వరంగల్‌లో రాజకీయ కోలాహలం

ABN , First Publish Date - 2021-04-16T04:47:09+05:30 IST

వరంగల్‌లో రాజకీయ కోలాహలం

వరంగల్‌లో రాజకీయ కోలాహలం

 నోటిఫికేషన్‌ విడుదలతో పార్టీల్లో సందడి  

 టికెట్ల కోసం ఆశావహుల యత్నాలు ముమ్మరం

  కాంగ్రెస్‌ జీబ్ల్యూఎంసీ ఎన్నికల ఇన్‌చార్జిగా కుసుమకుమార్‌ జెట్టి

 టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు డివిజన్ల వారీగా బాధ్యతలు  

 ప్రచారానికి హైదరాబాద్‌, కరీంనగర్‌ కార్పొరేటర్లు

వరంగల్‌ సిటీ, ఏప్రిల్‌ 15 : వరంగల్‌ నగరంలో ‘గ్రేటర్‌’ ఎన్నికల సందడి మొదలైంది. డివిజన్ల రిజర్వేషన్ల ప్రకటన, నోటిఫికేషన్‌ విడుదలతో  డివిజన్లలో ఎన్నికల మోత మోగనుంది. హడావిడిగా రాజకీయపార్టీలు సమావేశాలతో బిజీ అయ్యాయి. మరోవైపు రిజర్వేషన్ల ప్రకారం అధికార పార్టీలో తాజా మాజీలు, ఆశావహులు యత్నాలను ముమ్మరం చేశారు. ఇక మిగతా పార్టీల్లోనూ ఆశావహులు టికెట్ల వేటలో పడ్డారు. డివిజన్లలో ఎన్నికల ప్రచార వేడి రాజుకోనుంది. ఈనెల 28 వరకు నగరంలో ప్రచారాలను హోరెత్తించనున్నారు. మరోవైపు కరోనా విజృంభనతో ఎన్నికలపై నగర వాసుల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. ఎన్నికల సంబరంలో పడి నాయకులు మాస్కులు పెట్టుకోకుండా, భౌతిక దూరం పాటించకుండా వైర్‌సను వ్యాపింపజేస్తారేమోననే భయం జనాన్ని ఆందోళన కలిగిస్తోంది. 

డివిజన్ల బాట

అధికారపార్టీ తాజా మాజీలు, ఆశావహులు డివిజన్ల బాటలో పడ్డారు. మరోవైపు టికెట్‌ కోసం ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఏ మార్గంలోనైనా సరే టికెట్‌ పట్టాలనే ఉద్దేశంతో విశ్వయత్నాలు చేస్తున్నారు. పోటీదారులుగా భావిస్తున్న పార్టీలోని ఆశావహులను అప్పుడే ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. ఈసారికి వదిలేయ్‌ అన్నా.. అంటూ బుజ్జగిస్తున్నారు. 

హడావిడిగా సమావేశాలు

ప్రధాన రాజకీయ పార్టీలు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, వామపక్షాల ముఖ్య నేతలు పార్టీ శ్రేణులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు, ప్రత్యర్థుల బలాబలాలు, ప్రచార నిర్వహణ, డివిజన్ల వారీగా బాధ్యతల అప్పగింత తదితర అంశాలపై చర్చించారు. చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఆశావహులు దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు జరిపారు.  

బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి జితేందర్‌రెడ్డి కూడా మహిళా విభాగం, ఇతర ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. కొద్దిరోజులుగా ఆయన ఇక్కడే ఉండి ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ శుక్రవారం వరంగల్‌కు రానున్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి. ఇక కాంగ్రెస్‌ కూడా ఎన్నికల రణరంగానికి సిద్ధమవుతోంది. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కుసుమకుమార్‌ జెట్టి ఆ పార్టీ తరఫున జీబ్ల్యూఎంసీ ఎన్నికల ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఇక డివిజన్ల వారీగా కూడా పార్టీ నేతలకు బాధ్యతలను అప్పగించేందుకు  ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 

హైదరాబాద్‌, కరీంనగర్‌ కార్పొరేటర్లు...

ప్రచార బలాన్ని మిగతా పార్టీల కంటే అధికంగా సమకూర్చుకునే వ్యూహాంతో టీఆర్‌ఎస్‌ అడుగులు వేస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రచారానికి వరంగల్‌ కార్పొరేటర్లు వెళ్లారు. ఇదే ఫార్ములాను వరంగల్‌లో గులాబీ దళం అమలు చేస్తోంది. హైదరాబాద్‌, కరీంనగర్‌ కార్పొరేటర్లను గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికల ప్రచారంలోని దింపే ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

ఎమ్మెల్యేలకు బాధ్యతలు 

నగరంలోని 66 డివిజన్లలో ఒక్కో డివిజన్‌ బాధ్యతలను ఒక్కో ఎమ్మెల్యేకు అప్పగించేందుకు టీఆర్‌ఎస్‌ స్కెచ్‌ వేస్తోంది. గత బల్దియా ఎన్నికల్లో ఇదే తరహాలో వ్యూహాన్ని అమలు చేశారు. ఈసారి జరిగే ఎన్నికలకు కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ల చైర్మన్లు డివిజన్ల బాధ్యతలు చేపడతారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇక బీజేపీ కూడా జీహెచ్‌ఎంసీ నుంచి తమ పార్టీ కార్పొరేటర్లను డివిజన్లలో డంప్‌ చేయనుంది. బండి సంజయ్‌, ఎంపీ అర్వింద్‌, ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారని చెబుతున్నారు. ఇక కాంగ్రెస్‌ కూడా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఇతర ప్రముఖ నేతలను వరంగల్‌లో ప్రచార పర్వానికి రంగంలోకి దింపుతోంది. 

సాగర్‌ టూ వరంగల్‌..

నాగార్జున సాగర్‌ ఉపఎన్నిక ప్రచారం గురువారంతో ముగిసింది. జీడబ్ల్యూఎంసీతో పాటు ఖమ్మం ఇతర కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో పుర పోరు ప్రారంభమైంది. సాగర్‌లో ప్రచారపర్వాన్ని ముగించుకున్న పార్టీల నాయకులు ఇక వరంగల్‌ బాట పట్టారు. ప్రచారాన్ని హోరెత్తించేందుకు కనీసం వారం రోజులైనా విరామం లేకుండా ఛలో వరంగల్‌ అంటూ బయలుదేరాల్సి వచ్చింది.

Updated Date - 2021-04-16T04:47:09+05:30 IST