ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి చూశాకే.. వైద్య విద్య తరగతుల ప్రారంభం!

ABN , First Publish Date - 2021-07-25T08:48:00+05:30 IST

వైద్య విద్య కళాశాలల్లో ప్రత్యక్ష తరగతుల ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇతర రాష్ట్రాల్లో వైద్య విద్య తరగతులు ప్రారంభమై, అక్కడ ఇబ్బందులు...

ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి చూశాకే.. వైద్య విద్య తరగతుల ప్రారంభం!

  • వేచి చూసే ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం
  • అనుమతి కోరుతూ ఆరోగ్య వర్సిటీ లేఖ

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్య కళాశాలల్లో ప్రత్యక్ష తరగతుల ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇతర రాష్ట్రాల్లో వైద్య విద్య తరగతులు ప్రారంభమై, అక్కడ ఇబ్బందులు లేవనకున్న తర్వాతే... ఈ విషయంపై ఆలోచించాలన్న ధోరణిలో సర్కారు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పొరుగున ఉన్న కర్ణాటకలో వైద్య విద్య కళాశాలలను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మెడికల్‌ కాలేజీల ప్రారంభానికి అనుమతి ఇస్తూ ఈనెల 17న ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంతో రెవెన్యూ శాఖకు సంబంఽఽధం లేకపోయినా డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కింద ఉన్న అధికారంతో అనుమతి ఇచ్చినట్లు సమాచారం. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోనూ మెడికల్‌ కాలేజీలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా వైద్యవిద్య కళాశాలల ప్రారంభంపై  తెరుచుకోలేదు. అన్ని చోట్లా ప్రారంభమయ్యాక ఎటువంటి ఇబ్బందులు లేవని నిర్ధారించుకున్న తర్వాతే రాష్ట్రంలో వీటిని ప్రారంభించాలని సర్కార్‌ యోచిస్తున్నట్లు తెలిసింది. కాగా, రాష్ట్రంలో కొవిడ్‌ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో వైద్య విద్య తరగతులు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది. ఒకవేళ అనుమతి లభిస్తే ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించాలని భావించింది. ఇప్పటికే కరోనా తొలి దశ కారణంగా 9 నెలలు, రెండో దశ నేపథ్యంలో మరో మూడు నెలల సమయాన్ని వైద్యవిద్య విద్యార్థులు కోల్పోయారు. మూడో దశ వస్తుందన్న  హెచ్చరికల నేపథ్యంలో కనీసం తుది ఏడాది విద్యార్థులకైనా ప్రాక్టికల్స్‌, క్లినికల్‌ శిక్షణ పూర్తి చేయించాలని హెల్త్‌ యూనివర్సిటీ భావిస్తోంది.


Updated Date - 2021-07-25T08:48:00+05:30 IST