Abn logo
May 3 2021 @ 00:57AM

‘‘... దుఃఖం తెలుసు. దేవుడు తెలుసు’’

లల్ల పుట్టింది 14వ శతాబ్దపు కాశ్మీరంలో. దేవ భాషగా పరిగణింపబడే సంస్కృతంలో కాకుండా లోక భాష అయిన కాశ్మీరీలో ఆమె తన తత్త్వగీతాల్ని పాడుకొంది. వాటిల్లో ఆమె కాశ్మీర శైవం గురించి, సూఫీతత్వం గురించి సమాన స్థాయిలో చెబుతుంది. ఆ కారణంగా ఆమె హిందువులకు, ముస్లింలకు ప్రేమ పాత్రురాలయింది. హిందువులకు ఆమె లల్లేశ్వరి, లల్లా యోగిని. ముస్లింలకు లాల్‌ ఆరిఫ్‌. 


ఆమె పాటలు ఆమెకు గొప్ప కవయిత్రిగా, భక్తాగ్రగణ్యురాలిగా ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి. కబీర్‌, జ్ఞానేశ్వర్‌, తుకారాంల కోవకు చెందిన భక్త కవి ఆమె. 


పెక్కుమంది లల్లా వాక్కులను ఇంగ్లీషులోకి అనువదించారు. వారిలో రంజిత్‌ హొస్కోటే చేసిన అనువాదం ఈ క్రింది వాటికి ఆధారమయింది. 


శివుడో కేశవుడో బ్రహ్మో: భవరోగాన్ని బాపేవాడు ఎవరైనా ఒకటే నాకు.


పప్పుబెల్లాల మూటను బుజం మీద మోస్తున్నా. బిగుతుగా కట్టిన తాడు జారి వదులైంది. దారి తప్పి రోజంతా వృథా చేసుకొన్నా. గురువు చెప్పింది పెడచెవిని పెట్టినందుకు తగిన శాస్తి అయింది. గొర్రెల మందకు కాపు కరువయ్యాడు. ఏది దారి?


దేహమే నేనని అనుకోవటం వల్ల నీవెవరో, నేనెవరో తెలుసుకోలేకపోయాను. నీవు నేను ఒకటే అన్నది గ్రహించలేక బ్రతుకంతా సంశయంతో గడిపాను. 

ప్రేమలోపడి పిచ్చిదానిలా రాత్రింబవళ్ళు తెగవెతికాను. తిరిగి చూద్దును గదా, అతడు నా ఇంట్లోనే అగపడ్డాడు. ఆహా, ఏమి అదృష్టం అని వెళ్ళి గట్టిగా కౌగిలించుకొన్నాను. 


లల్ల జీవితం పత్తికాయలా మొదలైంది. అది విచ్చుకొనే దశకు చేరుకొనేసరికి, దాన్ని కోసి పింజ తీశారు. ఏకారు, వడికారు. మగ్గంలో పెట్టి కొట్టారు, బండకేసి ఉతికారు, ముక్కలు ముక్కలుగా కత్తిరించారు, ఆఖరుకు అంగీ కుట్టారు. అప్పటికిగాని లల్లకు విముక్తి దొరకలేదు. 


పద్మాసనం వేస్తేనూ, వాయుస్తంభన చేస్తేనూ సత్యం బోధపడదు. పగటి కలలు మోక్ష ద్వారాన్ని దాటించలేవు. నీళ్ళలో ఎంత ఉప్పులేసి కలిపినా, ఆ నీళ్ళు సముద్రం కావు గదా!


ఈ చావు పుట్టుకల ప్రపంచంలోకి వచ్చిన నాకు, జ్ఞాన దీపం వెలుగులో ఆత్మ సాక్షాత్కారం కలిగింది. ఇహ ఇప్పుడు నా కోసం ఎవరూ చావనక్కరలేదు. నేనూ ఎవరి కోసం చావ నక్కర్లేదు. చావు పుట్టుకల ద్వంద్వం దాటిన వానికి ఆ రెండూ ఎంత అద్భుతం!


లక్షసార్లు అడిగుంటాను గురువుగార్ని, శూన్యానికేదో పేరు పెట్టండని. విసుగొచ్చి అడగటం మానేశాను. అన్ని పేర్లు ఉద్భ వించే శూన్యానికి ఏం పేరు పెట్టవీలవుతుంది?


మతగ్రంథాలు మూలపడ్డాక మంత్రాలు మిగుల్తవి. మంత్రాలు మూగబోయాక మనస్సు మిగు ల్తది. మనస్సు లయించినాక ఏం మిగుల్తది? శూన్యం శూన్యంలో కలుస్తది. 


శివుడు గుర్రం. విష్ణువు జీను. బ్రహ్మ రికాబు. స్వారీ చేసే రౌతు ఎవరో సిద్ధయోగికి తెలుసు. 


చలికి తట్టుకొనేంతవరకే బట్ట. ఆకలికి తట్టుకొనేంత వరకే తిండి. కాలం తీరాక పక్షులు తినేదానికే దేహం. 


నీ గాడిదను దొడ్లో కట్టిపడెయ్యి. లేదంటే అది నీ పొరుగు వాని పంటపొలంలో చొరబడి తొక్కి పాడు చేస్తుంది. నీ కంఠం మీద కత్తి పెట్టినప్పుడు, ఎవడూ నిన్ను కాపాడ్డానికి రాడు. 


వాళ్ళు చేసే అవమానాలు, పెట్టే శాపనార్థాలు నేను లెక్క పెట్టను. పూలతో పూజిస్తామన్నా పట్టించుకోను. శివుడికే అంకితమైనదాన్ని నేను. బూడిద అద్దాన్ని మరుగుపరుస్తుందా, రుద్ది మెరిసేట్టు చేస్తుంది గాని?


ఒకడు నిద్రపోతున్నా జాగరూకుడే. ఒకడు జాగరూకుడైనా నిద్రితుడే. ఒకడు గంగలో స్నానం చేసినా అపవిత్రుడే. ఒకడు లౌకిక వ్యవహారాల్లో నిమగ్నుడైనా నిర్మోహియే. 


పదిమంది మెప్పు కోసం పాకులాడింది లేదు. సుఖాల కోసం వెంపర్లాడింది లేదు. ఆకలి తెలుసు నాకు. దుఃఖం తెలుసు. దేవుడు తెలుసు. 

దీవి సుబ్బారావు

96762 96184


Advertisement
Advertisement
Advertisement