దమ్మాలపాటిపై దూకుడు!

ABN , First Publish Date - 2020-09-16T08:49:51+05:30 IST

సీనియర్‌ న్యాయవాది, మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివా్‌సతోపాటు మరికొందరిని లక్ష్యంగా చేసుకుని ఏసీబీ వేసిన అడుగులకు హైకోర్టు బ్రేకులు వేసింది. రాజధాని భూముల వ్యవహారానికి

దమ్మాలపాటిపై దూకుడు!

  • ఏసీబీకి హైకోర్టు బ్రేకులు
  • తదుపరి చర్యలు తీసుకోవద్దు.. ఎఫ్‌ఐఆర్‌ మీడియాలో రావొద్దు
  • సోషల్‌ మీడియాలోనూ ఉండొద్దు.. డీజీపీ, సర్కారుదే బాధ్యత
  • కేంద్ర సమాచార శాఖకూ ఆదేశం.. హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు
  • రోజంతా తీవ్ర ఉత్కంఠ .. వేధిస్తున్నారని దమ్మాలపాటి పిటిషన్‌
  • నేడు విచారణకు నిర్ణయం.. అంతలోనే 13 మందిపై ఏసీబీ కేసు
  • మళ్లీ హైకోర్టుకు దమ్మాలపాటి.. తదుపరి చర్యలు ఆపాలని వినతి

‘అమరావతిలో భూముల స్కామ్‌’ అంటూ మంత్రివర్గ ఉపసంఘాన్ని, సిట్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం... కేసులు పెట్టే దశకు వచ్చింది. 

విపక్ష నాయకులు మాత్రమే కాదు... తమకు వ్యతిరేకంగా వాదనలు వినిపించిన న్యాయవాదులనూ లక్ష్యంగా చేసుకుంది. 

సీనియర్‌ న్యాయవాది, మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై ఏసీబీ కేసు నమోదుతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.

రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల కుంభకోణానికి పాల్పడ్డారంటూ ఆయనతోపాటు మొత్తం 13 మందిపై మంగళవారం ఏసీబీ కేసు పెట్టింది. 

అదికూడా... తనను వేధిస్తున్నారని, కక్ష సాధిస్తున్నారని దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసిన మరుసటి రోజునే! 

తన ఆందోళన నిజం కావడంతో... అప్పటికప్పుడు ఆయన మళ్లీ కోర్టును ఆశ్రయించారు.  ఏసీబీ దాఖలు చేసిన కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలని కోరారు.

ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించిన ఆరోపణలతో తన గౌరవానికి భంగం వాటిల్లుతుందని, అవేవీ మీడియాలో రాకుండా చూడాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన హైకోర్టు తగిన ఆదేశాలు ఇచ్చింది.  


ఏం జరిగింది?

  1. తనను ప్రభుత్వం వేధిస్తోందని, తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తోందని 
  2. సోమవారం హైకోర్టులో దమ్మాలపాటి శ్రీనివాస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.
  3. మంగళవారం ఉదయం ఈ పిటిషన్‌ కోర్టు ముందుకు వచ్చింది. దీనిపై బుధవారం విచారణ జరుపుతామని న్యాయమూర్తి తెలిపారు.
  4. అంతలోనే... ఏసీబీ పావులు కదిపింది. ఒంగోలుకు చెందిన ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు... దమ్మాలపాటితోపాటు 13 మందిపై అమరావతి భూముల విషయంలో ఏసీబీ కేసు నమోదు చేసింది.
  5. కేసు విషయంలో పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఆపాలని... ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలు మీడియాలో రాకుండా చూడాలని దమ్మాలపాటి మరోమారు హైకోర్టును ఆశ్రయించారు.
  6. దమ్మాలపాటి వినతిపై సానుకూలంగా స్పందించిన ధర్మాసనం... పిటిషన్‌పై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. 


అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): సీనియర్‌ న్యాయవాది, మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివా్‌సతోపాటు మరికొందరిని లక్ష్యంగా చేసుకుని ఏసీబీ వేసిన అడుగులకు హైకోర్టు బ్రేకులు వేసింది.  రాజధాని భూముల వ్యవహారానికి సంబంధించి వారిపై  గుంటూరు ఏసీబీ అధికారులు మంగళవారం నమోదు చేసిన కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయరాదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఎలాంటి తదుపరి చర్యలకు దిగరాదని ఆదేశించింది. అంతేకాదు... తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌ గురించి,  అందులోని వివరాల గురించి పత్రికలు, టీవీ చానళ్లు, సామాజిక మాధ్యమాల్లో  బహిర్గతం కావడానికి వీల్లేదని ఆదేశించింది.  సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా మీడియా సంస్థలకు ఈ సమాచారం అందించాలని సూచించింది.  ఈ కేసుకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లోనూ ఎలాంటి పోస్టులు పెట్టడానికి వీల్లేదని, అందుకు సంబంధించిన డీజీపీ, కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను వెంటనే హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, ఏపీ సమాచార పౌరసంబంధాల శాఖ, కేంద్ర సమాచార శాఖలకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది. కోర్టు ఆదేశాలు తు.చ. తప్పకుండా  అమలయ్యేలా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌లో వ్యక్తిగత హోదాలో ముఖ్యమంత్రిని ప్రతివాదిగా పేర్కొన్నప్పటికీ ఆయనకు నోటీసు ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి మంగళవారం సాయంత్రం  ఆదేశాలు జారీ చేశారు.


కేసుల్లో ఇరికించేస్తారా...

‘‘రాజకీయ ప్రత్యర్థులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటారు, కేసులు పెట్టుకుంటారు. అంతకు మించి ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేయడం మనం చూశాం. కానీ... ప్రపంచంలోనే తొలిసారిగా ఒక న్యాయవాదిని ఈ వివాదంలోకి లాగేందుకు పూనుకున్నారు. అంటే, వృత్తి ధర్మంలో భాగంగా వారికి వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తే.. వారిని కూడా కేసుల్లో ఇరికించేస్తారా?’’ అని దమ్మాలపాటి తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య వంటి  కేసుల్లోనే ఎంతోమంది న్యాయవాదులు వివిధ రకాలుగా వాదనలు వినిపించారని... ఏ ప్రభుత్వమూ వారిని లక్ష్యంగా చేసుకోలేదని తెలిపారు. ‘‘ఇది స్వతంత్ర వ్యవస్థ. అలాంటిది న్యాయవాదుల నోరు మూయిస్తే ఎలా? ఏపీ ప్రభుత్వం ఈ దుస్సంప్రదాయానికి దిగింది. అంటే తాము చేసే తప్పులను ఎవ్వరూ ప్రశ్నించగూడదన్నట్లుగా ఏపీ ప్రభుత్వ వైఖరి వుంది. ఒక న్యాయవాదిని కేసుల్లో ఇరికిస్తే ఇతర న్యాయవాదులెవ్వరూ తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వాదించరని, వ్యతిరేకంగా మాట్లాడరని ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. ప్రభుత్వ విధానం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిది’’ అని తెలిపారు.  2014లో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఫలానా చోట రాజధాని వస్తుందని విస్త్రతంగా ప్రచారం జరిగిందని...  మీడియాలోనూ అందుకు సంబంధించిన వార్తలు వెలువడ్డాయని గుర్తు చేశారు.  అలాంటప్పుడు ఎవరైనా అక్కడ భూములు కొంటే తప్పేముందని ప్రశ్నించారు. ‘‘కంచికచర్ల అనే గ్రామంలో భూములు కొనుగోలు చేశారని పిటిషనర్‌పై అభియోగాలు మోపారు.  రాజధాని ప్రాంతానికి 50 కిలోమీటర్ల అవతల వున్న ప్రాంతాన్ని కూడా రాజధాని ఎలా అంటారు? సీనియర్‌ న్యాయవాది  గౌరవ ప్రతిష్ఠలు దెబ్బతీయడానికే ఇలా వ్యవహరిస్తున్నారు.


ఈ కేసులో మేం లోతైన పరిశీలనకు వెళ్లడం లేదు. ఆ వ్యవహారాన్ని కోర్టు నిర్ణయిస్తుంది. కానీ... ఈలోపే పిటిషనర్‌పై దుష్ప్రచారం చేస్తే వారి పరువు ప్రతిష్ఠలకు భంగం కలుగుతుంది’’ అని తెలిపారు.  ఎఫ్‌ఐఆర్‌లో దురుద్దేశాలు అంటగడుతూ తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. ‘‘7వ తేదీన అందిన ఫిర్యాదుపై ఏసీబీ హడావుడిగా కేసు నమోదు చేయడాన్ని బట్టి రాజకీయ కోణం అవగతమవుతోంది. మంగళవారం ఉదయం పిటిషన్‌పై విచారణకు  జడ్జి నిరాకరించిన వెంటనే  పిటిషనర్‌తో పాటు మరికొందరికి వ్యతిరేకంగా ఏసీబీ కేసు నమోదు చేసినట్లు  ప్రచారం జరిగింది. మీడియా ద్వారా పిటిషనర్ల గౌరవానికి, ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా చేశారు. ఈ కేసుకు సంబంధించి మీడియాలో సమాచారం బయటకు పొక్కకుండా నిలువరించండి. వెంటనే దీనిపై ఉత్తర్వులు జారీ చేయండి. అంతేగాక పిటిషనర్‌ను అరెస్టు చేయకుండా ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఈ కేసులో తదుపరి చర్యలకు దిగకుండా పోలీసుల్ని నిలువరించండి’’ అని అభ్యర్థించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపించారు.  ఈ పిటిషన్‌లో ప్రతివాదిగా ముఖ్యమంత్రిని చేర్చడం సరి కాదని, ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని తెలిపారు. ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవడం సరి కాదన్నారు. ఇరుతరఫు వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఈ వ్యవహారంపై ప్రతివాదులు స్పందించేందుకు 4 వారాల గడువు ఇస్తూ విచారణను వాయిదా వేశారు. ఈ కేసులో పిటిషనర్లపై తదుపరి చర్యలను నిలిపివేయాలని ఆదేశించారు. 


పిటిషన్‌... ఆపై కేసు!

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో ఆయనకు వ్యతిరేకంగా వాదనలు వినిపించానన్న అక్కసుతో తనపై కక్ష సాధింపునకు దిగారని, తనను అరెస్టు చేయించేందుకు ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపారని దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. తన విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోకుండా పోలీసుల్ని అడ్డుకోవాలని సోమవారం పిటిషన్‌ వేశారు. ఇది మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ ముందు విచారణకు రాగా.. దానిని వేరే బెంచ్‌కి పంపించేందుకు అనువుగా ఫైలును ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రీని ఆయన ఆదేశించారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ముందు న్యాయవాది ప్రణతి హాజరై.. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. బుధవారం విచారణకు వచ్చేలా చూస్తామని ధర్మాసనం తెలిపింది. అయితే, మంగళవారం మధ్యాహ్నమే ఏసీబీ అధికారులు దమ్మాలపాటితో పాటు మరికొందరిపై కేసు పెట్టారు. దీంతో దమ్మాలపాటి మరోమారు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తప్పుడు ఆరోపణలతో తనపై కేసు నమోదు చేయించిందని తెలిపారు. తన పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లుతుందని,  ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలు మీడియాలో వెలువడకుండా నిలువరించాలని కోరుతూ మంగళవారం సాయంత్రం హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై పధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి ముందు విచారణ జరిగింది. దమ్మాలపాటి తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహిత్గీ, శ్యాందివాన్‌లు వాదనలు వినిపించారు.

Updated Date - 2020-09-16T08:49:51+05:30 IST