ఈసారి మహా పతనం!

ABN , First Publish Date - 2020-09-12T06:27:17+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో భారత జీడీపీ వృద్ధి రేటు -11.5 శాతానికి క్షీణించవచ్చని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ అంచనా వేసింది.

ఈసారి మహా పతనం!

2020-21లో వృద్ధి -11.5%కి క్షీణత

అంచనాలు సవరించిన మూడీస్‌ 


న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో భారత జీడీపీ వృద్ధి రేటు -11.5 శాతానికి క్షీణించవచ్చని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ అంచనా వేసింది. గతంలో అంచనా వేసిన -4 శాతం వృద్ధి పతనంతో పోలిస్తే చాలా అధికం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2021-22) మాత్రం వృద్ధి రేటు 10.6 శాతానికి పుంజుకోవచ్చని మూడీస్‌ భావిస్తోంది. ఈ వారంలో పలు సంస్థలు భారత్‌ జీడీపీ అంచనాలను సవరించాయి. మరో అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌.. ఈసారి వృద్ధి క్షీణతను -10.5 శాతంగా అంచనా వేసింది. దేశీయ రేటింగ్‌ ఏజెన్సీలైన క్రిసిల్‌ -9 శాతం, ఇండియా రేటింగ్స్‌ -11.8 శాతంగా అంచనా వేశాయి. ఈసారి వృద్ధి ఏకంగా -14.8 శాతానికి పడిపోవచ్చని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం గోల్డ్‌మన్‌ శాక్స్‌ హెచ్చరించింది. శుక్రవారం నాడు కేర్‌ రేటింగ్స్‌ కూడా అంచనాలు సవరించింది. 2020-21 వృద్ధి పతనాన్ని గతంలో అంచనా వేసిన -6.4 శాతం నుంచి -8.2 శాతానికి పెంచింది. 


భారత పరపతి సామర్థ్యానికి గండి

వృద్ధి క్షీణత, అధికమవుతోన్న అప్పుల భారం, ఆర్థిక సేవల రంగం బలహీనపడటం వంటి అంశాలు భారత పరపతి సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని మూడీస్‌ హెచ్చరించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో వస్తు వినియోగంతోపాటు వ్యాపార కార్యకలాపాలు తగ్గడంతో చాలా రంగాల పరపతి సామర్థ్యం బలహీనపడుతోందని మూడీస్‌ పేర్కొంది. గిరాకీ గణనీయంగా తగ్గుతున్న, వస్తు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్న రంగాల క్రెడిట్‌ రేటింగ్‌పై ఏజెన్సీ ప్రతికూల వైఖరిని కనబర్చింది. 

Updated Date - 2020-09-12T06:27:17+05:30 IST