పేరు మార్చారా... బిల్లు ఆమోదించారా..!

ABN , First Publish Date - 2022-09-23T08:20:31+05:30 IST

పేరు మార్చారా... బిల్లు ఆమోదించారా..!

పేరు మార్చారా... బిల్లు ఆమోదించారా..!

గవర్నర్‌ విశ్వభూషణ్‌ విస్మయం

పేరు మార్పు తీరును వివరించిన చంద్రబాబు


అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పు పరిణామాలపై రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ విస్మయం వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం ఆయనను టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతల బృందం విజయవాడలోని రాజ్‌భవన్‌లో కలిసి పేరు మార్పుపై ఫిర్యాదు చేసింది. టీడీపీ వర్గాల కథనం ప్రకారం ఈ సందర్భంగా గవర్నర్‌ ప్రతిస్పందించారు. ‘‘విశ్వ విద్యాలయం పేరు మార్చారా... బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిందా..!’’ అని గవర్నర్‌ విస్మయం వ్యక్తం చేశారు. ఈ విశ్వ విద్యాలయానికి గవర్నర్‌ కులపతిగా ఉన్నారని చెపుతూ, పేరు మార్పు సమాచారం ముందుగా ఇచ్చారా? అని చంద్రబాబు, గవర్నర్‌ని అడిగినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పేరు మార్పు బిల్లు ఆమోదానికి వచ్చినప్పుడు దానిని తిరస్కరించాలని చంద్రబాబు గవర్నర్‌కు అందచేసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ‘‘ప్రతిపక్షం అసెంబ్లీలో లేనప్పుడు దీనిని ఆమోదించారు. పైగా మంత్రివర్గ ఆమోదం కూడా రాత్రివేళ హడావుడిగా తీసుకొన్నారు. ఇది అప్రజాస్వామిక బిల్లు అనడానికి ఇదే నిదర్శనం. పేరు మార్పును మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, యూజీసీ ఆమోదించాల్సి ఉంటుంది. ఇది న్యాయపరమైన చిక్కులకు దారితీస్తుంది. రాష్ట్రంలో వైద్య విశ్వ విద్యాలయం ఆలోచనకు అంకురార్పణ చేసింది ఎన్టీఆర్‌. ఆయన దానిని ఏర్పాటు చేయడంతోపాటు తొలి చాన్స్‌లర్‌గా వ్యవహరించారు. ఆయన శత జయంతి వేడుకలను తెలుగు ప్రజలు ప్రపంచం అంతా జరుపుకొంటున్న సమయంలో వైసీపీ ప్రభుత్వం పాక్షిక ఆలోచనా ధోరణితో ఈ నిర్ణయం తీసుకొంది’’ అని తన లేఖలో చంద్రబాబు వివరించారు. ఆయనతోపాటు గవర్నర్‌ను కలిసిన వారిలో టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్‌, పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, నక్కా ఆనందబాబు, పయ్యావుల కేశవ్‌, అశోక్‌ బాబు, బెందాళం అశోక్‌, బచ్చుల అర్జునుడు, బీటీ నాయుడు, వర్ల రామయ్య, వెలగపూడి ఆనందబాబు, సత్యనారాయణ రాజు తదితరులు ఉన్నారు. ఈ భేటీ తర్వాత గవర్నర్‌, చంద్రబాబు విడిగా పది నిమిషాలుపాటు సమావేశం అయ్యారు.

Updated Date - 2022-09-23T08:20:31+05:30 IST