Abn logo
Oct 17 2020 @ 01:58AM

శ్రీశైలంలో హై అలర్ట్‌

Kaakateeya

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. పశ్చిమ కనుమలతో పాటు పరీవాహక ప్రాంతంలో వానల వల్ల శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. గంట గంటకూ ఉధృతి పెరుగుతుండడంతో శ్రీశైలంలో హై అలర్ట్‌ ప్రకటించారు. 2009 వరదల తర్వాత జలాశయానికి రికార్డు స్థాయిలో ఇన్‌ఫ్లో నమోదవుతోంది. శుక్రవారం రాత్రి లేదా శనివారం ఉదయం నాటికి శ్రీశైలం ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టుకు 7 లక్ష ల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉందని అధికారు లు అంచనా వేశారు. శుక్రవారం రాత్రి వరకు జూరాల, సుంకేసుల, హంద్రీ నుంచి శ్రీశైలానికి 5,44,439 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, వరద ఉధృతిని అంచనా వేసిన అధికారులు ప్రాజెక్టు 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి 6,21,523 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు 5.26 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది. శనివారం ఉదయం వరకు ఇది 7 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉండటంతో 52 గేట్ల ద్వారా 5.51 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. భారీగా వరద నీరు విడుదల చేయడంతో పరీవాహక ప్రాంతంలోని పొలాలు నీట మునిగాయి. గద్వా ల, అలంపూర్‌ నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నాగార్జునసాగర్‌కు 3,40,059 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో 18 గేట్లను 15అడుగుల మేర ఎత్తారు. సాగర్‌  పూర్తి స్థాయి నీటిమ ట్టం 590 అడుగులు (312 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 588.70 అడుగులు(308 టీఎంసీలు)గా ఉంది. సాగర్‌ నుంచి మొత్తం 4,23,059 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ఔట్‌ఫ్లో ఎక్కువగా ఉండటంతో సాగర్‌ దిగువన ఉన్న శివాలయంలోకి నీరు చేరింది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు 6,75,589 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 175 (45.7టీఎంసీలు) అడుగులు, కాగా ప్రస్తుతం 173.78 (43.8టీఎంసీలు) అడుగులకు చేరుకుంది. 18 గేట్లను 6 మీటర్లు ఎత్తి 7,81,652 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఇక నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు 63వేల క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో 16 గేట్ల ద్వారా 50వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కాగా, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి(1091అడుగులు) చేరుకుంది. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు 57,041 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 5 గేట్లు ఎత్తి 68,348 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోగా, మూడు రోజులుగా గేట్లను ఎత్తి మంజీర రిజర్వాయర్‌లోకి నీటిని వదులుతున్నారు. 


వేర్వేరు చోట్ల ముగ్గురి గల్లంతు

మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చే వరదతో కృష్ణా, భీమా నదులు పోటెత్తుతున్నాయి. నారాయణపేట జిల్లా లో ఈ నదుల సంగమం నుంచి జూరాల ప్రాజెక్టు వర కు నీటితో నిండిపోయి, తీర గ్రామాల సమీపంలోకి నీరు వచ్చి చేరుతోంది. కృష్ణ, మాగనూర మండలాల్లోని పలు గ్రామాల్లో సుమారు 20 వేల ఎకరాల వరి పంట నీటమునిగింది. పులిచింతల బ్యాక్‌వాటర్‌తో సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోకి అడుగుమేర నీరు చేరింది. నిర్మల్‌ జిల్లా లోకేశ్వరం మండలం సద్గాం గ్రామానికి చెందిన లక్ష్మణ్‌ (47) అనే వ్యక్తి శుక్రవారం గడ్డెన్న వాగులో ప్రమాదవశాత్తు పడి గల్లంతయ్యాడు. లక్ష్మణచాంద మండ లం మాచాపూర్‌ గ్రామానికి చెందిన ముగ్గురు పశువుల కాపర్లు గోదావరి పాయలో చిక్కుకున్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం రాంపూర్‌చకు చెందిన రాములు (40) నిజాంసాగర్‌ ప్రాజెక్టులో గల్లంతయ్యాడు. శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు వద్దకు స్నానం చేయడానికి వెళ్లి.. నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం మునిపల్లికి చెందిన సబ్బని నగేష్‌ (28) గల్లంతయ్యాడు.


19న మరో అల్పపీడనం

మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఈనెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ తర్వాత 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర మహారాష్ట్ర తీరానికి సమీపంలో తూర్పు మధ్య అరేబియా సముద్రంలో స్థిరంగా ఉన్న తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా కోస్తాంధ్రా, తెలంగాణ మీదుగా మధ్యస్థ ట్రోపోస్పియర్‌ స్థాయి ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీనికి 1.5 కి.మీ నుంచి 2.1 కి.మీ ఎత్తు మధ్య ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. రాగల 12 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి, ఉత్తర మహారాష్ట్ర- దక్షిణ గుజరాత్‌ తీరాలకు దగ్గరలో తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతాల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వివరించారు. దీని ప్రభావంతో రాగల 3 రోజుల్లో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. కాగా, శుక్రవారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. శని, ఆదివారాల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది.

Advertisement
Advertisement
Advertisement