11 ఏళ్ల కనిష్ఠానికి వృద్ధి

ABN , First Publish Date - 2020-05-30T07:49:37+05:30 IST

భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ ప్రభావం ఏ స్థాయిలో ఉందనడానికి తాజాగా విడుదలైన వృద్ధి గణాంకాలే సంకేతం.

11 ఏళ్ల కనిష్ఠానికి  వృద్ధి

  • 2019-20 ఆర్థిక సంవత్సరానికి 4.2%
  • మార్చి త్రైమాసికంలో 3.1 శాతమే.. 
  • కరోనా కాటుకు ఎకానమీ బెంబేలు
  • జూన్‌ క్వార్టర్‌లో వృద్ధి పాతాళానికే..!

జీడీపీ వృద్ధి రేటు పడిపోయింది! 11 సంవత్సరాల్లో ఎన్నడూ లేనట్లుగా 4.2 శాతానికి పతనమైంది! 2008-09 ఆర్థిక సంవత్సరంలో తరహాలోనే 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 3.1 శాతం వృద్ధిరేటు నమోదైంది. ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి! ఇందుకు కారణం లాక్‌డౌన్‌! చివరి పది రోజులు మాత్రమే లాక్‌డౌన్‌ అమలైంది. కానీ, ఆ త్రైమాసికానికే కాదు.. ఆర్థిక సంవత్సరం మొత్తానికే వృద్ధి రేటుపై ప్రభావం చూపింది! ఇప్పుడు ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలోనూ భారీ పతనం తప్పదని అంచనా!!


భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ ప్రభావం ఏ స్థాయిలో ఉందనడానికి తాజాగా విడుదలైన వృద్ధి గణాంకాలే సంకేతం. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు  ప్రభుత్వం మార్చి చివరి వారంలో లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరానికీ అది చివరి వారం. లాక్‌డౌన్‌లోని ఆ ఏడు రోజుల కారణంగా జనవరి-మార్చి త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటు 3.1 శాతానికి పడిపోయింది. దేశంలో వస్తు, సేవల వినియోగం, పెట్టుబడులు మందగించడం మరో కారణం. దాంతో గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి వృద్ధి 2009  నాటి కనిష్ఠ స్థాయికి పతనమైంది. లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్‌లో దేశంలో వ్యాపార, ఉత్పత్తి కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ లెక్కన ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి వృద్ధి భారీ పతనాన్ని చవిచూడనుందని విశ్లేషకులంటున్నారు. ఏప్రిల్‌లో కీలక రంగాల ఉత్పత్తి రేటు పాతాళానికి పడిపోవడమే ఇందుకు సంకేతం. కోవిడ్‌ దెబ్బకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు మైనస్‌ 5 శాతానికి పడిపోనుందని పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, ఏజెన్సీలు అంచనా వేశాయి. ముందున్నది గడ్డుకాలమేనని హెచ్చరించాయి. 


న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి (2019-20) జీడీపీ వృద్ధి రేటు 11 ఏళ్ల కనిష్ఠ స్థాయి 4.2 శాతానికి పరిమితమైంది. నాలుగో త్రైమాసిక (జనవరి-మార్చి) వృద్ధి రేటు 3.1 శాతానికి పడిపోవడం ఇందుకు కారణమైంది. జాతీ య గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎ‌స్‌ఓ) శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2018-19)లో నాలుగో త్రైమాసికానికి వృద్ధి రేటు 5.7 శాతంగా నమోదైంది. 2018-19 ఆర్థిక సంవత్సరం మొత్తానికి వృద్ధి 6.1 శాతంగా ఉంది. ఎన్‌ఎ్‌సఓ గణాంకాల నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. 


2008-09 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 3.1 శాతానికి పతనమైంది. ఆ  తర్వాత భారత్‌కు మళ్లీ ఇదే కనిష్ఠ స్థాయి వార్షిక వృద్ధి 

కరోనా కట్టడి కోసం మార్చి 25న లాక్‌డౌన్‌ మొదలైంది. లాక్‌డౌన్‌లో గడిచింది చివరి వారం రోజులే అయినప్పటికీ జనవరి-మార్చి త్రైమాసిక వృద్ధి గత ఆర్థిక మాంద్యం నాటి కనిష్ఠ స్థాయికి దిగజారింది. లాక్‌డౌన్‌ ప్రభావంతోపాటు వినియోగం, పెట్టుబడులు మందగించడంతో మార్చి త్రైమాసికంలో వృద్ధి తగ్గుదలకు కారణమయ్యాయి 

2019-20లో వృద్ధి రేటు 5 శాతంగా నమోదు కావచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో విడుదల చేసిన మొదటి, రెండో ముందస్తు అంచనాల్లో ఎన్‌ఎ్‌సఓ కూడా ఇదే చెప్పింది. వాస్తవిక వృద్ధి మాత్రం అంచనాల కంటే బాగా తగ్గింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో వృద్ధి బాగా తగ్గడంతో పాటు మొదటి మూడు త్రైమాసిక వృద్ధి అంచనాలను ప్రభుత్వం దిగువముఖంగా సవరించడం కూడా వార్షిక వృద్ధిపై ప్రభావం చూపింది 

కరోనా దెబ్బకు అందరికంటే ముందే లాక్‌డౌన్‌  అయిన చైనా ఆర్థిక వృద్ధిరేటు జనవరి-మార్చి త్రైమాసికంలో -6.8 శాతానికి క్షీణించింది. దీన్ని బట్టి చూస్తే,  2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో భారత జీడీపీ సైతం భారీగా పతనం కావచ్చు 


రంగాల వారీగా జీవీఏ

గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి వస్తుతయారీ రంగ స్థూల విలువ జోడింపు (జీవీఏ) వార్షిక ప్రాతిపదికన -1.4 శాతానికి పతనమైంది. వ్యవసాయ రంగ జీవీఏ మాత్రం 5.9 శాతం వృద్ధిని  నమోదు చేసుకుంది. నిర్మాణ రంగ జీవీఏ -2.2 శాతానికి క్షీణించగా.. మైనింగ్‌ రంగం 5.2 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. విద్యుత్‌, గ్యాస్‌, నీటి సరఫరా తదితర సేవల రంగాల జీవీఏ వృద్ధి 4.5 శాతంగా ఉంది. వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్స్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ సేవల రంగ వృద్ధి 2.6 శాతానికి తగ్గింది. ఫైనాన్షియల్‌, రియల్‌ ఎస్టేట్‌, వృత్తి నైపుణ్య సేవల వృద్ధి 2.4 శాతానికి జారుకుంది. 


2019-20లో వృద్ధి రేటు  (%)

మొదటి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌) 5.2

రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబరు) 4.4

మూడో త్రైమాసికం (అక్టోబరు-డిసెంబరు) 4.1

నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి) 3.1

ఏడాది మొత్తానికి (ఏప్రిల్‌-మార్చి) 4.2


జీడీపీ రూ.145.66 లక్షల కోట్లు 

గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి స్థిర (2011-12) ధరల ఆధారిత వాస్తవిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రూ.38.04 లక్షల కోట్లకు పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి రూ.36.90 లక్షల కోట్లుగా ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరం మొత్తానికి జీడీపీ రూ.145.66 లక్షల కోట్లకు చేరుకుంది. 2018-19 ఆర్థిక సంవత్సరపు తొలి సవరణ గణాంకాల ప్రకారం జీడీపీ రూ.139.81 లక్షల కోట్లు. 


 తలసరి ఆదాయం రూ.1.34 లక్షలు 

గత ఆర్థిక సంవత్సరానికి ప్రజల తలసరి ఆదాయాన్ని (ప్రస్తుత ధరల ఆధారంగా) రూ.1,34,226గా అంచనా వేశారు. 2018-19లో నమోదైన రూ.126,521 తలసరి ఆదాయంతో పోలిస్తే 6.1 శాతం వృద్ధి చెందింది. 


 ఏడేళ్ల గరిష్ఠానికి ద్రవ్యలోటు

2019-20లో 4.6 శాతం 

భారత ద్రవ్యలోటు ఏడేళ్ల గరిష్ఠ స్థాయికి పెరిగింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు జీడీపీలో 4.6 శాతానికి పెరిగింది. ప్రభుత్వాదాయం అంచనాల కంటే భారీగా తగ్గడం ఇందుకు కారణమైంది. ప్రభుత్వానికి ఆయా మార్గాల్లో సమకూరే ఆదాయం కంటే వ్యయాలు ఎక్కువగా ఉండే పరిస్థితిని ద్రవ్యలోటు అంటారు. 2019 -20 బడ్జెట్‌లో ద్రవ్యలోటును 3.3 శాతంగా అంచనా వేసింది ప్రభుత్వం. ఫిబ్రవరిలో లోటు నియంత్రణ లక్ష్యాన్ని 3.8 శాతానికి సడలించారు. వాస్తవిక లోటు సవరించిన అంచనాల కంటే కూడా చాలా అధికంగా నమోదవడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వానికి రూ.17.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. బడ్జెట్‌లో అంచనా వేసిన రూ.19.31 లక్షల కోట్ల కంటే బాగా తగ్గింది. వ్యయాలు కూడా బడ్జెట్‌లో అంచనా వేసిన రూ.26.98 లక్షల కోట్ల కంటే కాస్త తగ్గి రూ.26.86 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 


కీలక రంగాలు కుదేలు 

ఏప్రిల్‌లో ఉత్పత్తి -38.1%కి పతనం 

కరోనా ధాటికి కీలక మౌలిక రంగాల పనితీరు రికార్డు స్థాయికి పతనమైంది. గతనెలకు 8 కీలక రంగాల ఉత్పత్తి మైనస్‌ (-) 38.1 శాతానికి క్షీణించింది. అంతక్రితం నెలలో (మార్చి)నూ ఉత్పత్తి -9 శాతం పతనాన్ని చవిచూసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. 2019 సంవత్సరంలో ఏప్రిల్‌ నెలకు ఈ రంగాల ఉత్పత్తి 5.2 శాతం వృద్ధిని నమోదు చేసుకోగలిగింది. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్‌, సిమెంట్‌, విద్యుత్‌ ఉత్పత్తిని కీలక రంగాలుగా పరిగణిస్తారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ రంగాల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)లో వీటి వాటా 40.27 శాతం.

Updated Date - 2020-05-30T07:49:37+05:30 IST