తాగిన మత్తులో ఆ క్రికెటర్ నన్ను 15వ అంతస్తు బాల్కనీ నుంచి వేలాడదీశాడు: చాహల్ షాకింగ్ కామెంట్స్

ABN , First Publish Date - 2022-04-08T22:10:51+05:30 IST

రాజస్థాన్ రాయల్స్ స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టాడు.

తాగిన మత్తులో ఆ క్రికెటర్ నన్ను 15వ అంతస్తు బాల్కనీ నుంచి వేలాడదీశాడు: చాహల్ షాకింగ్ కామెంట్స్

ముంబై: రాజస్థాన్ రాయల్స్ స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టాడు. వెన్నులో వణుకుపుట్టించేలా ఉన్న ఈ ఘటన 2013 ఐపీఎల్ సందర్భంగా జరిగింది. దాదాపు చావు అంచుల వరకు వెళ్లొచ్చిన చాహల్.. ఆ రాత్రి ఓ గొప్ప పాఠాన్ని నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు.


చాహల్ 2013లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. పూర్తిగా తాగిన మైకంలో ఉన్న ఓ ‘ఆటగాడు’ తాముంటున్న హోటల్ 15వ అంతస్తు నుంచి తనను వేలాడదీశాడని చెప్పుకొచ్చాడు. ఇతరులు చూసి తనను కాపాడి రూముకి తీసుకెళ్లారని, త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయపడ్డానని వివరించాడు. అయితే, తనను అలా వేలాడదీసిన ఆటగాడు ఎవరన్న విషయాన్ని చాహల్ బయటపెట్టలేదు. అయితే, ఈ ఘటన తర్వాత ఎక్కడికైనా వెళ్తే ఎలా ఉండాలన్న విషయాన్ని అర్థం చేసుకున్నానని చాహల్ వివరించాడు.  


రవిచంద్రన్ అశ్విన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ ఈ గగుర్పొడిచే అనుభవాన్ని బయటపెట్టాడు. ఈ వీడియోను రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ ట్విట్టర్ ఖాతాలో  పోస్టు చేసింది. 2013లో ముంబైకి ప్రాతినిధ్యం వహించిన చాహల్ ఆ తర్వాత బెంగళూరుకు ఆడాడు. కొన్నేళ్లపాటు ఆ జట్టులో కీలకంగా ఉన్న చాహల్‌ను 2021లో ఆ జట్టు వదిలేసుకుంది. దీంతో మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ అతడిని దక్కించుకుంది.  


అశ్విన్‌కు ఇచ్చిన ఆ ఇంటర్వ్యూలో చాహల్ మాట్లాడుతూ.. ఈ విషయాన్ని బయటపెట్టాడు. తానీ విషయాన్ని ఇప్పటి వరకు ఎవరితోనూ పంచుకోలేదన్నాడు.  ‘‘2013లో ఈ ఘటన జరిగింది. నేనప్పుడు ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నాను. బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో గెలిచాక హోటల్ రూములో పార్టీ చేసుకున్నాం. పార్టీలో ఓ ఆటగాడు బాగా తాగి ఉన్నాడు. నేనతడిని పేరు చెప్పలేను. చాలాసేపటి నుంచి నన్నే చూస్తున్న అతడు రమ్మని పిలిచాడు. దగ్గరికెళ్తే పట్టుకుని బాల్కనీలోకి తీసుకెళ్లి పై నుంచి కిందికి వేలాడదీశాడు. నా చేతులు అతడి మెడచుట్టూ ఉన్నాయి. చేతులు కనుక పట్టు జారి ఉంటే..., నేనప్పుడు 15వ అంతస్తులో ఉన్నాను’’ అంటూ నాటి భయంకరమైన అనుభవాన్ని పంచుకున్నాడు. అది చూసి వెంటనే అక్కడున్న వారు స్పందించడంతో బతికిపోయానని అన్నాడు. కళ్లు తిరిగి పడిపోతే నీళ్లిచ్చారని చాహల్ గుర్తు చేసుకున్నాడు. 


ఈ ఘటనతో ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఎలా ఉండాలన్న విషయాన్ని అర్థం చేసుకున్నానని చాహల్ చెప్పాడు. తాను త్రుటిలో తప్పించుకున్న ఘటన ఇదేనని, ఆ రోజు ఏమాత్రం పట్టు సడలినా కిందపడి ఉండేవాడనని అన్నాడు. ఈ వీడియో వైరల్ అయ్యాక, అలా వేలాడదీసిన ఆటగాడు ఎవరో చెప్పాలని అభిమానులు అతడిని కోరుతున్నారు. పేరు చెబితే అతడిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. 


చాహల్ ఈ సీజన్‌ను బాగానే ఆరంభించాడు. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడి 7 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా మాజీ ఫ్రాంచైజీ బెంగళూరుతో ఆడినప్పుడు రెండు వికెట్లు తీసుకోవడమే కాకుండా తన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని రనౌట్ చేశాడు.  



Updated Date - 2022-04-08T22:10:51+05:30 IST