Abn logo
Aug 2 2020 @ 11:42AM

‘‘ఎప్పుడూ నిన్ను ఓడిపోనివ్వను నాన్నా’’

ఆకాశంలో ఎగురుతున్న విమానాలు, హెలికాప్టర్లను చూసి ‘‘అన్నయ్యా... నేను కూడా పైలట్‌ అవుతా’’ అంది చిన్నారి గుంజన్‌ సక్సేనా. ‘‘అమ్మాయిలు పైలెట్లు కాలేరు’’... అన్నయ్య సమాధానంతో ఆ పసిమనసులో ఎన్నో ఆలోచనలు. నాన్న, అన్నయ్య ఆర్మీలో పనిచేస్తున్నారు. ‘‘అన్నయ్యను ఆర్మీలో చేర్చావు కదా... నేనెందుకు పైలెట్‌ కాలేను’’ నాన్నకు ఆమె సూటి ప్రశ్న. కూతురుతో పాటు పెరుగుతున్న పైలట్‌ ఆసక్తి ఆ తండ్రిని ఆలోచనల్లో పడేసింది. కూతురి ఆశకు బాసటగా నిలవాలనుకున్నాడు. 


‘‘ప్లేన్‌ నడుపుతున్నది మగవాళ్లా, ఆడవాళ్లా అనేది ముఖ్యం కాదు. ఇద్దర్నీ ‘పైలట్‌’ అనే పిలుస్తారు’’... తండ్రి చెప్పిన ఆ మాటలు గుంజన్‌ సక్సేనా ఆశలకు ఊపిరిపోశాయి. ఇక అప్పటి నుంచి ఆమె ఆకాశమే హద్దుగా కలలు కన్నది. ‘‘ఎయిర్‌ ఫోర్స్‌లో జాయిన్‌ కావాలంటే సైనికుడు అవ్వాలి. లేదంటే ఇంటికెళ్లి వంట చేసుకో’’, ‘‘నువ్వు బలహీనంగా ఉన్నావు... డిఫెన్స్‌కు పనికిరావు’’, ‘‘ఇక్కడ ఆడవాళ్లకు ప్రత్యేకంగా టాయిలెట్లు ఉండవు. ఈ ప్రదేశం (ఎయిర్‌ఫోర్స్‌ శిక్షణ సంస్థ) ఆడవాళ్ల కోసం తయారయ్యింది కాదు’’, ‘‘పది మంది ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్లలో నువ్వొక్కదానివే అమ్మాయివి’’... ఇలా అడుగడుగునా ఆమె కలలకు ఎన్నో అవమానాలు. కానీ గుంజన్‌ భరోసా, ధైర్యం ఒక్కరే... నాన్న. ‘‘ఎవరైతే కష్టపడే తత్వం చేయి వదలరో, అదృష్టం ఎప్పటికీ వారి చేయి వదలదు..’’ నాన్న నోటి నుంచి వచ్చిన ఆ మాటలు ఆమెకు అంతులేని ఆత్మవిశ్వాసాన్ని అందించాయి. ‘‘ఎప్పుడూ నిన్ను ఓడిపోనివ్వను నాన్నా’’ చెమర్చిన కళ్లతో, గుండెనిండా ధైర్యంతో ముందుకు సాగింది. ‘కార్గిల్‌’ యుద్ధక్షేత్రంలో పోరాడిన ఏకైక సాహస మహిళగా, ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ తొలి మహిళా పైలట్‌గా గుంజన్‌ సక్సేనా చరిత్రలో నిలిచిపోయింది. శనివారం (ఆగస్టు1) విడుదలైన ‘గుంజన్‌ సక్సేనా... ది కార్గిల్‌ గర్ల్‌’ మూవీ ట్రైలర్‌లోని భావోద్వేగాలివి. ‘భారతీయ వాయుసేన’ (ఐఎఎఫ్‌) అధికారిణి ‘గుంజన్‌ సక్సేనా’ బయోపిక్‌ ఇది.  


ఎవరీ ‘గుంజన్‌ సక్సేనా’?

లక్నోలోని ఆర్మీ కుటుంబంలో పుట్టిన గుంజన్‌ సక్సేనా ఢిల్లీ యూనివర్శిటీ నుంచి డిగ్రీ పట్టా పొందిన తర్వాత ఢిల్లీ ఫ్లయింగ్‌ క్లబ్‌లో చేరింది. ఆమెకు చిన్నప్పటి నుంచి పైలట్‌ కావాలనే కోరిక ఉండేది. 1994లో ‘ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌’ తొలి మహిళా పైలట్‌ బ్యాచ్‌లో గుంజన్‌ ఒకరు. ఆమెకు మొదటి పోస్టింగ్‌ ఉధమ్‌పూర్‌ (జమ్మూ కశ్మీర్‌)లో ఇచ్చారు. అక్కడే ఆమె మహిళగా ఎంతో వివక్షను ఎదుర్కొంది. కార్గిల్‌ యుద్ధం జరిగినప్పుడు ఆమె వయసు 25 సంవత్సరాలు మాత్రమే. కార్గిల్‌ యుద్ధంలో మరణించిన, గాయపడిన సైనికులను హెలికాప్టర్‌ ద్వారా యుద్ధరంగం నుంచి తీసుకొచ్చే బాధ్యతను తీసుకుని విజయవంతంగా పూర్తి చేసింది. దేశ అత్యున్నత పురస్కారమైన ‘శౌర్యచక్ర’ అవార్డును అందుకున్న తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఏడేళ్ల పాటు హెలికాప్టర్‌ పైలట్‌గా సేవలందించి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది. 


హెలికాప్టర్‌ పైలట్‌గా ఎన్నో సాహసాలు చేసిన గుంజన్‌ సక్సేనా జీవితకథ ఆధారంగా ఆమె పేరుతోనే దర్శకుడు శరణ్‌ శర్మ ఈ సినిమా తీశారు. ఇందులో టైటిల్‌ రోల్‌ను శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ చేయడం విశేషం. ఆమెతో పాటు పంకజ్‌ త్రిపాఠి, అంగద్‌ బేడీ, వినీత్‌ కుమార్‌ సింగ్‌, మానవ్‌ విజ్‌, ఆయేశా రజా తదితరులు నటించారు. కరోనా కారణంగా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 12న విడుదలవుతోంది.Advertisement
Advertisement
Advertisement