Abn logo
Dec 2 2020 @ 02:22AM

ప్రజా ఉద్యమాల్లో పాటల మందారం

అరుణోదయతో పైలం సంతోష్ అనుబంధం ‘మొగిలాలి మందార మొక్కల్ల పూలేవి’ అనే పాటలో మొగ్గ తొడిగింది. మూడు దశాబ్దాల చైతన్యశీల ప్రస్థానంలో అరుణోదయ పాటకు గద్దర్‌ అభినయాన్ని జోడించిన సంతోష్‌ ప్రత్యేకత చెప్పుకుంటే ఒడవదు, తరగదు.


ఒక ప్రజా వాగ్గేయకారుడు ఆదూరు బ్రహ్మయ్యగా 1970లో జన్మించి, అరుణోదయలో పెరిగి, పైలం సంతోష్‌గా తన 50వ ఏట అకాల మరణం చెందడం ఎంతో మందిని కలిచివేసింది. సంతోష్‌ను ఒక గొప్పకళాకారునిగా తీర్చిదిద్దిన ప్రజా ఉద్యమమే ప్రతి కష్టంలో తోడుగా ఉండి మూడు దశాబ్దాలుగా రాజకీయంగానూ, భౌతికంగానూ ఆయన్ను కాపాడుకుంటూ వచ్చింది. సంతోష్‌ కొంతకాలం స్వతంత్ర సాంస్కృతిక సంఘాన్ని ఏర్పరుచుకున్నా అత్యధిక కాలం కుల-వర్గ విముక్తి దిశగా జనశక్తి రాజకీయాలను విశ్వసిస్తూ దశాబ్దాల పాటు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో పనిచేశాడు. ఆ గుర్తింపే వెల్దండలో జరిగిన ఆయన అంతిమయాత్రకు వందలాది మందిని రప్పించింది. సంతోష్‌ ద్వారా అరుణోదయలో చేరిన మల్సూర్‌, ప్రభాకర్‌లతో పాటు విమలక్క లాంటి ఎంతోమంది ప్రజా సాంస్కృతిక కార్యకర్తలను కంటతడి పెట్టించింది. వెలిదండనే సంతోష్‌ మెడలో ఎర్రని పూదండనుకున్నాంగానీ నిజంగా అక్కడ సంతోష్‌ స్మరణలో ఎన్నో పాటల పూదండలే అల్లుకున్నాయి.  


ఒక సాటి దళితుని నుంచే తాకిన ఎదురుదెబ్బకు, పరాభవానికి సంతోష్‌ విలవిల్లాడుతున్నప్పుడు అరుణోదయ అక్కున చేర్చుకుని ఓదార్చింది. తీవ్ర మనోవేదనతో నిద్రలో నడిచిపోతూ ఒకసారి హైద్రాబాద్‌ రామ్‌నగర్‌ గుండు కార్యాలయంలో, ఒకసారి సిద్దిపేటలో, మరొకసారి ఖిలావరంగల్‌లో ప్రాణాపాయ స్థితిలో పడిన సంతోష్‌ను మా కార్యకర్తలు కాపాడుకున్నారు. ఈ స్థితిలో ఒక అమరవీరుని సహచరిణి మంగతో వెల్దండలోనే పునర్‌ వివాహం జరిపి అరుణోదయ ఆయనకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. అప్పటినుంచి సంతోష్‌ వెల్దండలో తనకు వారసత్వంగా వచ్చిన పొలం వాటా కుమార్తెకు ఇచ్చి, దుగినెల్లిలో ఉంటూ దిగువ మధ్యతరగతి జీవితం గడిపాడు. ప్రభుత్వ కొలువులో ఆయనకు ఆర్థిక భద్రత దొరికింది గానీ ఆరోగ్య భద్రత, ఆత్మీయత, స్వతంత్రం దొరికాయా? లేదనడానికి ఇటీవల అరుణోదయ కార్యాలయంలోని రాకేష్‌కు ఫోన్‌చేసి మాట్లాడిన మాటలే నిదర్శనం. ఈ స్థితిలో ‘ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా సంస్థలో దృఢంగా పనిచేయా’లన్న మాటలు ఆయన స్వగతం గానూ, అంతిమ సందేశం గానూ ఉన్నాయి. అయితే ఈ ఫోన్‌కాల్‌ ద్వారానే సంతోష్‌ అనారోగ్యం గురించి తెలిసి విమలక్క వెంటనే పరామర్శించి వీడియోకాల్‌లో మాట్లాడి కోఠీలోని ఇఎన్‌టి హాస్పిటల్‌లో టైం తీసుకున్నాను రమ్మని చెప్పింది. ఆఫీస్‌కి రావడానికి సంకోచిస్తే నేరుగా హాస్పిటల్‌కే రమ్మని కోరింది. ఒక కోర్స్‌ పూర్తి అయిన తర్వాత ఆలోచిస్తానని అన్నాడు. ఆ రోజే మా కార్యాలయానికి వచ్చి ఆయన ఆరోగ్య సమస్యలు, మానసిక సంఘర్షణ మాకు తెలిపితే బ్రతికించుకోవడానికి మెరుగైన ప్రయత్నం జరిగేది. శాంతితో వివాహం జరిగిన కొత్తలో (1991–-92) ఇలాగే కొంతకాలం ఉద్యమానికి దూరమై పత్తి కంపెనీలో ఉద్యోగం చేస్తూ తీవ్ర అనారోగ్యంతో ఉన్న సందర్భంలో విమలక్క, కాకి భాస్కర్‌, ధర్మార్జున్‌ వెళ్లి ఒప్పించి తీసుకొచ్చి ఉద్యమంలో ఆరోగ్యంగా నిలబెట్టుకున్నారు. ఈ స్థితిలో కూడా చివరిదశలో పూర్వ ఉద్యమ సహచరులైన పలస యాదగిరి, నిర్మల, డాక్టర్‌ చెరుకు సుధాకర్‌, జానకి రామ్‌రెడ్డి, కాకి భాస్కర్‌లే సంతోష్‌కు రెగ్యులర్‌గా టచ్‌లో ఉండి కాపాడుకునే ప్రయత్నం చేశారు.


సంతోష్‌లో ఎంత పట్టుదల ఉండేదో అంతగా పట్టింపులు వుండేవి. ఎంత క్రమశిక్షణ ఉండేదో అంతగా అలకలు ఉండేవి. ఈ విభిన్న సంఘర్షణల్లో అతడు వేగంగా స్పందించే కవిగా, భిన్నత్వాన్ని ప్రదర్శించే కళాకారుడిగానే గాకుండా ఒక ప్రజా వాగ్గేయకారుడుగా తీర్చిదిద్దబడ్డాడు. జీర గొంతులోనే మాధుర్యాన్ని వినిపిస్తూ ఎన్ని వందల పాటలు, వీరగాథలు, కరువు బాధలు, కన్నీటి పాటలు, ప్రవహించాయో లెక్కలేదు. ‘జముకు జమా ఎర్రజెండా’ అంటూ ఎప్పటికప్పుడు అశువుగా పాడుకునే అమరుల పాట రూప కల్పన వందలాది మందిని అశు కవులుగా కైగట్టి పాడుకునేలా చేసింది. ఆయన జీరగొంతులోని ఆర్తి సామాజికమయింది కాబట్టే ప్రజల్లో సజీవంగా ఉంటుంది. సంతోష్‌ మొదట చండ్ర పుల్లా రెడ్డి రాజకీయాలతో పెన్పహాడ్‌ మండలంలో రైతాంగ కార్యకర్తగా ఉద్యమ ప్రస్థానం ప్రారంభించాడు. 1984 నవంబర్‌లో అమరులైన చండ్ర పుల్లారెడ్డిపై మిత్ర రాసిన ‘మొగిలాలి మందార మొక్కల్ల పూలేవి అనే పెద్దన్న ఏడి పేదోళ్ళ మాయన్న’ పాటతోనే అరుణోదయతో అనుబంధం మొదలైందని సంతోష్‌ తరచుగా చెబుతుండేవాడు. అలా మొదలై వందల పాటలతో కళారూపాలతో సాగిన ప్రయాణం సాంస్కతిక సారథి ఉద్యోగం తర్వాత కూడా అమరులపై పాటలు పాడుతూ పరిమితంగానైనా కొనసాగుతూ వస్తుంది. ఆయనే వీడియో పాటలకు నాంది పలికి మధుప్రియ లాంటి వారికి అవకాశం ఇచ్చాడు.


కుల నిర్మూలన పోరాటాంశంతో రంగం మీదికి వచ్చినా, ప్రాంతీయ ప్రజాస్వామిక అంశంగా గుర్తింపబడ్డ్డ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ధూమ్‌ ధామ్‌లై అలరించినా నక్సలైట్లు- ప్రభుత్వం మధ్య శాంతి చర్చలు రంగం మీదికి వచ్చినా సంతోష్‌ తన పాత్ర, స్పందనలతో ముందుండే వాడు. చుండూరు దళిత జన ధర్మాగ్రహం నుండి మొదలుకుని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన ప్రజా చైతన్య యాత్రలో సంతోష్‌ చురుగ్గా పాల్గొన్నాడు. మూడు దశాబ్దాల ప్రస్థానంలో అరుణోదయ పాటకు గద్దర్‌ అభినయాన్ని జోడించిన సంతోష్‌ ప్రత్యేకత చెప్పుకుంటే ఒడవదు, తరగదు.

మోహన్‌ బైరాగి 

ఏపూరి మల్సూర్‌

Advertisement
Advertisement
Advertisement