కృష్ణా బేసిన్‌లోకి భారీ వరద!

ABN , First Publish Date - 2020-08-06T07:48:34+05:30 IST

కృష్ణా బేసిన్‌లో భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నారాయణపూర్‌ ప్రాజెక్టులోని నీటిని కొంత ఖాళీ చేయాల్సిందిగా కర్ణాటక రాష్ట్రానికి కేంద్ర జల సంఘం

కృష్ణా బేసిన్‌లోకి భారీ వరద!

అప్రమత్తం చేసిన కృష్ణా బోర్డు

నిండుకుండలా జూరాల

సింగూరు ప్రాజెక్టుకు జలకళ

మూడేళ్లలో ఇదే మొదటిసారి

554 అడుగులకు చేరిన సాగర్‌ నీటి మట్టం 

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): కృష్ణా బేసిన్‌లో భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నారాయణపూర్‌ ప్రాజెక్టులోని నీటిని కొంత ఖాళీ చేయాల్సిందిగా కర్ణాటక రాష్ట్రానికి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సూచించింది. ఈ మేరకు బుధవారం ప్రత్యేక వరద హెచ్చరికను జారీ చేసింది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ముఖ్యంగా ఎగువ కృష్ణా ప్రాంతమైన మహరాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, వాటి ఫలితంగా గురు, శుక్రవారాల్లో భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. రానున్న వరదను అంచనా వేసి, ఆ మేర ప్రాజెక్టుల నిర్వహణ చర్యల్ని తీసుకోవాలని కోరింది. ప్రస్తుతం నారాయణపూర్‌ పూర్తిగా నిండి ఉందని, భారీ వరద వస్తే.. ముంపు సమస్య తలెత్తనుందని పేర్కొంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులోని కొంత నీటిని దిగువకు విడుదల చేసి, ఖాళీగా ఉంచాలని కర్ణాటకకు సూచించింది. కృష్ణాకు ఉపనదులైన పంచగంగ, ఘటప్రభ, దూద్‌గంగ నుంచీ భారీ వరద రావొచ్చని పేర్కొంది. ఈ వరద నీరు నేరుగా ఆలమట్టికి చేరుకుంటుందని, అక్కడి నుంచి నారాయణపూర్‌ ప్రాజెక్టుకు వస్తుందని తెలిపింది. ప్రస్తుతం ఆలమట్టి ప్రాజెక్టు పూర్తిగా నిండాలంటే.. సుమారు 35 టీఎంసీల నీరు రావాల్సి ఉంటుంది. అదే నారాయణపూర్‌ ప్రాజెక్టు మాత్రం కేవలం 5 టీఎంసీల నీరు వస్తే నిండుతుంది. దాంతో దీనిలో ప్రస్తుతం ఉన్న నీటి మట్టాన్ని కొంత తగ్గించాలని సీడబ్ల్యూసీ సూచించింది. కాగా, బుధవారం ఆల్మట్టిలోకి సుమారు 3 వేల క్యూసెక్కుల వరద నమోదైంది. నారాయణపూర్‌లోకి 6 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. దాంతో దిగువలోని జూరాలకు 10 వేల క్యూసెక్కుల వరద నమోదైంది. అయితే.. సీడబ్ల్యూసీ అంచనా ప్రకారం గురువారం నుంచి ఆలమట్టిలోకి భారీ వరద వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే.. దిగువకు భారీగా నీటిని కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఆ నీరంతా నారాయణపూర్‌ మీదుగా మన రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టుకు చేరుకోనుంది. ప్రస్తుతం జూరాల కూడా నిండుగానే ఉంది. అలాగే నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీటి మట్టం బుధవారం సాయంత్రానికి 554.40 అడుగులకు (218 టీఎంసీలు) చేరింది.   ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టుల అధికారులకు కృష్ణా బోర్డు సూచించింది.


కన్నెపల్లి నుంచి ఎత్తిపోతలు షురూ..

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని కన్నెపల్లి(లక్ష్మీ) పంప్‌హౌస్‌ నుంచి అన్నారం(సరస్వతీ) బ్యారేజీలోకి బుధవారం రాత్రి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. ఎగువకు సుమారు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోస్తున్నారు. మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. అలాగే కరీంనగర్‌ జిల్లా గాయత్రి పంప్‌హౌస్‌ నుంచి నీటిని 3 పంపులతో శ్రీ రాజరాజేశ్వర రిజర్వాయర్‌ వరద కాలువ ద్వారా తరలిస్తున్నారు. 

Updated Date - 2020-08-06T07:48:34+05:30 IST