ముంచెత్తిన వాన

ABN , First Publish Date - 2020-08-11T09:01:27+05:30 IST

తెలంగాణను ముసురు కమ్మింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు పలు జిల్లాల్లో వానలు దంచి కొట్టాయి. మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. నిజామాబాద్‌ జిల్లాలో

ముంచెత్తిన వాన

తెలంగాణలో విస్తృతంగా వర్షాలు

నవీపేటలో 17 సెం.మీ భారీ వర్షం

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌: తెలంగాణను ముసురు కమ్మింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు పలు జిల్లాల్లో వానలు దంచి కొట్టాయి. మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. నిజామాబాద్‌ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లాలో సగటున 7.63 సెం.మీ. వర్షపాతం నమోదయింది. అత్యధికంగా నవీపేట మండలంలో 17.78 సెం.మీ. రెంజల్‌లో 13.93 సెం.మీ వర్షం పడింది. చెరువులు నిండటంతో డిచ్‌పల్లి, నవీపేట, రెంజల్‌ మండలాల్లో పొలాలు నీట మునిగాయి. భారీ వర్షాలతో మంజీరకు జల కళ వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. సోమవారం జిల్లాలో 7.28 సెం.మీ వర్షపాతం నమోదైంది. పలు మండలాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. ఇల్లంతకుంటలో అత్యధికంగా 8.98 సెం.మీ వర్షం కురిసింది. పెద్దపల్లి జిల్లాలో సోమవారం ఉదయం వరకు 2.89 సెం.మీ సగటు వర్షపాతం నమోదయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపిలేని వానలు కురుస్తున్నాయి. ఆళ్లపల్లి, గుండాల మండలాల్లోని కిన్నెరసాని, జల్లేరు, ఏడు మెలికల, మల్లన్నవాగులు పొంగి ప్రవహిస్తుండటంతో సుమారు 40 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 22.5 అడుగులకు చేరింది. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ఓపెన్‌కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. అచ్చంపేట మండలంలో అత్యధికంగా 6.18 సెం.మీ, తెల్కపల్లిలో 5.27 సెం.మీ, కొల్లాపూర్‌లో 5.76సెం.మీ, వనపర్తిలో 5.7 సెం.మీ, గోపాల్‌పేట, ఘనపూర్‌లో 5.38సెం.మీ, నాగర్‌కర్నూల్‌ మండలంలో 4.86 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.


సాగర్‌ ఎడమ కాల్వ నీటి షెడ్యూల్‌ విడుదల

నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ ఆయకట్టుకు నవంబరు 28 వరకు నీటిని విడుదల చేయనున్నట్లు ఎన్‌ఎస్పీ కెనాల్‌ ఎస్‌ఈ విజయ భాస్కర్‌ తెలిపారు. వారబందీ పద్ధతిలో ఏడు విడతల్లో నీటిని విడుదల చేస్తామని, మొత్తంగా 78 రోజుల పాటు 1, 2 జోన్లకు 50 టీఎంసీల నీటిని వదులుతామని చెప్పారు.


కృష్ణా నదికి కొనసాగుతున్న వరద

కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. సోమవారం ఆలమట్టిలోకి 1.30 లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో నమోదయింది. 1.09 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అదే స్థాయిలో నారాయణపూర్‌ ప్రాజెక్టులోనూ ఇన్‌ఫ్లో, ఔట్‌ ఫ్లో నమోదయ్యాయి. జూరాలకు 1.95 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 1.96 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలంలోకి సుమారు 1.87 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. 38 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ నీరు సాగర్‌లోకి చేరుతోంది. నాగార్జునసాగర్‌లో 233 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాగా, తుంగభద్ర ప్రాజెక్టులోకి 1.07 లక్షల క్యూసెక్కుల వరద నమోదయింది. జలాశయంలో నీటి నిల్వ 75 టీఎంసీలు దాటింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీలోకి 71,300 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా 35 గేట్లను ఎత్తి 76,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్‌కు 36 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.

Updated Date - 2020-08-11T09:01:27+05:30 IST