బ్రిటిష్ పాలనను వ్యతిరేకించిన నిజాం వారసుడు

ABN , First Publish Date - 2022-08-06T06:14:38+05:30 IST

ఆంగ్లేయులకు అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్న నిజాం వంశం నుంచి బ్రిటీషర్లకు వ్యతిరేకంగా, వారి పాలనను అంతం చేయడానికి ఒక యువరాజు విస్తృత ప్రయత్నం చేశాడు...

బ్రిటిష్ పాలనను వ్యతిరేకించిన నిజాం వారసుడు

ఆంగ్లేయులకు అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్న నిజాం వంశం నుంచి బ్రిటీషర్లకు వ్యతిరేకంగా, వారి పాలనను అంతం చేయడానికి ఒక యువరాజు విస్తృత ప్రయత్నం చేశాడు. దాదాపు ఒకటిన్నర దశాబ్దం పాటు హైదరాబాద్ స్టేట్‌ను తమ కనుసన్నలలో పరోక్షంగా పాలించిన బ్రిటీషర్లకు వ్యతిరేకంగా మూడవ నిజాం అయిన సికిందర్ జా రెండో కుమారుడు ముబారిజుద్దౌలా ప్రయత్నించాడు. ఉత్తర భారతీయులతో పాటు పొరుగున ఉన్న కర్నూల్ నవాబ్‌ల సహాయ సహకారాలతో బ్రిటీషర్ల పాలనను అంతం చేయడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే, ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన ఆంగ్లేయులు పటిష్టమైన వేగుల ద్వారా వీరి ప్రయత్నాలను ఆదిలోనే విఫలం చేసి ముబారిజుద్దౌలాకు కారాగారం, కర్నూల్ నవాబ్‌కు తమిళనాడులో శిక్ష విధించారు.


ముబారిజుద్దౌలా స్వదేశీ కాంక్షతో మొదటి నుంచి ఆంగ్లేయుల పట్ల తీవ్ర విద్వేషాన్ని పెంపొందించుకున్నాడు. ఎంతగా అంటే, తన ఇంటిముందు చౌకీదార్‌గా ఒక ఆంగ్ల సిపాయిని నియమిస్తే, తాను చావనైనా చస్తాను కానీ ఆంగ్ల సిపాయి తనకు కాపలాగా ఉండొద్దని పట్టు పట్టి మరీ తొలగించాడు. తన 15వ ఏట నుంచే బ్రిటిష్ వారికీ వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించాడు ముబారిజుద్దౌలా. ఇతనికి కర్నూల్ నవాబ్ రసూల్ ఖాన్ సమవయస్కుడైనందున వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ముబారిజుద్దౌలా స్వంతంగా దాదాపు ఒక లక్ష సైన్యాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడట.


 1839లో ఉత్తర భారతంలో వహాబీ ఉద్యమం వచ్చింది. ఇది, ముస్లింలలో సంస్కరణలకై ప్రారంభమైన ఉద్యమం అయినప్పటికీ క్రమంగా బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా మారింది. ఈ ఉద్యమ నాయకులలో ఒకరైన మౌల్వీ సలీం హైదరాబాద్ నగరానికి వచ్చి బ్రిటిషర్ల ఆధిపత్యాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ముబారిజుద్దౌలాను కలసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. కర్నూల్ నవాబ్ రసూల్ ఖాన్ ఒక లక్ష రూపాయల విలువైన ఆయుధ సామాగ్రిని కూడా సమకూర్చాడు. బ్రిటీషర్లపై తుది సమరం చేయడానికి ప్రణాళిక, ఆయుధ సహాయం ఎలా చేయాలి, ఏ విధంగా వారిపై దాడి చేయాలో వివరిస్తూ సవివరమైన లేఖను కర్నూల్ నవాబ్‌కు ముబారిజుద్దౌలా పంపాడు. ఈ లేఖను బ్రిటీషర్ల గూఢచారి గుర్తించి వారికి అందచేసింది. దీనితో, ఈ కుట్రను ఛేదించిన బ్రిటీషర్లు దీనిపై ఒక ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఈ కుట్రలో భాగమైన మౌల్వీ సలీంకు, ఆయన అనుచరులకు 18 సంవత్సరాల కఠిన కారాగారశిక్ష విధించారు. ముబారిజుద్దౌలాను గోలకొండలో బందీ చేశారు. ఇక్కడే ఐదేళ్లపాటు ఖైదీగా ఉండి తన 54వ ఏట 1852లో అతడు మరణించాడు. రెండు రోజుల యుద్ధం అనంతరం కర్నూల్ నవాబ్ రసూల్ ఖాన్ ను బ్రిటిషర్లు ఓడించి, అతడిని మద్రాస్ స్టేట్‌లోని తిరుచునాపల్లి జైలుకు పంపారు. అక్కడే రసూల్ ఖాన్‌ను ఆయన అనుచరుడు హత్య చేశాడు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడిన ముబారిజుద్దౌలా చరిత్ర మాత్రం అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు.

– కన్నెకంటి వెంకటరమణ

Updated Date - 2022-08-06T06:14:38+05:30 IST