పన్నులా మొదలై పేరాశలా మారిన జీఎస్టీ

ABN , First Publish Date - 2022-08-03T06:29:46+05:30 IST

తాజాగా కేంద్ర ప్రభుత్వం బియ్యం, గోధుమ పిండి, గోధుమ రవ్వ, ఇడ్లి రవ్వ వంటి ఆహార పదార్థాలకు ఐదు శాతం జిఎస్‌టి(గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌) విధిస్తూ ఉత్తర్వు జారీ చేయడం...

పన్నులా మొదలై పేరాశలా మారిన జీఎస్టీ

తాజాగా కేంద్ర ప్రభుత్వం బియ్యం, గోధుమ పిండి, గోధుమ రవ్వ, ఇడ్లి రవ్వ వంటి ఆహార పదార్థాలకు ఐదు శాతం జిఎస్‌టి(గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌) విధిస్తూ ఉత్తర్వు జారీ చేయడం ప్రజలను మోసం చేయడమే అవుతుంది. భారతదేశంలో తొలిగా 2017లో జిఎస్‌టి ప్రవేశపెడుతున్నప్పుడు ఆహార పదార్థాలపై జిఎస్‌టి ఉండదని అందువల్ల కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పింది. కాని అందుకు విరుద్ధంగా జిఎస్‌టి విధించింది. అయితే లూజుగా కొనుగోలు చేస్తే జిఎస్‌టి ఉండదని కేంద్రప్రభుత్వ ఆర్థికశాఖ చిలక పలుకులు పలుకుతోంది. ఇది ప్రజల్ని పరోక్షంగా మోసం చేయడమే అవుతుంది. ఎందుకంటే హోల్‌సేల్‌ వ్యాపారులు మిల్లర్ల నుంచి వందల కిలోల్లో లేదా టన్నుల చొప్పున ఆహార పదార్థాలు కొనుగోలు చేస్తారు. అంతపెద్ద మొత్తంలో ఆహార పదార్థాలు లూజుగా రవాణా చేయడం సాధ్యం కాదు. అందువల్ల వాటిని పాలిథిన్‌, ప్లాస్టిక్ బ్యాగ్‌లు లేదా గోతాలతోనే కొనుగోలు చేస్తారు. అంటే ఆర్థికశాఖ సెలవిచ్చినట్టు హోల్‌సేల్‌ వ్యాపారులు జిఎస్‌టి చెల్లించాల్సిందే. జిఎస్‌టితో కొనుగోలు చేసిన వ్యాపారులు రిటైల్‌గా అమ్మే సమయంలో (లూజ్‌గా అమ్మినా) తాను చెల్లించిన జిఎస్‌టిని కలుపుకునే రిటైల్‌ ధర నిర్ణయించి సాధారణ ప్రజలకు అమ్ముతారు. అంటే ఆహార పదార్థాలను లూజుగా కొనుగోలు చేసినా సామాన్య ప్రజలపై పరోక్షంగా జిఎస్‌టి భారం పడుతుంది.


జిఎస్‌టి విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభం నుంచి మాయమాటలు చెబుతూనే ఉంది. ‘ఒకే దేశం ఒకటే పన్ను’ అనే నినాదంతో జిఎస్‌టి వసూలు చేయడం ప్రారంభించింది. ప్రజలు నిజమే అనుకొని ఇకపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరుగా పన్నులు వసూలు చేయవని, ఒక వస్తువుకు ఒక పన్ను మాత్రమే ఉంటుందని భావించారు. కాని వాస్తవానికి వస్తే కేంద్రప్రభుత్వం వేరుగా, రాష్ట్ర ప్రభుత్వాలు వేరుగా జిఎస్‌టి విధిస్తూ ప్రజలపై మోయలేని భారాలను వేస్తూ ఖజానా నింపుకొంటున్నాయి. జిఎస్‌టి ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లభిస్తున్న ఆదాయం అనూహ్యంగా పెరుగుతూ ఉండటమే అందుకు నిదర్శనం. జిఎస్‌టి ప్రారంభించిన మొదటి సంవత్సరం అంటే 2017–18 సంవత్సరంలో జిఎస్‌టి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి 7.19 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం లభించింది. రెండో సంవత్సరంలో ఆ మొత్తం 11.47 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేసినా, వాస్తవంలో అంచనాలకు మించి 13.71 లక్షల కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఇక 2020–21వ సంవత్సరంలో ఆదాయం 11,36,805 కోట్ల రూపాయలకు చేరింది. ఈ ఆదాయంలో జిఎస్‌టి పరిధిలో లేని పెట్రోలియం, ఆల్కాహాల్‌ ఉత్పత్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కలప లేదు. ఆదాయం ఎప్పటికప్పుడు పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆశ కూడా ఇంకా ఇంకా పెరుగుతోంది.


జిఎస్‌టి విధానం ప్రవేశపెట్టే సమయంలో పన్నులు మొత్తంగా నాలుగు శ్లాబ్‌లలో అంటే ఐదు శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం ఉంటుందని చెప్పారు. ఆహార సంబంధమైన, ఆరోగ్య సంబంధమైన నిత్యావసర ఉత్పత్తులపై తక్కువగాను, టెలివిజన్‌, ఫ్రిజ్‌, ఏసీ మిషన్‌ వంటి లగ్జరీ ఉత్పత్తులపై గరిష్టంగా 28 శాతం వరకు విధిస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా ఆహార ఉత్పత్తులపై ఎటువంటి పన్నులు ఉండవని, ప్రస్తుతం 100 నుంచి 150 శాతం వరకు పన్నులు విధిస్తున్న పెట్రోలియం, ఆల్కాహాల్‌ ఉత్పత్తులను కూడా క్రమంగా జిఎస్‌టి పరిధిలోకి తీసుకు వస్తామని చెప్పుకొచ్చారు. కానీ, అందుకు విరుద్ధంగా ఆహార పదార్థాలపై కూడా పన్నులు విధించడం ప్రారంభించారు. ఇక పెట్రోలియం, ఆల్కాహాల్‌ ఉత్పత్తులను జిఎస్‌టి పరిధిలోకి తీసుకు వచ్చే అంశాన్ని కనీసం ప్రస్తావించడం కూడా లేదు. ప్రస్తుతం పెట్రోలియం, ఆల్కాహాల్‌ ఉత్పత్తుల ధరలు బడుగుజీవుల నడ్డి విరుస్తున్నాయి. నేడు పట్టణ, నగర ప్రాంతాలలో జీవించే సగటు వ్యక్తికి ద్విచక్రాల వాహనం నిత్యావసర వస్తువుగా మారింది. ఇక ఆటో, డిసిఎం వంటి రవాణా చేసే వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌ ఎంత కీలకమో చెప్పనవసరం లేదు. ఒక సర్వే ప్రకారం సగటున ఒక్కొక్కరు వ్యక్తిగతంగా నెలకి 60 నుంచి 100 లీటర్ల వంతున పెట్రోల్‌/డీజిల్‌ వినియోగిస్తున్నారు. ప్రస్తుతం లీటరు పెట్రోల్‌ రూ.110లు, డీజిల్‌ రూ.100లుగా ఉంది. ఇందులో దాదాపు 60 రూపాయలు పన్నుగా వసూలు చేస్తున్నారు. అంటే మోటారు వాహనం వాడే ఒక సామాన్య వ్యక్తి నెలకి ఆరు వేల రూపాయల వంతున ఒక్క పెట్రోలియం ఉత్పత్తులకే పన్నులు చెల్లిస్తున్నాడు. ఇక దేశంలో ఎన్ని కోట్ల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి... ఎన్ని వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో దోచుకుంటున్నారో అంచనా వేయవచ్చు. అంతర్జాతీయంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గినప్పుడు అందుకు సంబంధించిన ప్రయోజనం ప్రజలకు అందకుండా కేంద్ర ప్రభుత్వం సెస్‌ల రూపంలో అదనపు పన్నులు విధిస్తోంది. అంతర్జాతీయంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగినప్పుడు మాత్రం ఏమి తెలియనట్టుగా అంతర్జాతీయంగా ధరలు పెరిగాయని, రూపాయి మారక విలువ పడిపోయింది అంటూ మరల పెట్రోల్‌ ధరలు పెంచుతోంది. ఇక రాష్ట్రాలకు ఆల్కాహాల్‌ ద్వారా ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఆదాయం గురించి చెప్పనవసరం లేదు. గత సంవత్సరం తెలంగాణ రాష్ట్రానికి ఆల్కాహాల్‌ ద్వారా పన్నుల రూపంలో 12,000 కోట్ల రూపాయల ఆదాయం రాగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి పన్నుల రూపంలో 44,178.51 కోట్ల ఆదాయం లభించింది.


‘‘మహాకవి శ్రీశ్రీ అన్నట్టు ముందు దగా... వెనుక దగా... కుడి ఎడమల దగాదగా’’ అన్నట్టు ప్రభుత్వాలు పన్నులను ఎడపెడా విధిస్తూ ప్రజలపై అదనపు భారం మోపుతున్నాయి. నిజానికి కేంద్రప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆహార పదార్థాలపై జిఎస్‌టిని తక్షణం విరమించుకోవాలి. అదేవిధంగా పెట్రోలియం, ఆల్కహాల్‌ ఉత్పత్తులను కూడా జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావాలి. 

అన్నవరపు బ్రహ్మయ్య

సీనియర్‌ జర్నలిస్ట్‌

Updated Date - 2022-08-03T06:29:46+05:30 IST