హలో డాక్టర్‌.. హార్ట్‌బీట్‌ ఎక్కువాయే !

ABN , First Publish Date - 2022-05-18T08:25:49+05:30 IST

వైద్య విద్య అధ్యాపకులు ప్రతి ఐదుగురిలో ఒకరు రక్తపోటు (బీపీ)తో బాధపడుతున్నారు.

హలో డాక్టర్‌.. హార్ట్‌బీట్‌ ఎక్కువాయే !

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి):  వైద్య విద్య అధ్యాపకులు ప్రతి ఐదుగురిలో ఒకరు రక్తపోటు (బీపీ)తో బాధపడుతున్నారు. మంగళవారం (మే 17న) ‘ప్రపంచ రక్తపోటు దినోత్సవం’ సందర్భంగా తెలంగాణ టీచింగ్‌ గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (టీటీజీడీఏ) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 10 ప్రభుత్వ వైద్యవిద్య కళాశాలల్లో దాదాపు 400 మంది అధ్యాపకులకు బీపీ పరీక్షలు నిర్వహించారు. దీంతో ప్రతి ఐదుగురిలో ఒకరికి బీపీ ఉన్నట్లు తేలింది. మెజార్టీ అధ్యాపకులకు హార్ట్‌రేటు 90కిపైగా ఉండటం గమనార్హం. వాస్తవానికి హృదయ స్పందన రేటు సగటున నిమిషానికి 75లోపు ఉండాలి. అలా ఉంటే ఆరోగ్యకరంగా ఉన్నట్లు లెక్క. కానీ చాలామందిలో హృదయ స్పందన రేటు 90 వరకు ఉండటం ఆందోళన కలిగిస్తోందని టీటీజీడీఏ సభ్యులు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.


22- 60 ఏళ్ల మధ్య వయస్కులకు బీపీ స్ర్కీనింగ్‌ చేయగా, తొలిసారి బీపీ ఉన్నట్లుగా గుర్తించిన వారిలో 22-40 ఏళ్లవారే ఎక్కువ మంది ఉన్నారు. 15 శాతం మంది వైద్యులకు తమకు రక్తపోటు ఉన్న సంగతే తెలియకపోవడం గమనార్హం. ఇక వరంగల్‌ మెడికల్‌ కాలేజీలో వందమందికి సర్వే చేయగా 28 మందికి బీపీ ఉన్నట్లు తేలింది. 8 మందికి బీపీ ఉన్నట్లు తొలిసారి తేలగా, మిగతా 20 మంది ఇప్పటికే మందులు వాడుతున్నారు. కొవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా అవిశ్రాంతంగా బోధనాస్పత్రుల వైద్యులు పనిచేయాల్సి వస్తోంది. ఈనేపథ్యంలో కొంతమందిలో బీపీ పెరిగినట్లు నిర్థారణకు వచ్చామని టీటీజీడీఏ సభ్యులు తెలిపారు.

Updated Date - 2022-05-18T08:25:49+05:30 IST