Abn logo
Jul 6 2020 @ 03:26AM

సాధన ఆపలేదు

రోజుకు ఐదారు గంటలు శ్రమిస్తున్నా


హనుమ విహారి.. ప్రస్తుత భారత జట్టులో ఉన్న ఏకైక తెలుగు క్రికెటర్‌. టెస్టుల్లో టీమిండియాకు నమ్మదగ్గ మిడిలార్డర్‌ ఆటగాడిగా ఎదుగుతున్న విహారి లాక్‌డౌన్‌లోనూ విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నాడు. టెస్టు ఆటగాడిగా ముద్ర పడినా అవకాశాలొస్తే వన్డే, టీ20ల్లోనూ సత్తా చాటుతానంటున్నాడు. వచ్చే రెండు.. మూడేళ్లలో ప్రపంచంలోనే బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకుంటానంటున్న విహారితో ఆంధ్రజ్యోతి ముచ్చటించింది. ఆ విశేషాలేంటో అతని మాటల్లోనే.. 


ప్రపంచంలోనే  అత్యుత్తమ ఆటగాడినవుతా

నా పదిహేనేళ్ల కెరీర్‌లో క్రికెట్‌ గ్రౌండ్‌కు ఇన్నిరోజులు దూరంగా ఉండడం ఇదే తొలిసారి. లాక్‌డౌన్‌ విధించిన తొలినాళ్లలో ఇంటికే పరిమితమవడంతో బరువు పెరిగా. కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా లాక్‌డౌన్‌ గడువు పెరుగుతుండడంతో ఇంటివద్దే ప్రాక్టీస్‌ చేయాలని నిర్ణయించుకున్నా. ముందుగా ఫిట్‌నెస్‌ లెవల్స్‌ పెంచుకోవడానికి అవసరమైన జిమ్‌ పరికరాలను కొనుగోలు చేశా. డైట్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కసరత్తులు ప్రారంభించా. మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ ప్రమాణాలకు చేరుకున్నా.

ఆ బంతులతో సాధన..: ఇంటి వద్దనే నెట్స్‌ ఏర్పాటు చేసుకొని ఐదారు గంటలు సాధన చేస్తున్నా. మధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకుంటున్నా. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటన ఉంది. ఆ సిరీస్‌ జరుగుతుందా? లేదా? అనే మీమాంస కొనసాగుతున్నప్పటికీ సన్నాహకాలైౖతే మొదలు పెట్టా. అక్కడి పిచ్‌లపై పచ్చిక ఎక్కువ. బంతి ఊహించని రీతిలో బౌన్స్‌, స్వింగ్‌ అవుతుంది. వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు బాగా బౌన్స్‌ అయ్యే సింథటిక్‌ బంతులతో సాధన చేస్తున్నా.

‘ది బెస్ట్‌’ అనిపించుకోవాలని..: టీమ్‌ మేనేజ్‌మెంట్‌, జట్టు సభ్యులు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేస్తున్నా. వారి అండతో నా ఆటను ఇప్పుడున్న దానికంటే మరింత మెరుగు పర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా. ఆసీస్‌ పిచ్‌లపై  పరుగులు చేయడం అంత సులువు కాదని తెలుసు. అయితే, ఆస్ట్రేలియా,  న్యూజిలాండ్‌, వెస్టిండీ్‌సలో ఆడిన అనుభవంతో పరిస్థితులను అర్థం చేసుకొని ఆడగలిగే సామర్థ్యం నాకుంది. అక్కడ అవసరానికి తగ్గట్టు గేర్‌ మార్చి ఆడాలి. ఆ టూర్‌లో అత్యధిక పరుగుల వీరునిగా నిలిచి మ్యాచ్‌లను గెలిపించాలనే తపనతో కఠోరంగా ప్రాక్టీస్‌ చేస్తున్నా. వచ్చే రెండు..మూడేళ్లలో ప్రపంచంలోనే ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకోవాలన్నది నా లక్ష్యం. విదేశీ పిచ్‌లపై రాణించేందుకు కౌంటీల్లో ఆడాలనుకున్నా. ఈ ఏడాది ఇంగ్లిష్‌ కౌంటీ చాంపియన్‌షి్‌పలో ఓ ప్రముఖ జట్టు తరఫున ఆడేందుకు కాంట్రాక్టు కూడా కుదిరింది. కానీ, కరోనా కారణంగా అది రద్దయింది. ఇక, జట్టుగా టెస్టు చాంపియన్‌షి్‌పను కైవసం చేసుకోవాలనుంది.

వాళ్లను ఎదుర్కోవడం సవాలే..: న్యూజిలాండ్‌ పేస్‌ తురుపుముక్క టిమ్‌ సౌథీ, వెస్టిండీస్‌ పేసర్‌ కీమర్‌ రోచ్‌ను ఎదుర్కోవడం సవాల్‌ అనిపిస్తుంది. ఈ ఇరువురు బౌలర్లు తమ నైపుణ్యాలను చక్కగా ఉపయోగిస్తారు. కివీస్‌ పిచ్‌లపై సౌథీ బౌలింగ్‌లో ఆడడం మజా అనిపిస్తుంది. రోచ్‌ కొన్ని యాంగిల్స్‌లో వేసే బంతులు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. వీరితో పాటు ఇంగ్లండ్‌ పిచ్‌లపై జేమ్స్‌ ఆండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో ఆడడాన్ని ఆస్వాదించా.


పెళ్లయ్యాక ఎలా ఉందంటే..

పెళ్లికి ముందు నుంచి నేను, నా భార్య ప్రీతి మంచి స్నేహితులం. అది పెళ్లయ్యాక కూడా అలాగే కొనసాగుతోంది. నా జీవితంలో ఆమెది ఓ ప్రత్యేక స్థానం. మా పెళ్లయి ఇటీవలే ఏడాది పూర్తయింది. ఒకప్పుడు అమ్మ, క్రికెటే ప్రపంచం. ఇప్పుడు మరికొన్ని బాధ్యతలు తోడయ్యాయి.

హైదరాబాద్(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి)

Advertisement
Advertisement
Advertisement