ఖద్దరా? ఖాకీయా?
ABN , First Publish Date - 2020-07-22T07:38:38+05:30 IST
రాష్ట్రంలో పోలీసులు అవలంబిస్తున్న వైఖరిని హైకోర్టు మరోమారు తూర్పారబట్టింది.
పోలీసులు ఏదో ఒకటి తేల్చుకోండి
రాష్ట్రంలో ‘రూల్ ఆఫ్ లా’ ఉందా? లేదా?
ప్రజాహక్కులను కాపాడేందుకే పోలీసులు
‘పొలిటికల్ బాస్’ల కోసం కాదు
వ్యతిరేకంగా ఉత్తర్వులిస్తే కష్టాల్లో పడతారు
అప్పుడు ఏ నేతా మీ రక్షణకు రారు
హెబియస్ కార్పస్ కేసులో హైకోర్టు ఫైర్
కోర్టుకు హాజరైన తూర్పు గోదావరి ఎస్పీ
అమరావతి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పోలీసులు అవలంబిస్తున్న వైఖరిని హైకోర్టు మరోమారు తూర్పారబట్టింది. రాష్ట్రంలో అసలు ‘రూల్ ఆఫ్ లా’ ఉందా లేదా అని నిగ్గదీసి అడిగింది. పోలీసులు ప్రజా హక్కులను రక్షించేందుకే ఉన్నారు తప్ప, ‘పొలిటికల్ బాస్’ల మనసెరిగి వ్యవహరించేందుకు కాదని కటువుగా వ్యాఖ్యానించింది. బ్యూరోక్రాట్లు, పోలీసు అధికారులు రాజకీయాలు కావాలనుకుంటే యూనిఫారం వదిలేసి వెళ్లాలని, యూనిఫారంలో ఉంటే ప్రజా హక్కులు కాపాడాల్సిందేనని తేల్చిచెప్పింది.
‘‘తలుపులు పగలగొట్టి ఒక న్యాయవాది ఇంట్లోకి అర్ధరాత్రి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయనేమైనా నేరస్థుడా? అంత అత్యుత్సాహం ఎందుకు?’’ అని నిలదీసింది. నేరస్థుడి ఇంట్లోకి సైతం ఆ విధంగా జొరబడకూడదని పేర్కొంది. ఒక న్యాయవాదికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుడి హక్కుల పరిరక్షణ ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలమని దుయ్యబట్టింది. ప్రజలకు అధికారులు జవాబుదారీగా ఉండాలని, వారి హక్కులను పరిరక్షించాలని హితవు పలికింది. ‘పోలీసు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే మేం తీసుకోవాల్సిన చర్యలు తీసేసుకుంటాం. అధికారులకు వ్యతిరేకంగా మేం ఉత్తర్వులిస్తే కష్టాల్లో పడతారు. అప్పుడు ఏ నేతా మిమ్మల్ని ఆదుకోవడానికి రారు’’ అని హెచ్చరించింది. ఆదివారం అర్ధరాత్రి తన భర్త, న్యాయవాది సుభా్‌షచంద్రబో్‌సను తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు, ఏలేశ్వరం పోలీసులు అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారని, ఇంటికొచ్చి తలుపులు పగలగొట్టి దౌర్జన్యంగా తీసుకెళ్లారని పేర్కొంటూ పీ వెంకటప్రియదీప్తి హైకోర్టులో సోమవారం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై స్పందించిన జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ కె.సురేశ్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం.. సుభా్‌షచంద్రబో్‌సను తమ ముందు హాజరు పరచాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని ఆదేశిస్తూ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి హైకోర్టులో నేరుగా హాజరై వివరణ ఇచ్చారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పోలీసులు ఇంటికెళ్లిన సమయంలో చంద్రబోస్ పారిపోయారని, ఆయన పోలీసుల అదుపులో లేరని పేర్కొన్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారని, ఈ ఘటనపై దర్యాప్తు కోసం డీజీపీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైందని పేర్కొన్నారు.
పర్యవసానాలు వారికి తెలుసు..
పిటిషనర్ తరఫు న్యాయవాది వీవీ సతీశ్ వాదనలు వినిపిస్తూ.. చంద్రబో్‌సను పోలీసులు అర్ధరాత్రి తీసుకెళ్లారని, దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ను పరిశీలించాలని అభ్యర్థించారు. ధర్మాసనం స్పందిస్తూ.. పోలీసులే బలవంతంగా తీసుకెళ్లారని పిటిషనర్ చెబుతుంటే.. ఆయన పారిపోయారని ఎలా చెబుతారని ఎస్పీని ప్రశ్నించింది. ఏదేని రాజకీయ కారణంతో ఇలా చెబుతున్నారా అని అనుమానం వ్యక్తంచేసింది. బోస్‌కు ప్రాణహాని ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘‘కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండగా ఏ పోలీసు అధికారీ అలాంటి సాహసం చేస్తారనుకోవడం లేదు. ఒకవేళ అలాంటిదేదైనా జరిగితే పర్యవసానం ఎలా ఉంటుందో వారికి తెలుసు. ఈ వ్యవహారాన్ని ఎలా చక్కదిద్దాలో కూడా మాకు తెలుసు’’ అని కటువుగా వ్యాఖ్యానించింది.
మీరు డైరెక్ట్ ఎస్పీనా లేక ప్రమోటీనా?
ఎస్పీని ఉద్దేశించి ‘మీరు డైరెక్ట్ ఎస్పీనా? లేక ప్రమోషన్‌పై ఎస్పీ అయ్యారా?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. డైరెక్ట్ ఎస్పీ అని ఆయన బదులిచ్చారు. ‘డైరెక్ట్ ఎస్పీ అయిన వారు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారన్న ఆశ ఉంటుంది. మీదైన తరహాలో వ్యవహరించండి. మీకు మరెంతో కెరీర్ ఉంది. ప్రజా హక్కులు కాపాడండి. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి’’ అని హితవు పలికింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని డీజీపీని, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని ఆదేశించింది. నిర్బంధంపై దాఖలైన మరో పిటిషన్‌తో ఈ పిటిషన్‌ను జత చేయాలని సూచించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ లోపు న్యాయవాది సుభా్‌షచంద్రబో్‌సను కనుగొంటే హైకోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. తదుపరి విచారణకు హాజరుపై ఎస్పీకి మినహాయింపునిచ్చింది.