Advertisement
Advertisement
Abn logo
Advertisement

మంచుకొండ లాంటి మంచి మనిషి

ఉత్తరాఖండ్ ప్రజల శ్రేయస్సు, దేశవ్యాప్తంగా పోలియో నిర్మూలన, దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు అవిస్మరణీయమైన కృషి చేసిన సివిల్ సర్వీస్ అధికారి దేశిరాజు కేశవ్. సర్వేపల్లి రాధాకృష్ణన్ మనుమడు అయిన కేశవ్ (1955–2021) పరిపూర్ణ నెహ్రూవియన్ భారతీయుడు. మరింత గౌరవప్రదమైన జీవితాన్ని ఎలా జీవించాలో తన పని, ప్రవర్తన ద్వారా కేశవ్ తనకు తెలిసినవారందరికీ నేర్పాడు. ప్రభుత్వాధికారిగా, విద్వజ్ఞుడుగా, ఉపాధ్యాయుడుగా, కుటుంబీకుడుగా, స్నేహితుడుగా ఆయన లాంటివారు మరొకరు ఉండరు.


పరోపకారపరాయణులను గౌరవించకుండా ఎలా ఉండగలం? నేను అమితంగా గౌరవించే సివిల్ సర్వెంట్ ఇటీవల కీర్తిశేషుడయ్యారు. ఈ కాలంలో, 66 ఏళ్ల వయస్సులో, అందునా కొవిడ్-–19 బాధితుడు కాకుండానే మరణించడమంటే చాలా తొందరగా ఆవలి తీరాలకు వెళ్ళిపోవడమే కదా. సమాజం, విద్వత్తు సమున్నతికి మరింత దోహదం చేసే దశలో ఆ గౌరవనీయుడు విగతుడు కావడం బాధాకరం. బాధాకరమా? కాదు. ఎందుకంటే ఆయన కృషి, అది జరిగిన తీరు నాకు తెలుసు గనుక ఆ కీర్తిశేషుని అకాల మరణానికి విచారించడానికి బదులు, సంపూర్ణంగా ఆదర్శప్రాయమైన ఆ ఉదాత్తుని జీవితాన్ని కీర్తించి ఆవాహన చేసుకోదలిచాను. 


దేశిరాజు కేశవ్‌ను నేను మొట్టమొదట 1988లో కలుసుకున్నాను. ఉత్తరాఖండ్‌లోని పరస్పర స్నేహితుల ద్వారా ఆయన గురించి విన్నాను. కేంబ్రిడ్జి విద్యాధికుడు అయిన ఈ తెలుగువాడు హిమాలయ పర్వతప్రాంత ప్రజల ఆత్మబంధువు అవడం మా మిత్రులను ఆశ్చర్యపరుస్తుండేది. 


ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు కేశవ్ ఆ రాష్ట్ర ఐఏఎస్ కేడర్‌లో చేరేందుకు మొగ్గు చూపారు. నేనూ డెహ్రాడూన్‌లో పుట్టి పెరిగిన వాణ్ణి గనుక, కేశవ్ అక్కడే ఉండడంతో, తరచు ఉత్తరాఖండ్ సందర్శిస్తుండేవాణ్ణి. మేము ఒకసారి తెహ్రి పట్టణానికి వెళ్ళాం. తెహ్రీడ్యాంకు వ్యతిరేకంగా సుందర్ లాల్ బహుగుణ నిరాహారదీక్ష నిర్వహించిన ప్రదేశానికి కూడా వెళ్ళాం. గఢ్వాల్ హిమాలయాలలోని దట్టమైన దేవదారు చెట్ల అడవిని కూడా చూశాం. డెహ్రాడూన్‌లో అటు అధికార వర్గాలలోనూ, ఇటు సామాన్య ప్రజలలోనూ కేశవ్ పట్ల వ్యక్తమయ్యే విశేష ఆదరాభిమానాలను నేను స్వయంగా చూశాను. తన బాధ్యతల పట్ల సమగ్ర అవగాహన, కర్త వ్యపాలనలో పరిపూర్ణ నిజాయితీ, ఇతరులతో వ్యవహరించడంలో నిరాడండరత కేశవ్‌ను అందరి అభిమానానికి పాత్రుణ్ణి చేసింది. 


1998లో కేశవ్, నేను మధ్యప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాలలో పర్యటించాం. సుప్రసిద్ధ మానవశాస్త్రవేత్త వెరియర్ ఎల్విన్ నివశించిన గ్రామాన్ని సందర్శించాం. ఆ పర్యటనలో చివరిరోజు రాత్రి అమర్‌కంటక్ అనే ఊరులో రోడ్డు పక్క హోటల్‌లో భోజనం చేశాం. అక్కడ ఒక కస్టమర్ వదిలివెళ్లిన ఒక హిందీ దినపత్రికను చదువుతూ ఎమ్ఎస్ సుబ్బులక్ష్మికి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిన విషయాన్ని కేశవ్ తెలుసుకున్నారు. అనుప్పుర్ నుంచి ఢిల్లీకి సుదీర్ఘ రైలు ప్రయాణంలో, తాను హాజరయిన సుబ్బులక్ష్మి సంగీత కచేరీల గురించి కేశవ్ వివరంగా చెప్పారు (ఆయన మొట్టమొదట ఎనిమిది సంవత్సరాల వయసులో ముంబైలోని షణ్ముఖానంద హాలులో సుబ్బులక్ష్మి గానాన్ని ప్రత్యక్షంగా విన్నారు). ఆమె గానంలో తాను విన్న ప్రతి కీర్తన గురించి ఆయన చెప్పారు. 


ఉత్తరాఖండ్‌లో చాలా సంవత్సరాలు పనిచేసిన తరువాత ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శిగా కేశవ్ నియమితులయ్యారు. ఈ బాధ్యతల్లో ఆయన, పోలియో నిర్మూలన, దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు అవిస్మరణీయమైన కృషి చేశారు. ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి అయిన తరువాత దేశంలో మానసిక ఆరోగ్యభద్రత విషయంలో కూడా ఆయన కృషి ప్రజల, వైద్యనిపుణుల ప్రశంసలు పొందింది. భారత వైద్యమండలిలో అవినీతిపై ఆయన రాజీలేని పోరు చేశారు. దీనితో పాటు పొగాకు వ్యాపారవర్గాలకు వ్యతిరేకంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా మంది ‘పెద్దల’ ఆగ్రహానికి గురయ్యాయి. ఫలితంగా యూపీఏ ప్రభుత్వం ఆయన్ని ఆరోగ్య శాఖ నుంచి వేరే శాఖకు బదిలీ చేసింది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేశవ్ లాంటి నిజాయితీపరులు కీలక శాఖల్లో కీలక బాధ్యతల్లో ఉంటే ఎన్నికల నిధుల సేకరణ కష్టసాధ్యమవుతుందనే భావనతోనే ఆయనను ఆరోగ్య శాఖ నుంచి బదిలీ చేశారు. 


క్రమంగా కేశవ్, నేను సన్నిహితులమయ్యాం. నిజాయితీపరుడయిన అధికారిగానే కాకుండా ఒక మంచి మనిషిగా కూడా ఆయన పట్ల నా గౌరవం ఇనుమడించింది. సహోదరులు, తోబుట్టువుల శ్రేయస్సు పట్ల ఆయన శ్రద్ధాసక్తులు ఆదర్శప్రాయమైనవి. శాస్త్రీయ సంగీతం పట్ల ఆయన అవగాహన ఎవరినైనా అబ్బురపరుస్తుంది. మధ్యప్రదేశ్‌లో పర్యటన సందర్భంగా సుబ్బులక్ష్మి సంగీత జీవితచరిత్ర రాయాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు నాకు చెప్పారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ వారాంతంలో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీలో సుబ్బులక్ష్మి జీవితం, సంగీతానికి సంబంధించిన సమాచార సేకరణకు ఆయన పూనుకున్నారు. వివిధ సమయాలలో వివిధ ప్రదేశాలలో సుబ్బులక్ష్మి సంగీత కచేరీలకు సంబంధించి ఆయన చాలా సమాచారాన్ని సమకూర్చుకున్నారు. మన దేశంలో లభ్యం కాని వివరాల కోసం సొంత ఖర్చుపై లండన్ వెళ్ళి బ్రిటిష్ లైబ్రరీలో మరెంతో అదనపు సమాచారాన్ని సేకరించారు. 


దశాబ్దాలుగా ఇలా కష్టపడి సేకరించిన సమాచారం ఆధారంగా ఉద్యోగవిరమణ అనంతరం ఆయన సుబ్బులక్ష్మి సంగీత జీవితచరిత్రను రచించారు. ‘ఆఫ్ గిఫ్టెడ్ వాయిస్: ది లైఫ్ అండ్ ఆర్ట్ ఆఫ్ ఎమ్ఎస్ సుబ్బులక్ష్మి’ శీర్షికతో కేశవ్ పుస్తకం ఈ ఏడాది తొలినాళ్ళలో ప్రచురితమయింది. గొప్ప విద్వత్‌కృషి ఫలితంగా వెలుగుచూసిన పుస్తకమది. భారతీయ సంగీతవేత్తలపై వెలువడిన రెండు అత్యుత్తమ గ్రంథాలలో కేశవ్ పుస్తకం ఒకటి. మరొకటి ఆలీవర్ క్రాస్కే రచన ‘ఇండియన్ సన్: ది లైఫ్ అండ్ మ్యూజిక్ ఆఫ్ రవిశంకర్’. విశ్రాంత జీవితంలో కేశవ్ తన వృత్తిగత ఆసక్తులకు సంబంధించి ‘హీలర్స్ ఆర్ ప్రిడేటర్స్?: హెల్త్‌కేర్ కరప్షన్ ఇన్ ఇండియా’ అనే పుస్తకానికి సహ సంపాదకుడుగా వ్యవహరించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. 


కేశవ్ మేధోకృషి ప్రశంసనీయమైనది. సంగీతంతో సహా వివిధ అంశాలపై ఆయనకు ఉన్న ప్రగాఢ అవగాహన నాకు లేనందుకు అసూయ చెందుతున్నాను. మేమిరువురమూ ‘నెహ్రూవియన్ భారతీయులు’గా భావించుకోవడానికి ఇష్టపడతాం. సమ్మిళిత, సాంస్కృతిక బహుళత్వవాద భారతదేశ నిర్మాణానికి మన ప్రపథమ ప్రధానమంత్రి చేసిన అవిరళ కృషి మాకు ఒక నిత్య స్ఫూర్తి. కేశవ్ నాకంటే కూడా మరింత ఎక్కువగా నెహ్రూవియన్ భారతీయుడు. ఎందుకంటే భారతదేశ సమున్నత సాంస్కృతిక, భాషా సమున్నతిపై ఆయనకు లోతైన అవగాహన ఉంది. శాస్త్రీయ సంగీతంతో పాటు మన ప్రాచీన సాహిత్య నిధులపై కూడా కేశవ్‌కు అపార పరిజ్ఞానమున్నది. తెలుగు, తమిళ్, హిందీ, ఆంగ్ల భాషలలో ఆయన ధారాళంగా మాట్లాడగలుగుతారు. సంస్కృతంలో కూడా ఆయనకు మంచి ప్రవేశమున్నది. ఒక్క తెలుగు మినహా మిగతా భాషలు అన్నిటినీ ఆయన చదవగలుగుతారు. తన తుదిరోజుల్లో ఆయన మాతృభాష తెలుగు లిపిని నేర్చుకోవడం ప్రారంభించారు. నాదబ్రహ్మ త్యాగరాజుపై పరిశోధనకుగాను తెలుగుభాషలో చదవడాన్ని నేర్చుకునేందుకు ఆయన పూనుకున్నారు. దురదృష్టవశాత్తు మరణం కేశవ్ కృషిని శాశ్వతంగా నిలిపివేసింది. 


 కేశవ్ దేశిరాజు హిందూత్వను అసహ్యించుకుంటారు. ఆయన అర్థం చేసుకున్న, ఆచరించిన హిందూధర్మం మానవతా పరిపూర్ణమైనది, కరుణశీలమైనది, తాత్త్విక లోతులు ఉన్నది. మరి ఈ గంభీర భావధార, ఇప్పుడు మన వీథుల్లో వీర విహారం చేస్తున్న స్వయం నియమిత హిందూధర్మ పరిరక్షకులకు అర్థమవుతుందా? భారతదేశపు నాగరికతా విలువలు, మన ఆచార సంప్రదాయాలను వికృతం చేస్తున్న విషయాలపై కేశవ్‌కు మంచి అవగాహన ఉంది. ‘మన గణతంత్ర రాజ్య సంస్థాపక విలువలు ఆయనలో సంపూర్ణంగా మూర్తీభవించాయని’ కేశవ్‌కు ఒక యువ భారతీయుడు అర్పించిన నివాళిలో సంపూర్ణ సత్యం ఉంది.


కేశవ్ మాతామహుడు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఒక మహోన్నతుడి మనవడిననే అభిజాత్యం కేశవ్‌లో ఏ కోశానా ఉండేదికాదు. చాలా మందికి ఆయన ఫలానా వారి మనవడు అనే విషయం కూడా తెలియదు. తనకుతానుగానే ఉండడం కేశవ్ స్వతస్సిద్ధ లక్షణం. కేశవ్ తన తాతగారి జయంతి సెప్టెంబర్ 5నే మరణించడం ఒక యాదృచ్ఛిక విశేషం. మరింత గౌరవప్రదమైన జీవితాన్ని ఎలా జీవించాలో తన పని, ప్రవర్తన ద్వారా కేశవ్ తనకు తెలిసిన వారందరికీ నేర్పాడు. మరింత ఆసక్తికరమైన జీవితాన్ని ఎలా జీవించాలో కూడా ఆయన తరచు బోధించేవాడు. నా పరిచయస్తులలో కేశవ్ అత్యంత ఆదర్శప్రాయ భారతీయుడు. ప్రభుత్వాధికారిగా, విద్వజ్ఞుడుగా, ఉపాధ్యాయుడుగా, కుటుంబీకుడుగా, స్నేహితుడుగా ఆయన లాంటివారు మరొకరు ఉండరు.


రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Advertisement
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే మరిన్ని...