హైకోర్టుకు మరో ఏడుగురు జడ్జీలు

ABN , First Publish Date - 2022-02-01T08:12:55+05:30 IST

ఏపీ హైకోర్టులో సేవలందిస్తున్న ఏడుగురు న్యాయవాదులను ఇదే హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీం కోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది....

హైకోర్టుకు మరో ఏడుగురు జడ్జీలు

న్యాయవాదుల నుంచి సుప్రీం కొలీజియం ఎంపిక

కేంద్రానికి సిఫారసు.. 27కు చేరనున్న జడ్జీల సంఖ్య


అమరావతి/న్యూఢిల్లీ, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టులో సేవలందిస్తున్న ఏడుగురు న్యాయవాదులను ఇదే హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీం కోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ నెల 29న జరిగిన సమావేశంలో కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ జాబితాలో కె.శ్రీనివాసరెడ్డి, జి.రామకృష్ణ ప్రసాద్‌, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, టి.రాజశేఖర్‌రావు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డిబోయన సుజాత ఉన్నారు. వీరి నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 20గా ఉంది. వీరి నియామకంతో ఆ సంఖ్య 27కి చేరనుంది. వీరి నేపథ్యం పరిశీలిస్తే...


సత్తి సుబ్బారెడ్డి

1970లో పశ్చిమగోదావరి జిల్లా అరవల్లి గ్రామంలో సత్తి సుబ్బారెడ్డి  జన్మించారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. భారతీయ విద్యా భవన్‌ నుంచి ఐఆర్‌పీఎంలో పీజీ డిప్లొమో పొందారు. 1994 జూన్‌ 22న న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. 1994-97 వరకు తాడేపల్లిగూడెం న్యాయస్థానంలో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. 1997లో ప్రాక్టీస్‌ హైదరాబాద్‌కు మార్చారు. సీనియర్‌ న్యాయవాది వీఎల్‌ఎన్‌ గోపాలకృష్ణమూర్తి వద్ద న్యాయవాద వృత్తిలో మెలకువలు నేర్చుకున్నారు. క్రిమినల్‌, సర్వీసు, రాజ్యాంగ సంబంధ కేసులతో పాటు ముఖ్యంగా సివిల్‌ కేసుల్లో అనుభవం ఉంది. తిరుపతి అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(తుడా)కి స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలు అందించారు.


చీమలపాటి రవి

1967 డిసెంబరు 4న విశాఖపట్నంలో చీమలపాటి రవి జన్మించారు. తండ్రి శ్రీరామమూర్తి విశాఖ జిల్లా కోర్టులో సీనియర్‌ న్యాయవాది. ఆయన సోదరుడు న్యాయవాదిగా సేవలందిస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బీకాం, బీఎల్‌ పూర్తి చేశారు. 1995లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. తండ్రితో కలిసి విశాఖ జిల్లా కోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. తరువాత ప్రాక్టీ్‌సను హైదరాబాద్‌లోని ఉమ్మడి హైకోర్టుకు మార్చుకున్నారు. సివిల్‌, క్రిమినల్‌, రెవెన్యూ, రాజ్యాంగ సంబంధ వ్యాజ్యాలలో న్యాయవాదిగా మంచి పేరు తెచ్చుకున్నారు. మూడేళ్ల పాటు పంచాయతీరాజ్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలు అందించారు. 2019లో ఏపీలోని అమరావతి హైకోర్టుకు ప్రాక్టీసు మార్చారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు, విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌కు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేస్తున్నారు.


నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు

1967 జూలై 1న ఎన్‌.వెంకటేశ్వర్లు జన్మించారు. నాగార్జున యూనివర్సిటీలో బీకాం చేశారు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎల్‌ పూర్తి చేశారు. 1992 జూన్‌ 30న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. ఉమ్మడి హైకోర్టు, అమరావతి హైకోర్టులో న్యాయవాదిగా 26 ఏళ్ల అనుభవం ఉంది. సివిల్‌, క్రిమినల్‌, సర్వీసు తదితర విభాగాలకు సంబంధించిన కేసుల్లో కీలక వాదనలు వినిపించారు. 2014 డిసెంబరు నుంచి 2019 జూన్‌ వరకు ఆంధ్ర ప్రాంత మున్సిపాలిటీలకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా చేశారు. 2015-16లో భారత వైద్యమండలికి స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలు అందించారు.


తర్లాడ రాజశేఖరరావు

1967 ఆగస్టు 3న తర్లాడ రాజశేఖరరావు జన్మించారు. ఆయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం మూలసవలాపురం. విశాఖ ఎన్బీఎం కళాశాలలో న్యాయశాస్త్ర పట్టా పొందారు. 1993 ఆగస్టు 4న న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వీవీఎస్‌ రావు న్యాయవాదిగా ఉన్నప్పుడు ఆయన వద్ద వృత్తి మెలకువలు నేర్చుకున్నారు. ఉమ్మడి హైకోర్టుతో పాటు ప్రస్తుత ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా సేవలందిస్తున్నారు. సివిల్‌, క్రిమినల్‌తోపాటు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వాదించిన అనుభవం ఉంది. దివంగత జస్టిస్‌ టీసీహెచ్‌ సూర్యారావుతో తర్లాడ రాజశేఖరరావుకు బంధుత్వం ఉంది.


 కొనకంటి శ్రీనివాసరెడ్డి

1966 జూన్‌ 3న హైదరాబాద్‌లో శ్రీనివాసరెడ్డి జన్మించారు. పాఠశాల విద్యాభ్యాసం హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో సాగింది. హైదరాబాద్‌లోని నాగార్జున జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. అనంతరం శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1991 ఆగస్టు11న న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. ప్రముఖ న్యాయవాది సి.పద్మనాభరెడ్డి ఆఫీసులో జూనియర్‌గా చేరి న్యాయవాద వృత్తి.. ముఖ్యంగా క్రిమినల్‌ విభాగంలో మెలకువలు నేర్చుకున్నారు. ప్రస్తుతం హైకోర్టులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(పీపీ)గా చేస్తున్నారు.


  గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ 

హైదరాబాద్‌లోని ఆంధ్రా విద్యాలయా ఆర్ట్స్‌, సైన్స్‌, కామర్స్‌ కాలేజీలో గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ బీకాం పూర్తి చేశారు. గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్‌ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ చదివారు. నాగార్జున యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం పట్టా పొందారు. 1991 ఆగస్టు 27న ఎన్‌రోల్‌ అయ్యారు. 2000 నవంబరు 10న సుప్రీం కోర్టులో న్యాయవాది అయ్యారు. సుప్రీం కోర్టు, ఢిల్లీ హైకోర్టులో రాజ్యసభ సెక్రటేరియట్‌, రాజ్యసభ టీవీకి స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు. నాగాలాండ్‌, అసోం రాష్ట్రాల సరిహద్దు వివాదాల కేసులో నాగాలాండ్‌ తరఫున ప్రత్యేక కౌన్సిల్‌గా సేవలు అందించారు. ఏపీ హైకోర్టులోనూ వాదనలు వినిపించారు. పలు ప్రభుత్వ సంస్థలకు సేవలు అందించారు. 


వడ్డిబోయిన సుజాత

1966 సెప్టెంబరు 10న వడ్డిబోయిన సుజాత జన్మించారు. పాఠశాల విద్యను ఢిల్లీలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. ఎంఏ, ఎల్‌ఎల్‌ఎంలో పట్టాపొందారు. 1998లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. సీనియర్‌ న్యాయవాదులు ఏవీ శివయ్య, భాస్కర లక్ష్మి వద్ద జూనియర్‌గా పనిచేశారు. రాజ్యాంగ సంబంధ కేసుల్లో మంచి పేరు ఉంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ప్యానల్‌ న్యాయవాదిగా పనిచేశారు. హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ న్యాయవాదిగా వ్యవహరించారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో జీపీగా పనిచేస్తున్నారు. 

Updated Date - 2022-02-01T08:12:55+05:30 IST