పరిషత్‌ పోరుకు గ్రీన్‌సిగ్నల్‌!

ABN , First Publish Date - 2021-04-08T07:26:12+05:30 IST

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు ధర్మాసనం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన చేయొద్దని స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈ నెల 1న ఎస్‌ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా తదుపరి చర్యలను, ఎన్నికలను నిలుపుదల చేస్తూ సింగిల్‌ జడ్జి ఈ నెల 6న ఇచ్చిన మఽధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది.

పరిషత్‌ పోరుకు గ్రీన్‌సిగ్నల్‌!

  • -నేటి పోలింగ్‌కు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఓకే... కౌంటింగ్‌కు నో
  • -వర్ల వ్యాజ్యం పరిష్కారమయ్యేదాకా ఫలితాలూ వద్దు
  • -ఎన్నికలను నిలిపివేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు రద్దు
  • -వివాదాస్పద అంశాలు తేల్చేందుకు మరింత లోతైన విచారణ జరపాలి
  • -సింగిల్‌ జడ్జికే బాధ్యత అప్పగింత
  • -15న విచారణకు వచ్చేలా చర్యలు
  • -రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశం


అమరావతి, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు ధర్మాసనం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన చేయొద్దని స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈ నెల 1న ఎస్‌ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా తదుపరి చర్యలను, ఎన్నికలను నిలుపుదల చేస్తూ సింగిల్‌ జడ్జి ఈ నెల 6న ఇచ్చిన మఽధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. అత్యవసరంగా హౌస్‌మోషన్‌ దాఖలు చేయడం వల్ల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్‌ విధించలేదన్న పిటిషనర్‌ వ్యాజ్యంలో పూర్తి స్థాయి అఫిడవిట్‌ దాఖలు చేయలేకపోయామని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) చెబుతున్నందున.. ఈ వ్యవహారంలో లోతైన విచారణ జరిపి వివాదాస్పద అంశాలను తేల్చాల్సి ఉందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వేసిన వ్యాజ్యం ఈ నెల 15న సింగిల్‌ జడ్జి ముందు విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌ కుమార్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశించింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఎస్‌ఈసీ దాఖలుచేసిన అప్పీల్‌ను పరిష్కరించింది. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ.. 1న ఎస్‌ఈసీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసిందని పేర్కొంటూ వర్ల రామయ్య వ్యాజ్యం దాఖలు చేయడం.. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి.. 8న పోలింగ్‌ను నిలిపివేస్తూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులివ్వడం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పోలింగ్‌ తేదీకి 4 వారాల ముందు ఎన్నికల కోడ్‌ అమలు చేసేలా రీ-నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఎస్‌ఈసీకి సూచించింది. ఈ ఆదేశాలపై ఎస్‌ఈసీ కార్యదర్శి కన్నబాబు మంగళవారమే అప్పీల్‌ వేశారు. దానిపై ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. వ్యాజ్యం వేసే అర్హత పిటిషనర్‌కు ఉందా లేదా అనే విషయాన్ని సింగిల్‌ జడ్జి నిర్దిష్టంగా తేల్చలేదని తెలిపింది. ‘మధ్యంతర ఉత్తర్వులు జారీచేసే సమయంలోనే తుది నిర్ణయం వెల్లడించినట్లుగా ఉంది. ఎందుకంటే కోడ్‌ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తాజా నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఎస్‌ఈసీని ఆదేశించడం తుది ఉత్తర్వుల్లాంటివే’ అని పేర్కొంది. కోడ్‌ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చాక నిర్వహించిన పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో 4వారాలకు ముందుగా కోడ్‌ విధించలేదన్న విషయం సింగిల్‌ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదు. సింగిల్‌ జడ్జి వద్ద వర్ల రామయ్య దాఖలు చేసిన వ్యాజ్యం పరిష్కారమయ్యేదాకా ఎన్నికల ఫలితాలను ప్రకటించవద్దు’ అని ఎస్‌ఈసీకి స్పష్టంచేసింది.


రిట్‌ పిటిషన్‌ వేయడానికి వీల్లేదు..: మోహన్‌రెడ్డి

ఎస్‌ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వ్యక్తిగత ప్రయోజనం లేనప్పుడు రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయడానికి వీల్లేదన్నారు. పిటిషనర్‌ దాఖలు చేసిన వ్యాజ్యం ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని పోలి ఉందని.. దానిపై ధర్మాసనం విచారణ జరపాలని కోరారు. పిటిషనర్‌ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, పిటిషన్‌ వేసేందుకు వర్ల రామయ్యకు అర్హత లేదని తాము వాదించినా సింగిల్‌ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. గతంలో ఎస్‌ఈసీ నిర్వహించిన పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో 4వారాల ముందు కోడ్‌ విధించలేదన్నారు. సుప్రీంకోర్టు ఏ నేపథ్యంలో ఆ ఆదేశాలిచ్చిందో పరిగణనలోకి తీసుకోవాలన్నారు. గతేడాది కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేసినప్పుడు కోడ్‌ అమల్లో ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతాయన్న ప్రభుత్వ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించిందని.. కోడ్‌ను సడలించి, తదుపరి పోలింగ్‌ తేదీకి 4 వారాల ముందు కోడ్‌ విధించాలని గరిష్ఠ గడువు పెట్టిందన్నారు. 10రోజులు కోడ్‌ విధించి ఎన్నికలు నిర్వహించే విచక్షణాధికారం ఎస్‌ఈసీకి ఉందన్నారు. పోలింగ్‌ తేదీకి 4వారాల ముందు కోడ్‌ విధించాలన్న చట్ట నిబంధనలేమీ లేవన్నారు. పిటిషనర్‌ హౌస్‌ మోషన్‌ దాఖలు చేయడంతో పూర్తిస్థాయి అఫిడవిట్‌ దాఖలు చేయలేకపోయామన్నారు. ఎన్నికల నిర్వహణకు అన్నిఏర్పాట్లూ పూర్తిచేశామని, అందుచేత సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను రద్దు చేసి.. ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసినందున పిటిషనర్‌ రిటి పిటిషన్‌ ఎందుకు దాఖలు చేయకూడదని ఎస్‌ఈసీని ప్రశ్నించింది.


జడ్జి కారణాలు చెప్పారు: వేదుల

ఎన్నికలు నిలుపుదల చేసిన సింగిల్‌ జడ్జి అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొన్నారని పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా, స్వచ్ఛంగా నిర్వహించాలని కోరే హక్కు ప్రతి పౌరుడికీ ఉందన్నారు. ‘పోలింగ్‌ తేదీకి 4వారాల ముందు కోడ్‌ను అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. వాటిని పక్కనట్టి ఎస్‌ఈసీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ చేయడానికి వీల్లేదు. రాజ్యాంగసంస్థ అయిన ఎస్‌ఈసీ సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండాలి. 1న నోటిఫికేషన్‌ ఇచ్చి.. 8న పోలింగ్‌ తేదీగా ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పదిరోజుల మాత్రమే కోడ్‌ విధించారు. రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయడంపై ఎస్‌ఈసీ అభ్యంతరం చెప్పడం సరికాదు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవద్దు’ అని అభ్యర్థించారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపిస్తూ... ఎస్‌ఈసీ వాదనలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. కరోనా తగ్గాక స్థానిక ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి కోడ్‌ అమల్లో ఉందని.. ఈ కారణంగా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కూడా నిర్వహించలేదన్నారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయినందున సింగిల్‌ జడ్జి ఎన్నికల ప్రక్రియలో కలుగజేసుకోకుండా ఉండాల్సిందన్నారు. అన్ని పక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పై ఆదేశాలిచ్చింది. వర్ల రామయ్య వ్యాజ్యంపై లోతైన విచారణ జరిపే బాధ్యతను సింగిల్‌ జడిక్జి  అప్పగించింది.

Updated Date - 2021-04-08T07:26:12+05:30 IST