- వైద్యపరీక్షల నివేదికను తమ ముందు
- ఉంచకపోవడంపై తీవ్ర ఆగ్రహం
- ‘అమర్‌రాజా’ వ్యాజ్యంపై విచారణ
- నివేదిక సహా అఫిడవిట్‌కు పీసీబీకి ఆదేశం
అమరావతి, జనవరి 25(ఆంధ్రజ్యోతి): అమర్‌రాజా పరిశ్రమలోని ఉద్యోగుల రక్తంలో లెడ్ శాతంపై వైద్యపరీక్షల నివేదికను తన ముందు ఉంచకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలిపై అసహనం వ్యక్తం చేసింది. గతంలోనూ నివేదిక సమర్పించేందుకు సమయం కోరారని గుర్తు చేసింది. ఇదే విధానం కొనసాగితే మెరిట్స్ ఆధారంగా తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. అఫిడవిట్‌తో పాటు నివేదికను కోర్టు ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ బీఎస్ భానుమతితో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది. పరిశ్రమను మూసివేయాలని పీసీబీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అమర్ రాజా బ్యాటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నాగుల గోపినాథ్‌రావు వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు వచ్చింది. పరిశ్రమ తరఫున సీనియర్ న్యాయవాది బి. ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. వైద్య పరీక్షల నివేదిక అందినా కోర్టు ముందు ఉంచడం లేదన్నారు. పీసీబీ తరఫు న్యాయవాది వి. సురేందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రక్త నమూనాల నివేదిక తమకు అందలేదని, త్వరలో కోర్టు ముందు ఉంచుతామన్నారు.