బీసీసీఐపై హర్భజన్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-02-04T00:55:22+05:30 IST

గతేడాది క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత హర్భజన్ సింగ్ తరచూ తన కెరియర్‌పై మాట్లాడుతూ సంచలన

బీసీసీఐపై హర్భజన్ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: గతేడాది క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత హర్భజన్ సింగ్ తరచూ తన కెరియర్‌పై మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడిస్తున్నాడు. ఈసారి బీసీసీఐని టార్గెట్ చేశాడు. బీసీసీఐ కొందరు ఆటగాళ్లను వాడుకుని వదిలేస్తోందని ఆరోపించారు. 2011 ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ఆటగాళ్లపై బోర్డు కొంత ఉదారంగా ప్రవర్తించి ఉంటే బాగుండేదని అన్నాడు. భారత క్రికెట్ చరిత్రలో ఇది విషాదకర అధ్యాయమని పేర్కొన్నాడు. 41 ఏళ్ల హర్భజన్ చివరిసారి మార్చి 2016లో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. తన 23 ఏళ్ల కెరియర్‌లో మొత్తంగా 700 వికెట్లు తీసుకున్నాడు. 


‘‘ఆ అధికారులు ఏం చేస్తున్నారో మీకూ తెలుసు. భారత క్రికెట్‌లో ఆ సమయంలో ఏం జరిగిందో కూడా తెలుసు. ఎలాంటి ఆటగాళ్లు ఆడారో, మరికొందరిని ఎందుకు పక్కన పెట్టారో కూడా తెలుసు. మేం అద్భుతంగా ఆడి 2011 ప్రపంచకప్ గెలిస్తే, ఆ తర్వాత మళ్లీ మేమందరం కలిసి ఒక్క మ్యాచ్ కూడా ఎందుకు ఆడలేకపోయాం? అద్భుతంగా ఆడి ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న జట్టు ఆ వెంటనే చెత్త టీం అయిపోయిందా? అని ‘బ్యాక్ స్టేజ్ విత్ బొరియా’ అనే షో కోసం స్పోర్ట్స్ జర్నలిస్ట్ బొరియా మజుందార్‌తో తన యూట్యూబ్ చానల్‌లో మాట్లాడుతూ భజ్జీ ఇలా చెప్పుకొచ్చాడు. 


 ‘‘అప్పుడు 31 ఏళ్లున్న హర్భజన్ సింగ్, 30 ఏళ్ల యువరాజ్, 32 ఏళ్ల వీరేంద్ర సెహ్వాగ్, 29 ఏళ్ల గౌతం గంభీర్ 2011 ప్రపంచకప్ ఆడారు. 2015 ప్రపంచకప్‌లో ఆడేందుకు వీరు పనికిరారా? వీరిని ఒకరి తర్వాత ఒకరిగా ఎందుకు తొలగించారు? వారిని ఎందుకు వాడుకుని వదిలేశారు? ఇది నిజంగా భారత క్రికెట్‌లో విషాదం. ఇప్పుడేం జరుగుతోందన్న విషయం నాకు తెలియదు కానీ, 2011 వరకు మాత్రం చాలామంది నాకు సాయం చేశారు. కొంతమంది వెనక్కి నెట్టారు. అయితే, 2012 తర్వాత నన్ను పూర్తిగా బయటకు విసిరేశారు’’ అని హర్భజన్ వివరించాడు. 


2011 నాటికి తన వయసు 31 సంవత్సరాలని, అప్పటికే 400 వికెట్లు పడగొట్టినట్టు చెప్పాడు. 31 ఏళ్ల కుర్రాడు 400 వికెట్లను రాత్రికి రాత్రే తీయలేడని పేర్కొన్నాడు. తాను కొన్ని గేములు గెలిపించి ఉండొచ్చని, కొన్ని గేముల్లో ప్రదర్శన చెత్తగా ఉండొచ్చని, గేమన్నాక అది సహజమన్నాడు. అదే 400 వికెట్లు తీసిన బౌలర్‌ను లెజెండ్ అంటారని, కానీ ఎలాంటి వివరణ లేకుండానే తనను బయటకు గెంటేశారని హర్భజన్ ఆవేదన వ్యక్తం చేశాడు.


ఒక్క సెలక్టర్ కానీ, ఒక్క బీసీసీఐ అధికారి కానీ తన సమాధానం చెప్పడానికి రాలేదన్నాడు. చివరికి కెప్టెన్ కూడా ఏం జరుగుతోందో తనకే తెలియడం లేదని చెప్పాడని గుర్తు చేసుకున్నాడు. అప్పుడేం జరిగింతో తెలియదు కానీ ఓ పెద్ద ఆటగాడికే అలా జరిగితే ఎలాంటి ఆటగాడికైనా అలాంటిది జరగొచ్చని మాత్రం స్పష్టమైందని హర్భజన్ పేర్కొన్నాడు. 

Updated Date - 2022-02-04T00:55:22+05:30 IST