పోటెత్తిన కృష్ణమ్మ

ABN , First Publish Date - 2020-09-17T07:30:50+05:30 IST

అల్పపీడన ప్రభావంతో కొద్దిరోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఇటు కృష్ణా, అటు గోదావరి నదులకు వరద పోటెత్తుతోంది. దీంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు

పోటెత్తిన కృష్ణమ్మ

  • శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు భారీ వరద
  • ఎస్సారెస్పీ నుంచి రెండు లక్షల క్యూసెక్కులు దిగువకు
  • ఉరకలెత్తుతున్న గోదావరి
  • 20 గేట్లను ఎత్తి  నీరు విడుదల

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

అల్పపీడన ప్రభావంతో కొద్దిరోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఇటు కృష్ణా, అటు గోదావరి నదులకు వరద పోటెత్తుతోంది. దీంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వైపునకు ప్రవాహం పెరగడంతో బుధవారం సాయంత్రం సాగర్‌ ప్రాజెక్టు 20 క్రస్ట్‌గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుంచి 1,53,684 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 20,680 క్యూసెక్కులు, హంద్రీనీవా నుంచి 1,125 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలంలో 10 క్రస్ట్‌గేట్లను 15 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. కుడిగట్టులో విద్యుదుత్పత్తి ద్వారా సాగర్‌కు 3,38,152 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.0405 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 589.80 అడుగులుగా(311.4474 టీఎంసీలుగా) ఉంది.


సాగర్‌ నుంచి మొత్తం 3,38,152 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ నుంచి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో జూరాలకూ నీటి రాక పెరిగింది. దీంతో అధికారులు బుధవారం 24 గేట్లను ఎత్తి 1,28,024 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాలలో 318.380 మీటర్లలో నీటి నిల్వ ఉండగా 5.486 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకున్నది. నారాయణపేట  జిల్లాలోని సంగంబండ ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సంగారెడ్డి జిల్లాలో సింగూరు ప్రాజెక్టుకు 27,064 క్యూసెక్కుల వరద నీరు కొత్తగా వచ్చి చేరింది. నాలుగేళ్లలో ఇంత మొత్తంలో వరద రావడం ఇదే కావడం విశేషం. 


శ్రీరామసాగర్‌లో 40 గేట్ల ఎత్తివేత..

గోదావరి, మంజీరాల నుంచి ఒకేసారి వరద రావడంతో.. నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు 40 గేట్లను ఎత్తివేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 2.21లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా.. అంతే మొత్తంలో దిగువకు వదిలారు. శ్రీరామసాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులను కొనసాగిస్తూ.. విడుదల చేస్తున్నారు.బగోదావరి పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు దిగువ మానేరు, శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి ఇన్‌ఫ్లో  కొనసాగుతోంది. శ్రీ రాజరాజేశ్వర ప్రాజెక్ట్‌ రాత్రివేళలో విద్యుద్దీపాల వెలుతురులో నీళ్లు తరలి వెళుతున్న దృశ్యం కనువిందు చేస్తోంది. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పులిచింతల, మూసీ ప్రాజెక్టులకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో బుధవారం కూడా కొనసాగింది. డిండి ప్రాజెక్టులో ఏడేళ్ల తరువాత నీటి మట్టం 36 అడుగుల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. సోమశిల జలాశయంలో నీటి నిల్వ 73టీఎంసీలకు చేరడంతో పది క్రస్ట్‌గేట్లు ఎత్తి 35వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కండలేరు నుంచి చెన్నైకి 8టీఎంసీల నీటిని విడుదల చేస్తామని ఇంచార్జి సీఈ హరినాయాణరెడ్డి తెలిపారు.

Updated Date - 2020-09-17T07:30:50+05:30 IST