ముంబై.. కష్టంగా!

ABN , First Publish Date - 2021-09-29T08:11:29+05:30 IST

హ్యాట్రిక్‌ పరాజయాల తర్వాత ముంబై ఇండియన్స్‌ కోలుకుంది. స్వల్ప ఛేదనలో ఇబ్బందిపడినా చివర్లో హార్దిక్‌ పాండ్యా..

ముంబై.. కష్టంగా!

పంజాబ్‌పై విజయం

ఫామ్‌ చాటుకున్న హార్దిక్‌

 టీ20ల్లో 10వేల పరుగులు+300 వికెట్లు పూర్తి చేసుకున్న ఏకైక క్రికెటర్‌గా కీరన్‌ పొలార్డ్‌ రికార్డు సృష్టించాడు.

అబుదాబి: హ్యాట్రిక్‌ పరాజయాల తర్వాత ముంబై ఇండియన్స్‌ కోలుకుంది. స్వల్ప ఛేదనలో ఇబ్బందిపడినా చివర్లో హార్దిక్‌ పాండ్యా (30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 నాటౌట్‌) మెరుపు ఆటతో పంజాబ్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులు చేసింది. మార్‌క్రమ్‌ (42) రాణించాడు. పొలార్డ్‌, బుమ్రాలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో ముంబై 19 ఓవర్లలో 4 వికెట్లకు 137 పరుగులు చేసి గెలిచింది. సౌరభ్‌ తివారి (45) ఆదుకున్నాడు. బిష్ణోయ్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా పొలార్డ్‌ నిలిచాడు.


హార్దిక్‌ జోరు:

స్వల్ప ఛేదనలో ముంబై ఇండియన్స్‌కు నాలుగో ఓవర్‌లో ఝలక్‌ తగిలింది. స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ వరుస బంతుల్లో రోహిత్‌ (8), సూర్యకుమార్‌ (0)లను పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో పవర్‌ప్లేలో ముంబై 30 పరుగులే చేసింది. ఆ తర్వాత డికాక్‌ (27) నెమ్మదిగా ఆడినా సౌరభ్‌ తివారి బౌండరీలతో ఎదురుదాడికి దిగాడు. అటు పదో ఓవర్‌లో డికాక్‌ను షమి బౌల్డ్‌ చేయడంతో మూడో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో హార్దిక్‌తో కలిసి తివారి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈక్రమంలో వీరిద్దరి క్యాచ్‌లను ఫీల్డర్లు వదిలేశారు. చివరకు 16వ ఓవర్‌లో రాహుల్‌ డైవింగ్‌ క్యాచ్‌తో తివారి వెనుదిరిగాడు. అప్పటికి 29 బంతుల్లో 44 రన్స్‌ అవసరపడ్డాయి. దీంతో చేయాల్సిన రన్‌రేట్‌ పదికి పెరుగుతుండడంతో ఉత్కంఠ పెరిగింది. అయితే చివరి మూడు ఓవర్లలో హార్దిక్‌ మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో చెలరేగాడు. అటు పొలార్డ్‌ (15 నాటౌట్‌) సహకరించడంతో 19వ ఓవర్‌లో మ్యాచ్‌ను ముగించారు.


పొలార్డ్‌ దెబ్బ:

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ను ముంబై బౌలర్లు వరుస వికెట్లతో వణికించారు. అయితే మధ్య ఓవర్లలో మార్‌క్రమ్‌, హూడా (28) జోడీ ఆదుకోకపోతే పంజాబ్‌కు వంద పరుగులు కూడా కష్టమయ్యేది. ఓపెనర్లు రాహుల్‌ (21), మన్‌దీ్‌ప (15) తొలి వికెట్‌కు 36 రన్స్‌ అందించారు. ఆరో ఓవర్‌లో మన్‌దీ్‌పను క్రునాల్‌ ఎల్బీగా పంపగా.. ఏడో ఓవర్‌లో రాహుల్‌, గేల్‌ (1)లను పొలార్డ్‌ దెబ్బతీసి పంజాబ్‌కు కోలుకోలేని షాక్‌ ఇచ్చాడు. ఆ వెంటనే సూపర్‌ యార్కర్‌తో పూరన్‌ (2)ను బుమ్రా వెనక్కి పంపాడు. దీంతో 48/4 స్కోరుతో పంజాబ్‌ పరిస్థితి దయనీయంగా మారింది. ఈ సమయంలో మార్‌క్రమ్‌, హూడా (28) క్రీజులో నిలిచి అడపాదడపా బౌండరీలతో స్కోరును పెంచారు. అయితే చక్కగా కుదురుకున్న దశలో 16వ ఓవర్‌లో మార్‌క్రమ్‌ స్వీప్‌ షాట్‌కు ప్రయత్నించి బౌల్డ్‌ అయ్యాడు. దీంతో ఐదో వికెట్‌కు 61 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. చివరి 3 ఓవర్లలో పంజాబ్‌ ఒక్క బౌండరీ కూడా లేకుండా 17 రన్స్‌తోనే సరిపెట్టుకుంది.


స్కోరుబోర్డు

పంజాబ్‌: కేఎల్‌ రాహుల్‌ (సి) బుమ్రా (బి) పొలార్డ్‌ 21; మన్‌దీప్‌ (ఎల్బీ) క్రునాల్‌ 15; గేల్‌ (సి) హార్దిక్‌ (బి) పొలార్డ్‌ 1; మార్‌క్రమ్‌ (బి) చాహర్‌ 42; పూరన్‌ (ఎల్బీ) బుమ్రా 2; హూడా (సి) పొలార్డ్‌ (బి) బుమ్రా 28; హర్‌ప్రీత్‌ (నాటౌట్‌) 14; ఎల్లిస్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 135/6; వికెట్ల పతనం: 1-36, 2-39, 3-41, 4-48, 5-109, 6-123; బౌలింగ్‌: క్రునాల్‌ 4-0-24-1; బౌల్ట్‌ 3-0-30-0; బుమ్రా 4-0-24-2; కుల్టర్‌నైల్‌ 4-0-19-0; పొలార్డ్‌ 1-0-8-2; రాహుల్‌ చాహర్‌ 4-0-27-1.


ముంబై: రోహిత్‌ (సి) మన్‌దీప్‌ (బి) బిష్ణోయ్‌ 8; డికాక్‌ (బి) షమి 27; సూర్యకుమార్‌ (బి) బిష్ణోయ్‌ 0; సౌరభ్‌ తివారి (సి) రాహుల్‌ (బి) ఎల్లిస్‌ 45; హార్దిక్‌ (నాటౌట్‌) 40; పొలార్డ్‌ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 19 ఓవర్లలో 137/4; వికెట్ల పతనం: 1-16, 2-16, 3-61, 4-92; బౌలింగ్‌: మార్‌క్రమ్‌ 3-0-18-0, షమి 4-0-42-1, హర్షదీప్‌ 4-0-29-0, రవి బిష్ణోయ్‌ 4-0-25-2, ఎల్లిస్‌ 3-0-12-1, హర్‌ప్రీత్‌ 1-0-11-0.

Updated Date - 2021-09-29T08:11:29+05:30 IST