భార్యను చంపి.. ఆస్పత్రిపై నెట్టి..

ABN , First Publish Date - 2022-09-22T08:16:27+05:30 IST

అతనికిద్దరు భార్యలు. వాళ్లిద్దరి మధ్య గొడవలు. ఒకరిని చంపేస్తే తప్ప తనకు మనశ్శాంతి లేదనుకున్నాడు.

భార్యను చంపి.. ఆస్పత్రిపై నెట్టి..

  • బిడ్డకు జన్మనిచ్చిన మరుసటి రోజే మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి హత్య 
  • వైద్యుల నిర్లక్ష్యం వల్లేనంటూ ఆందోళన
  • ఆర్థిక సాయం హామీతో విరమించిన భర్త
  • సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించడంతో నిజం బయటకు
  • ఖమ్మంలో 50 రోజుల క్రితం ఘటన.. నిందితుడి అరెస్టు
  • జమాల్‌ కేసు నేపథ్యంలో తాజాగా వెలుగులోకి
  • సవతుల మధ్య గొడవలే రెండో భార్య హత్యకు కారణం

ఖమ్మం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): అతనికిద్దరు భార్యలు. వాళ్లిద్దరి మధ్య గొడవలు. ఒకరిని చంపేస్తే తప్ప తనకు మనశ్శాంతి లేదనుకున్నాడు. చిన్న భార్యకు మత్తుమందు ఇచ్చి చంపేశాడు. ఆమె  బిడ్డను ప్రసవించిన మరుసటి రోజే, ఆస్పత్రిలోనే ఇంజక్షన్‌ చేశాడు. ఆపై వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోయిందని లబోదిబోమన్నాడు. ఖమ్మం జిల్లాలో.. 50 రోజుల క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం రూరల్‌ మండలం పెద్దతండాకు చెందిన భిక్షం నగరంలోని ఓ ఆసుపత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా, అనస్థీసియా వైద్యుడి వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు. అతనికి మొదట తన మేనకోడలితో పెళ్లి అయింది. పిల్లలు కలగలేదు. దీంతో తన కంటే 20 ఏళ్లు చిన్నదైన నవీన(23)ను రెండో పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులు ముగ్గురు అన్యోన్యంగానే ఉన్నారు. నవీనకు పాప పుట్టింది. తర్వాత సవతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే నవీన రెండో సారి గర్భం దాల్చింది.


 గొడవలతో విసిగిపోయిన భిక్షం రెండో భార్య నవీనను హతమార్చాలని పథకం వేశాడు. ప్రసవం కోసం జూలై 30న ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించాడు. ఆడశిశువు పుట్టింది. మరసటి రోజు తెల్లవారే సరికి నవీన ఆస్పత్రిలోనే చనిపోయింది. సరిగ్గా వైద్యం చేయకపోవడం వల్లే తన భార్య చనిపోయిందంటూ భిక్షం తన బంధువులతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగాడు. నవీన హఠాత్తుగా ఎందుకు చనిపోయిందో అర్థం కాని వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది తీవ్ర ఆందోళన చెందారు. భిక్షం కూతుర్లు ఇద్దరికీ ఆర్థిక సాయం చేస్తామని సదరు ఆస్పత్రి యాజమాన్యం హామీ ఇచ్చింది. ఆందోళన విరమించిన భిక్షం నవీన మృతదేహాన్ని ఊరికి తీసుకువెళ్లకుండా ఖమ్మంలోని శ్మశాన వాటికలోనే అంత్యక్రియలు పూర్తి చేశాడు. నవీన అంత్యక్రియలను ఖమ్మంలోనే నిర్వహించడంతో ఆస్పత్రి సిబ్బందిలో అనుమానం మొదలైంది.


 దవాఖానలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ప్రసవం జరిగిన రోజు అర్ధరాత్రి 2గంటల సమయంలో భిక్షం తన భార్య నవీనకు ఇంజక్షన్‌ ఇవ్వడం, ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత బయటకు వెళ్లి హడావుడి చేయడం కనిపించాయి. నిర్ఘాంతపోయిన ఆస్పత్రి యాజమాన్యం ఖమ్మం టూ టౌన్‌ పోలీసులను సంప్రదించింది. స్వాత్రంత్య వజ్రోత్సవాలు, వినాయకచవితి నేపథ్యంలో ఈ విషయాన్ని పోలీసులు లైట్‌ తీసుకున్నారు. ఇటీవల బిక్షంను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా..  అసలు విషయం బయటపడింది. నవీనకు ఇంజక్షన్‌ ద్వారా అధిక మోతాదులో మత్తు మందు ఇచ్చి చంపినట్టు ఒప్పుకున్నాడు. రెండు వారాల క్రితమే పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జమాల్‌సాహెబ్‌ ఘటనతో ఇది వెలుగులోకి వచ్చింది. 

Updated Date - 2022-09-22T08:16:27+05:30 IST