ఆరోగ్య తెలంగాణం

ABN , First Publish Date - 2021-12-28T06:55:23+05:30 IST

ఆరోగ్య రంగం పనితీరులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో

ఆరోగ్య తెలంగాణం

  • నీతి ఆయోగ్‌ ర్యాంకింగ్‌లో మూడో స్థానం.. కేరళ నంబర్‌ 1.. చిట్టచివరలో యూపీ
  • ఏపీకి 10వ స్థానం.. తెలంగాణ ఆస్పత్రుల్లో కాన్పులకు కితాబు
  • తెలంగాణను చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలి: నీతిఆయోగ్‌ 
  • మాతాశిశు మరణాల నిరోధంలోనూ ఉత్తమ పనితీరు
  • ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌ ప్రశంసలు


 న్యూఢిల్లీ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య రంగం పనితీరులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. నీతిఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌, సీఈవో అమితాబ్‌ కాంత్‌, కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి రాకేశ్‌ సర్వల్‌, ప్రపంచ బ్యాంకు సీనియర్‌ హెల్త్‌ స్పెషలిస్టు షీనా ఛబ్రా సోమవారం ఆరోగ్య సూచీని.. సమగ్ర నివేదికను విడుదల చేశారు. 2019-20 సంవత్సరానికి గాను ‘ఆరోగ్యకరమైన రాష్ట్రాలు.. ప్రగతిశీల భారతదేశం‘ శీర్షికతో రూపొందించిన నివేదికలో 19 పెద్ద రాష్ట్రాలు, 8 చిన్నరాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలకు వేర్వేరుగా ర్యాంకులు కేటాయించారు. 24 అంశాల్లో స్కోరింగ్‌ మేరకు ఈ సూచీలను విడుదల చేసినట్లు నీతిఆయోగ్‌ వెల్లడించింది.


19 పెద్ద రాష్ట్రాల జాబితాలో కేరళ రాష్ట్రం అత్యుత్తమ వైద్య సేవలతో 100కు 82.2 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానాన్ని తమిళనాడు(72.42 మార్కులు).. మూడో స్థానాన్ని తెలంగాణ(69.96 మార్కులు) కైవసం చేసుకుని, దక్షిణాది సత్తాను చాటాయి. అధ్వాన్న రాష్ట్రాల జాబితాలో ఉత్తరప్రదేశ్‌ ముందంజలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో బిహార్‌, మధ్యప్రదేశ్‌ నిలిచాయి. పొరుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ 10వ స్థానంతో సరిపెట్టుకుంది. చిన్నరాష్ట్రాల జాబితాలో మిజోరం టాప్‌లో నిలవగా.. కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో ఢిల్లీ అట్టడుగున ఉంది.


కాగా.. 2018-19 సంవత్సరంలో తెలంగాణ 4వ ర్యాంకులో ఉండగా.. 2019-20కి 4.22 మార్కులను అదనంగా సాధించి, ఒక ర్యాంకు పైకి ఎగబాకడం గమనార్హం. 2020 నుంచి కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో వైద్య సదుపాయాలను మరింతగా మెరుగుపరుచుకున్నామని, ఈ సారి మరింత మెరుగైన ర్యాంకును సాధించే అవకాశాలున్నాయని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. 



తెలంగాణ పురోగతి ఇలా..

 ఓవరాల్‌ పర్ఫార్మెన్స్‌లో 69.96 స్కోరుతో మూడో స్థానం

 హెల్త్‌ ఔట్‌కమ్స్‌ సూచీలో 73.06 స్కోర్‌తో మూడో స్థానం

 పరిపాలన సూచీలో 64.16 స్కోర్‌తో 8వ స్థానంలో

 కీ ఇన్‌పుట్స్‌, ప్రాసెసెస్‌ సూచీలో 61.56 స్కోర్‌తో 5వ స్థానం

 100ు ఇమ్యునైజేషన్‌ పూర్తిచేసిన రాష్ట్రంగా రికార్డు

 96.3% సంస్థాగతమైన కాన్పులతో పురోగతి (2014-15లో కేవలం 62.8%). మాతాశిశు మరణాలను తగ్గించడంలో తెలంగాణ పనితీరుకు నీతిఆయోగ్‌ కితాబు. ఇతర రాష్ట్రాలు తెలంగాణను చూసి నేర్చుకోవాలని సూచనలు

 ప్రసూతి మరణాల విషయంలో సుస్థిరాభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యాల సాధనలో మరో నాలుగు రాష్ట్రాల సరసన తెలంగాణ




మంత్రి కేటీఆర్‌ ప్రశంసలు


రాష్ట్రాల వారీగా ఆరోగ్య సూచీలో తెలంగాణ మూడో స్థానానికి ఎగబాకడంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. కేసీఆర్‌ కిట్ల వల్ల ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులు పెరిగాయని, దాన్ని నీతిఆయోగ్‌ ప్రశంసించిందని పేర్కొంటూ. ‘కేసీఆర్‌ కిట్‌ సూపర్‌ హిట్‌’ అన్నారు. ‘హెల్త్‌ ర్యాంకుల్లో తెలంగాణ జబర్దస్త్‌’ అని కొనియాడారు.


Updated Date - 2021-12-28T06:55:23+05:30 IST