వైద్య పరీక్ష లేకుండా మద్యం తాగినట్టు నిర్ధారించొద్దు!

ABN , First Publish Date - 2022-05-17T09:10:47+05:30 IST

వైద్య పరీక్ష లేకుండా మద్యం తాగినట్టు నిర్ధారించొద్దు!

వైద్య పరీక్ష లేకుండా మద్యం తాగినట్టు నిర్ధారించొద్దు!

ఆ డ్రైవర్‌ను తిరిగి సర్వీస్‌లోకి తీసుకోండి

ఆర్టీసీ అధికారులకు హైకోర్టు ఆదేశం

సింగిల్‌ జడ్జి తీర్పును సమర్థించిన ధర్మాసనం


అమరావతి,  మే 16(ఆంధ్రజ్యోతి): వైద్య నిర్ధారణ(మెడికల్‌ ఎవిడెన్స్‌) లేకుండా డ్రైవర్‌ మద్యం తాగినట్టు తేల్చడానికి వీల్లేదని హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. ప్రయాణికుడు లేదా సహ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సంబంధిత డ్రైవర్‌ను సర్వీస్‌ నుంచి తొలగించలేరని స్పష్టం చేసింది. బస్సు నడిపే సమయంలో డ్రైవర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని నిరూపించేందుకు మెడికల్‌ ఎవిడెన్స్‌ తప్పనిసరని పేర్కొంది. బస్సు నడుపుతున్న  డ్రైవర్‌ 100 ఎం.ఎల్‌ రక్తంలో 30 ఎం.జీ ఆల్కాహాల్‌ ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినప్పుడే మోటార్‌ వెహికల్‌ చట్టం నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. సరైన మెడికల్‌ ఎవిడెన్స్‌ లేకుండా మద్యం తాగినట్లు తేల్చడానికి వీల్లేదంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్ధించింది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు వేసిన అప్పీల్‌ను ధర్మాసనం కొట్టివేసింది.


సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పిటిషనర్‌ వేంకటేశ్వరావును తిరిగి సర్వీ్‌సలోకి తీసుకోవడంతో పాటు పెండింగ్‌ జీతం, బెనిఫిట్స్‌ను 8 వారాల్లో చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. విశాఖ జిల్లా, సిరిలివీధి జ్ఞానాపురానికి చెందిన చిరతనగండ్ల వేంకటేశ్వరరావు 1985లో ఆర్టీసీలో డ్రైవర్‌గా నియమితులయ్యారు. అయితే, 2004 జనవరి 3న విశాఖపట్నం నుంచి మల్కాన్‌గిరి వెళ్తుండగా మద్యం తాగి డ్రైవింగ్‌ చేస్తున్నారనే ఆరోపణలతో శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. విచారణలో మద్యం తాగి బస్సు నడుపుతున్నారని నిర్ధారించి 2004 ఏప్రిల్‌ 27న ఆర్టీసీ అధికారులు విధుల నుంచి తొలగించారు. ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ వేంకటేశ్వరరావు విశాఖలోని ఇండస్ట్రీయల్‌ ట్రైబ్యునల్‌ కమ్‌ లేబర్‌ కోర్టును ఆశ్రయించారు. అయితే, ఆ పిటిషన్‌ను 2006 నవంబరు 30న లేబర్‌ కోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ వేంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యాన్ని విచారించిన సింగిల్‌ జడ్జి మెడికల్‌ ఎవిడెన్స్‌ లేకుండా కేవలం వ్యక్తుల సాక్ష్యం ఆధారంగా మద్యం తాగినట్లు నిర్ధారించడానికి వీల్లేదని స్పష్టం చేశారు.

Updated Date - 2022-05-17T09:10:47+05:30 IST