పాల్జేసేలా ఉన్నాయని, అందులోని ఆరోపణలను పోలిన అంశాలే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య దాఖలు చేసిన పిల్‌లోనూ ఉన్నాయని తెలిపారు. ఆ రెండు సంఘాలకు, సభ్యులకు, జస్టిస్‌ ఈశ్వరయ్యకు మధ్య సంబంధాన్ని తోసిపుచ్చలేమని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనం కోసం కుట్రపూరితంగా ఆ అసోసియేషన్‌ పేరుతో పిటిషన్‌ దాఖలు చేశారని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన పలు తీర్పులపై సామాజిక మాధ్యమాల వేదికగా కొంతమంది రాజకీయ నేతలు విమర్శలు చేశారని పేర్కొన్నారు.


సిట్టింగ్‌ ఎంపీలు, అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు న్యాయవ్యవస్థకు అపకీర్తి తెచ్చేలా పోస్టులు పెట్టారని, వాటికి సంబంధించిన ఆధారాలున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించి కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదు చేసిందని గుర్తు చేశారు. గతనెల 2న ఓ ఆంగ్లపత్రిక కథనం ప్రకారం.. స్పీకర్‌ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థనే తక్కువ చేసేలా ఉన్నాయని ఆర్‌జీ తన అనుబంధ పిటిషన్‌లో వివరించారు. హైకోర్టు ప్రాంగణాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించడంతోపాటు ఇంచార్జ్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ మృతిపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని అభ్యర్థిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య సభ్యుడు లక్ష్మీనరసయ్య హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం ముందు మరోమారు విచారణ జరిగింది. కాగా, ఈ పిటిషన్‌లో వాదనలు వినిపించేందుకు తనకు అవకాశం ఇవ్వాలంటూ సస్పెన్షన్‌లో ఉన్న న్యాయాధికారి ఎస్‌.రామకృష్ణ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.


విచారణ సందర్భంగా రామకృష్ణ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. జస్టిస్‌ ఈశ్వరయ్య న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై పలు ఆరోపణలు చేశారని, అలాంటి ఆరోపణలకు అడ్డుకట్ట వేయకుంటే న్యాయపరిపాలనే కుంటుపడుతుందని తెలిపారు. అందువల్ల ఈ పిటిషన్‌లో వాదనలు వినిపించేందుకు తమకు అవకాశం ఇవ్వాలని, తమను ప్రతివాదిగా చేర్చుకోవాలని అభ్యర్థించారు. కాగా, రామకృష్ణ దాఖలుచేసిన అనుబంధ పిటిషన్‌ స్వీకరణకు తమకెలాంటి అభ్యంతరం లేదని ఈ సందర్భంగా అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం ధర్మాసనానికి తెలిపారు. అయితే, సమాఖ్య తరఫు న్యాయవాది కె.అశోక్‌రెడ్డి మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై తాము కౌంటర్‌ దాఖలు చేస్తామని, కొంత సమయం కావాలని అభ్యర్థించారు. ఇందుకు అనుమతించిన ధర్మాసనం.. శనివారంలోగా వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అంతకు ముందు హైకోర్టు తరఫు సీనియర్‌ న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌ వాదలు వినిపిస్తూ.. ఆర్‌జీ తాజాగా దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ గురించి వివరించారు. ఆ అనుబంధ పిటిషన్‌ను ధర్మాసనం అనుమతించింది.

Updated Date - 2020-08-08T08:39:09+05:30 IST