భారత్‌లో అత్యుత్తమ యాజమాన్యం హెచ్‌సీఎల్‌

ABN , First Publish Date - 2020-10-23T06:37:24+05:30 IST

ప్రపంచంలోని అత్యుత్తమ యాజమాన్య కంపెనీలకు సంబంధించి ఫోర్బ్స్‌ నాలుగో వార్షిక జాబితాను విడుదల చేసింది

భారత్‌లో అత్యుత్తమ యాజమాన్యం హెచ్‌సీఎల్‌

  • ‘వరల్డ్స్‌ బెస్ట్‌ ఎంప్లాయర్స్‌ 2020’  
  • జాబితా విడుదల చేసిన ఫోర్బ్స్‌  
  • 31 భారత కంపెనీలకు చోటు
  • పీఎ్‌సయూల్లో ఎన్‌టీపీసీ టాప్‌
  • తెలుగు రాష్ట్రాల్లో అమరరాజా.. 


ప్రపంచంలోని అత్యుత్తమ యాజమాన్య కంపెనీలకు సంబంధించి ఫోర్బ్స్‌ నాలుగో వార్షిక జాబితాను విడుదల చేసింది. దక్షిణ కొరియాకు చెందిన సామ్‌సంగ్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఈ ఏడాదికి గాను వరల్డ్స్‌ బెస్ట్‌ ఎంప్లాయర్‌గా నిలిచింది. అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌, బహుళ జాతి ఐటీ కంపెనీ ఐబీఎం వరుసగా 2,3 స్థానాలు దక్కించుకున్నాయి. టాప్‌-5లోని మిగతా కంపెనీల్లో  మైక్రోసాఫ్ట్‌, ఎల్‌జీ ఉన్నాయి. భారత్‌ నుంచి 31 కంపెనీలకు ఈ లిస్ట్‌లో చోటు దక్కింది. మన దేశంలో అత్యుత్తమ యాజమాన్య కంపెనీగా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ ర్యాంకింగ్‌లో ఈ ఐటీ కంపెనీకి 30వ స్థానం లభించింది. మరిన్ని ముఖ్యాంశాలు.. 


  1. భారత్‌ నుంచి 6 ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎ్‌సయూ), 3 ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు (పీఎ్‌సబీ)లకు ఈ జాబితాలో స్థానం లభించింది. 
  2. పీఎ్‌సయూల్లో  నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ)దే అత్యుత్తమ ర్యాంకింగ్‌.  ప్రపంచ లిస్ట్‌లో 262వ స్థానం దక్కింది. 
  3. పీఎ్‌సబీల్లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎ్‌సబీఐ)దే అగ్రపీఠం. వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో 252వ స్థానంలో ఉంది. 
  4. వరల్ట్‌ టాప్‌-50లోని ఏకైక భారత కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌. టాప్‌-100లో   హెచ్‌సీఎల్‌తో పాటు బజాజ్‌ (78వ స్థానం), రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (81వ స్థానం)కూ చోటు దక్కింది. 
  5. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, కేవలం ‘అమర రాజా’కు ఈ జాబితాలో చోటు లభించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఈ గ్రూప్‌ 316వ స్థానంలో ఉంది. 




మొత్తం 750 కంపెనీలు 

వరల్డ్స్‌ బెస్ట్‌ ఎంప్లాయర్స్‌ జాబితాను రూపొందించేందుకు మార్కెట్‌ పరిశోధన సంస్థ ‘స్టాటిస్టా’తో ఫోర్బ్స్‌ జతకట్టింది. మొత్తం 58 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళజాతి కంపెనీలు, ప్రముఖ సంస్థల్లోని 1.60 లక్షల మంది ఫుల్‌టైం, పార్ట్‌టైం ఉద్యోగులను సర్వే చేసింది. ఉద్యోగం కోసం తెలిసిన వారికి, బంధువులకు తమ కంపెనీని సిఫారసు చేస్తారా..? అన్న ప్రశ్నపై సర్వేలో పాల్గొన్న వారి నుంచి అభిప్రాయాలు సేకరించింది. అలాగే, కరోనా సంక్షోభ సమయంలో యాజమాన్యం స్పందనపై ఏ మేర సంతృప్తి చెందారన్న సమాచారాన్నీ సేకరించింది. కంపెనీ పేరు ప్రతిష్ఠలు, ఆర్థిక పరిపుష్ఠి, ప్రతిభ అభివృద్ధి, లింగ సమానత్వం, సామాజిక బాధ్యత వంటి అంశాల్లోనూ ఉద్యోగుల్లో తమ యాజమాన్యంపైౖ అభిప్రాయాల్ని కోరింది. పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి రూపొందించిన ఈ జాబితాలో 45 దేశాలకు చెందిన 750 కంపెనీలకు ర్యాంకింగ్‌లు కేటాయించింది. అత్యధికంగా 247 అమెరికా కంపెనీలకు ఈ లిస్ట్‌లో స్థానం లభించింది. కాగా, యూరప్‌ నుంచి 224, ఆసియా, ఓషియానియా దేశాల నుంచి 208 కంపెనీలకు చోటు దక్కింది.  

-ఆంధ్రజ్యోతి (బిజినెస్‌ డెస్క్‌)


Updated Date - 2020-10-23T06:37:24+05:30 IST