గల్ఫ్‌ ప్రవాసీల్లో కరోనా కలత

ABN , First Publish Date - 2021-05-04T11:09:02+05:30 IST

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో స్వదేశంలోని తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల యోగక్షేమాల పట్ల విదేశాల్లో ఉంటున్న ప్రవాసీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలతో పాటు.. హైదరాబాద్‌ నగరంలోని కొన్ని కుటుంబాల్లోని మగవాళ్లందరూ గల్ఫ్‌ దేశాల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

గల్ఫ్‌ ప్రవాసీల్లో కరోనా కలత

స్వదేశంలోని కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ఆందోళన

కొన్ని కుటుంబాలలోని మగవాళ్లందరూ గల్ఫ్‌లోనే

ఆస్పత్రులలో కుటుంబ సభ్యులు, వృద్ధ తల్లిదండ్రులు

విమానాల బంద్‌తో ప్రవాసీల ఇబ్బందులు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో స్వదేశంలోని తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల యోగక్షేమాల పట్ల విదేశాల్లో ఉంటున్న ప్రవాసీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలతో పాటు.. హైదరాబాద్‌ నగరంలోని కొన్ని కుటుంబాల్లోని మగవాళ్లందరూ గల్ఫ్‌ దేశాల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయా కుటుంబాల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారిని ఆస్పత్రికి తీసుకెళ్లడం కష్టతరంగా మారింది. పరిస్థితి విషమించి ఎవరైనా చనిపోతే విమానాల బంద్‌ కారణంగా కడచూపునకు కూడా నోచుకోలేని దుస్థితి నెలకొంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గంజ్‌ ప్రాంతానికి చెందిన ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ముళ్లలో ఇద్దరు సౌదీ అరేబియా, యుఈఏలలో పని చేస్తున్నారు. జగిత్యాలలో ఉన్న వారి చిన్న తమ్ముడు, తల్లికి కరోనా సోకింది. చిన్నతమ్ముడి భార్య.. తన భర్త, అత్తను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ బెడ్లు, ఆక్సిజన్‌ కొరత కారణంగా ఆమె పడరాని కష్టాలు పడింది. విషయం తెలిసిన గల్ఫ్‌లో ఉన్న అన్నదమ్ములు.. చలించిపోయి కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు. విమానాల బంద్‌ కారణంగా స్వదేశానికి వెళ్లలేకపోయారు. ఆస్పత్రికి వెళ్లి తమ తల్లిని, తమ్ముణ్ని పరామర్శించాలని బంధుమిత్రులను ప్రాధేయపడినా ఎవరూ వెళ్లలేదు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చేరిన రెండో రోజు ఈనెల 28న వారి తల్లి మరణించింది. తమ్ముడు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. తల్లి మరణించిన విషయం అతనికి చెప్పలేదు.  


డబ్బు పంపించినా తీసుకోలేని దుస్థితి

సౌదీ అరేబియాలో ఉంటున్న నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రవాసీయుడి కుటుంబ సభ్యులు మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ పెద్దాస్పత్రిలో చేరారు. అవసరమైన డబ్బును ఇక్కడ ఉంటున్న కొడుకు పంపించగా, ఇంట్లోని వారందరూ ఆస్పత్రిలో ఉండడంతో కనీసం బ్యాంకుకు వెళ్లి డబ్బు తీసుకోరాలేని దీనస్థితి. హైదరాబాద్‌ సంతో్‌షనగర్‌ ప్రాంతానికి ఒక కుటుంబానికి చెందిన వారందరూ గల్ఫ్‌లో ఉంటుండగా.. ఒక సోదరుడు, వృద్ధురాలైన తల్లి మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. సోదరుడు కరోనాతో ఆస్పత్రిలో చేరడంతో.. అతణ్ని చూసేవారెవరూ లేకపోవడంతో గల్ఫ్‌లోని అన్నదమ్ములు అల్లాడిపోతున్నారు. మరో కేసులో కరీంనగర్‌ జిల్లా కేంద్రం మంకమ్మతోటకు చెందిన కుటుంబం రియాద్‌ నగరంలో ఉంటుండగా.. అందరికీ కరోనా సోకింది. భార్య నిండు గర్భిణి. కరోనా సోకిన ఆమె ప్రసవం గూర్చి ఒకవైపు ఆందోళన ఉండగా.. మరోవైపు.. ఆక్సిజన్‌ స్థాయి పడిపోవడంతో భర్తను ఆస్పత్రిలో చేర్చారు. విమానాల బంద్‌ కారణంగా ప్రసవం కోసం ఆ గర్భిణి స్వదేశానికి వెళ్లలేకపోయింది. కరోనా కల్లోలం రేపుతున్న ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్‌కు వచ్చిన  ప్రవాసీలు ఎక్కువగా ఉన్నందున.. తమ కుటుంబ సభ్యులు, ఆత్మీయుల ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు వాట్సాప్‌ సందేశాల ద్వారా తెలుసుకుంటున్నారు. ఎప్పుడు ఎలాంటి సమాచారం వినాల్సి వస్తుందోనని భయంతో గడుపుతున్నామని కోరుట్లకు చెందిన ఒక ప్రవాసీ ఆందోళన వ్యక్తం చేశాడు.

Updated Date - 2021-05-04T11:09:02+05:30 IST